అధికారం అండగా.. వేశారు పాగా | Sakshi
Sakshi News home page

అధికారం అండగా.. వేశారు పాగా

Published Sun, Mar 1 2020 4:13 AM

TDP Leader Factory In Endowment Department Lands - Sakshi

సాక్షి, అమరావతి : అధికారం అండగా టీడీపీ నేతలు పాల్పడిన అక్రమాలు ఒక్కటొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. విజయవాడ నడిబొడ్డున వేద పాఠశాల ఏర్పాటు చేయాలన్న ఓ ట్రస్టు ఆశయాన్ని టీడీపీ అధికార ప్రతినిధి, మాజీ మేయర్‌ పంచుమర్తి అనురాధ కుటుంబానికి చెందిన ప్రసాదరావు తుంగలో తొక్కి, భూమిని కబ్జా చేసిన విషయం ఇటీవల బట్టబయలైంది. ఆక్రమించుకున్న భూమిలో ఏకంగా షెడ్డు వేసి, ఓ ఫ్యాక్టరీ నెలకొల్పడం విస్తుగొలుపుతోంది. శ్రీకాంచనపల్లి కనకాంబ ట్రస్టుకు విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న లబ్బీపేటలో దాదాపు రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్ల విలువ చేసే భూములున్నాయి.

2000లో చంద్రబాబు సీఎంగా ఉన్నారు. ఆ సమయంలో అప్పటి దాకా దేవదాయ శాఖ పరిధిలో ఉన్న శ్రీకాంచనపల్లి కనకాంబ ట్రస్టు నిర్వహణను కొన్ని మినహాయింపులతో ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించారు. అప్పట్లో విజయవాడ నగర మేయర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పంచుమర్తి అనురాధ కుటుంబ సభ్యులు ఈ ట్రస్టు భూములను అక్రమ మార్గంలో చేజిక్కించుకున్నారు. ట్రస్టు పేరిట ఉండే భూమిని ట్రస్టుకు ఏ సంబంధం లేని వ్యక్తుల నుంచి కొనుగోలు చేసినట్టు రికార్డులు సృష్టించి, ఆ భూమిలో పరిశ్రమను ఏర్పాటు చేసుకున్నారు.  

అవి కనకాంబ ట్రస్టు భూములే..
ట్రస్టు నిర్వహణ వ్యవహారాలు 2016లో తిరిగి దేవదాయ శాఖ అధీనంలోకి వచ్చాయి. ట్రస్టు భూముల్లో టీడీపీ నేతలు పరిశ్రమను ఏర్పాటు చేసిన విషయం గోప్యంగా ఉండింది. గత ఏడాది జూలైలో ఈ కబ్జా వ్యవహారం వెలుగులోకి రావడంతో దేవదాయ శాఖ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. ఆ భూములు శ్రీకాంచనపల్లి కనకాంబ ట్రస్టువేనని స్పష్టంగా దేవదాయ శాఖ వద్ద రికార్డులు ఉండడంతో వాటిని స్వాధీనం చేసుకోవాలని ట్రిబ్యునల్‌.. విజయవాడ అసిస్టెంట్‌ కమిషనర్, ట్రస్టు ఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. గత ఏడాది డిసెంబర్‌లో తీర్పు వెలువరించినప్పటికీ, తీర్పు కాపీ జనవరి 30న దేవదాయ శాఖకు చేరింది. దీంతో ఇప్పుడు ఆ భూములను స్వాధీనం చేసుకునేందుకు దేవదాయ శాఖ అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. 

టీడీపీ నేతల దోపిడీతో ట్రస్టు ఆశయాలు గాలికి 
వేద పాఠశాల ఏర్పాటుతో పాటు.. తెలుగు, సంస్కృత భాష చదువుకునే విద్యార్థులకు భోజన వసతి కల్పించడం, ఇతరత్రా సదాశయాలతో విజయవాడకు చెందిన కాంచనపల్లి కనకాంబ 1958లో ఈ ట్రస్టును ఏర్పాటు చేశారు. ట్రస్టు పేరుతో విజయవాడ, పరిసర ప్రాంతాల్లో కూడా పలు ఆస్తులున్నట్టు దేవదాయ శాఖ రికార్డుల్లో ఉంది. అయితే అవి ఎక్కడెక్కడ ఉన్నాయన్నది స్పష్టంగా లేకపోవడం, మరికొన్ని రికార్డుల్లో స్పష్టంగా ఉన్నా అవి టీడీపీ నేతలతో పాటు మరికొందరి చేతుల్లోకి వెళ్లడంతో ట్రస్టు స్థాపించిన ఆశయాలు ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం ఆక్రమణలో ఉన్న భూమిని స్వాధీనం చేసుకుని, అక్కడ వేద పాఠశాల ఏర్పాటుకు దేవదాయ శాఖ కసరత్తు ప్రారంభించింది.  

భూముల స్వాధీనానికి చర్యలు : ఈవో
ట్రిబ్యునల్‌ ఆదేశాల మేరకు ట్రస్టు భూములు స్వాధీనం చేసుకోవాలని దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ నుంచి మాకు ఆదేశాలు అందాయి. రెవిన్యూ, పోలీసు అధికారుల సహాయంతో త్వరలోనే ఆ భూములను స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
– యడవల్లి సీతారామయ్య, ట్రస్టు ఈవో. 

 
Advertisement
 
Advertisement