అధికారం పోయినా.. ఆగడాలు ఆగట్లేదు

TDP Leader Threatened Officer In Markapur - Sakshi

మున్సిపల్‌ ఉద్యోగిపై మాజీ ఎమ్మెల్యే సోదరుడి దాష్టీకం

చంపుతానంటూ గొంతు పట్టుకొని దాడి

పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు

దాడిని ఖండించిన ఉద్యోగులు, వైఎస్సార్‌ సీపీ నేతలు

సమయం.. శనివారం రాత్రి 7 గంటలు.. ప్రదేశం.. మార్కాపురంలోని మున్సిపల్‌ కార్యాలయం. అక్కడ విధి నిర్వహణలో ఉన్న ఓ ఉద్యోగి కొత్తగా నియమితులైన వలంటీర్లకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఇంతలో ఒక్కసారిగా కార్యాలయంలోకి దూసుకొచ్చిన టీడీపీ నేత ఆ ఉద్యోగిపై గూండాగిరి ప్రదర్శించాడు. ఎక్కడి నుంచి వచ్చావురా నువ్వు.. అంటూ ఆ ఉద్యోగి గొంతు పట్టుకున్నాడు. చంపుతా.. నా.. అంటూ అసభ్య పదజాలంతో దూషిస్తూ.. చెంప చెళ్లుమనేలా కొట్టాడు. అక్కడే ఉన్న సిబ్బంది అడ్డుకోవడంతో పెద్దగా కేకలు వేస్తూ వేలు చూపి, హెచ్చరికలు జారీ చేస్తూ దర్జాగా బయటకు వెళ్లాడు. హఠాత్తుగా జరిగిన పరిణామానికి బాధితుడితో పాటు అక్కడున్నవారంతా నిశ్ఛేష్టులయ్యారు. అధికారం కోల్పోయినా టీడీపీ నేతల ఆగడాలు మాత్రం ఆగలేదనడానికి మార్కాపురం పట్టణంలోని చోటుచేసుకున్న ఈ ఘటనే ఉదాహరణ 

సాక్షి, మార్కాపురం(ప్రకాశం): అధికారంలో కోల్పోయినా ఇంకా ఉన్నామన్న భ్రమతో టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. ఐదేళ్ల పాటు మున్సిపాలిటీపై పెత్తనం చేసిన వారు ఇంకా చేయాలని ప్రయత్నిస్తున్నారు. తమ మాట వినటం లేదనే అక్కసుతో ఉద్యోగులపై దాడులు తెగపడుతున్నారు. టీడీపీ నేతల దాడులతో ఉద్యోగులు భయాందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళితే... మార్కాపురం మున్సిపల్‌ కార్యాలయంలోషేక్‌ జహంగీర్‌ సీనియర్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. శనివారం రాత్రి 7.15 గంటల సమయంలో కార్యాలయంలోని తన గదిలో కూర్చుని విధులు నిర్వర్తిస్తున్నాడు.

ఆ సమయంలో మార్కాపురం పట్టణానికి చెందిన మాజీ ఎమ్మెల్యే సోదరుడు వచ్చి జహంగీర్‌పై దాడికి బడ్డాడు. తీవ్ర దుర్భాషలాడాడు. కార్యాలయంలో ఉన్న ఇతర సిబ్బంది అడ్డుకోవడంతో తీవ్రంగా దూషిస్తూ వెళ్లిపోయాడు. జరిగిన ఘటనపై బాధితుడు రాత్రి 9.15 గంటల సమయంలో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే సోదరుడు కార్యాలయంలో ఉన్న తన దగ్గరకు వచ్చి దుర్భాషలాడుతూ అకారణంగా దాడి చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. వలంటీర్లకు వారి బాధ్యతలు చెబుతుండగా దూకుడుగా వచ్చి తనపై దాడి చేసి కొట్టాడని పేర్కొన్నారు.

అనంతరం తీవ్ర ఒత్తిళ్లు రావటంతో భయాందోళనకు గురైన బాధితుడు ఆ తర్వాత కొద్ది సేపటికి తాను ముందు ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకొని గుర్తు తెలియని వ్యక్తి తనపై దాడి చేసినట్లుగా మార్చి మరో ఫిర్యాదు కాపీ పోలీసులకు అందజేశాడు. ఈ దాడిని తీవ్రంగా ఖండించిన మున్సిపల్‌ ఉద్యోగులంతా రాత్రి 9 గంటలకు ఐక్యంగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. పట్టణ ఎస్సైతో పాటు సీఐ, డీఎస్పీలకు ఫిర్యాదులు పంపారు. టీడీపీ నేతలు తాము ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమలో ఉన్నారని, తామేం చేసినా చెల్లుతుందనే భావనలో ఉండి మున్సిపల్‌ ఉద్యోగిపై దాడికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనను ఖండించిన వైఎస్సార్‌ సీపీ నాయకులు, ఉద్యోగులపై దాడులకు పాల్పడటం మానుకోవాలని హితవు పలికారు. పెత్తనం చెలాయించటం మంచిది కాదన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top