శ్రీకాకుళం: అధికార టీడీపీ కార్యకర్తల దౌర్జన్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గతంలో పలువురు ప్రభుత్వ అధికారులపై దాడిచేసిన ఘటనలు జిల్లాలో చోటుచేసుకోగా.. తాజాగా సంతకవిటి మండలానికి చెందిన పంచాయతీ కార్యదర్శిపై మండలాభివృద్ధి అధికారి సాక్షిగా ఓ తెలుగుదేశం పార్టీ కార్యకర్త దాడికి పాల్పడ్డాడు. సంతకవిటి మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా జనన ధ్రువీకరణ పత్రం ఇవ్వాలంటూ పంచాయతీ సెక్రటరీని టీడీపీ కార్యకర్త డిమాండ్ చేయగా.. దానికి ససేమీరా అనడంతో దాడికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. మండల పరిధి వాసుదేవపట్నం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త గురుగుబెల్లి రాజు మండలాభివృద్ధి కార్యాలయానికి వచ్చాడు.
ఎంపీడీఓ జి.వేణుగోపాలనాయుడు చాంబర్‌లో అదే గ్రామానికి చెందిన పంచాయతీ కార్యదర్శి వడగ గౌరీశంకరరావును పిలిపించి శ్రీకాకుళంలో జన్మించిన బిడ్డ పేరున జనన ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా జనన ధ్రువీకరణ పత్రం ఇవ్వలేనని కార్యదర్శి స్పష్టం చేయడంతో ఆవేశానికి గురైన రాజు గట్టిగా కేకలు వేస్తూ కార్యదర్శిపై దాడికి దిగాడు. ఎంపీడీఓ వారిస్తున్నప్పటికీ వినకుండా గౌరీశంకరరావుపై దాడి చేశాడు. అక్కడున్నవారంతా అడ్డుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. దాడికి గురైన పంచాయతీ కార్యదర్శితోపాటు మండల పరిషత్ కార్యాలయానికి చెందిన మిగిలిన కార్యదర్శులు, ఎన్‌జీఓ సంఘ నాయకులు స్థానిక పోలీసుస్టేషన్‌కు చేరుకొని ఎస్సై ఎస్.చిరంజీవికి టీడీపీ కార్యకర్త రాజుపై ఫిర్యాదు చేశారు. విధుల్లో ఉన్న కార్యదర్శిపై ఎంపీడీఓ సమక్షంలో దాడికి పాల్పడడం చట్టరీత్యా నేరమని మండిపడ్డారు. 
దాడికి పాల్పడిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పంచాయతీ కార్యదర్శులు, ఎన్‌జీవో ఉద్యోగులు ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై చెప్పారు.
నేడు విధుల బహిష్కరణ 
ఇదిలా ఉండగా పంచాయతీ కార్యదర్శిపై టీడీపీ కార్యకర్త రాజు దాడికి నిరసనగా గురువారం విధులు బహిష్కరించాలని పంచాయతీ కార్యదర్శులంతా నిర్ణయించారు. జిల్లాలోని ఎన్‌జీఓ సంఘ ఉద్యోగులు, పంచాయతీ కార్యదర్శులు తమకు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. ఉద్యోగులపై టీడీపీ కార్యకర్తలు, నేతలు దౌర్జన్యాలు చేయడం ప్రజస్వామ్యానికి విరుద్ధమని, ఇటువంటి హేయమైన చర్యను ఇంత వరకు చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 
దాడి దారుణం
అరసవల్లి:  సంతకవిటి మండలం వాసుదేవపట్నం పంచాయతీ కార్యదర్శి వి.గౌరిశంకర్‌పై  గురుగుబిల్లి రాజు అనే వ్యక్తి భౌతికంగా దాడి చేయడం దారుణమని, ఈఘటనను తాము ముక్తకంఠంతో ఖండిస్తున్నామని జిల్లా పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బివి.రమణ, ఎం.భాస్కరరావులు ప్రకటించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఎంపీడీవో సమక్షంలోనే  కార్యదర్శిపై దాడి జరిగిందని, విధుల్లో ఉన్న ఉద్యోగిపై దాడి చేయడాన్ని సంఘం తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు., ఇందుకు నిరసనగా సంతకవిటి మండల పంచాయతీ కార్యదర్శులంతా మూకుమ్మడిగా సెలవు పెట్టేందుకు నిర్ణయించారని ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికైనా దాడిపై విచారణ జరిపి బాధిత కార్యదర్శికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
