ముస్లిం యువకుల ఆశలు అడియాసలేనా..?

Tdp Government Cheats The Muslim Community - Sakshi

సాక్షి, గిద్దలూరు: టీడీపీ ఐదేళ్ల పాలనలో ముస్లింల సంక్షేమాన్ని విస్మరించింది. నాలుగు సంవత్సరాల పాటు ముస్లింలకు ఎలాంటి పథకాలు అమలు చేయని ప్రభుత్వం ఎన్నికలకు ముందు నారా హమారా– టీడీపీ హమారా అంటూ సభలు నిర్వహించింది. నాలుగు సంవత్సరాల పాటు మరచిన ప్రభుత్వం కనీసం 2018–2019 ఆర్థిక సంవత్సరంలోనైనా తమకు న్యాయం చేయడాలని ముందుకొచ్చిందనుకుంటే చివరకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయకుండా అన్యాయం చేశారని ముస్లిం యువకులు ఆరోపిస్తున్నారు. గతేడాది మే, జూన్‌ మాసాల్లో అన్ని జిల్లాల నుంచి ముస్లింలు సబ్సిడీ రుణాల కోసం పెద్ద ఎత్తున ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకున్నారు. వీటికి సంబంధించి జూలైలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. కేవలం నూటికి ఇద్దరికి చొప్పున రుణాలు మంజూరు చేసి మిగిలిన వారికి మొండిచేయి చూపించారు. మంజూరైన వారిలోనూ కొద్ది మందికి మాత్రమే బ్యాంకు ఖాతాల్లో నగదు జమైంది. మిగిలిన వారికి చెక్కులు ఇచ్చారేకానీ బ్యాంకు ఖాతాల్లో నగదు జమ కాలేదు. ఇలాంటి వారు కార్పొరేషన్లు, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. 

నిధులు మళ్లించి మైనారిటీలకు అన్యాయం:
ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పథకాలకు సంబంధించి ఆయా కార్పొరేషన్ల నిధులను మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయా యూనిట్లకు రుణాలు పూర్తిస్థాయిలో మంజూరయ్యాయని చెబుతూ గత ఏడాది చివరి మూడు నెలల్లో గ్రౌండింగ్‌ మేళా ఏర్పాటు చేసి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఆయా బ్యాంకులకు నిధులు ఇవ్వకపోవడంతో లబ్ధిదారులకు రుణాలు అందలేదు. వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.

ఎన్నికల కోడ్‌ రావడంతో ఆందోళనలో ముస్లిం యువకులు:
ఆదివారం సాయంత్రం సార్వత్రిక ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో సబ్సిడీ రుణాలు లబ్ధిదారులకు అందే అవకాశం లేదన్న ప్రచారం సాగుతోంది. దీంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఇంతకాలం జాప్యం చేసి ఈ పరిస్థితికి తీసుకొచ్చిన ప్రభుత్వంపై లబ్ధిదారులు మండిపడుతున్నారు. జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నట్లు ముస్లిం సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. మైనారిటీలను కేవలం మభ్యపెట్టేందుకే రుణాలు మంజూరు చేస్తున్నామంటూ దరఖాస్తులు ఆహ్వానించారని, ఒక్కో లబ్ధిదారుడు ఐదారు వందల రూపాయలు వెచ్చించి దరఖాస్తులు చేసుకుని, వేల రూపాయలు ఖర్చు చేసి జిల్లా మైనారిటీ కార్యాలయం, బ్యాంకుల చుట్టూ తిరిగారు. అయినప్పటికీ ప్రభుత్వంలో చిత్తశుద్ధి లేకపోవడంతో తమకు రుణాలు మంజూరు చేయలేదని వారు ఆరోపిస్తున్నారు. ఇటీవల అమరావతిలో మంత్రి నక్కా ఆనందబాబును కలిసి మైనారిటీలకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని వినతి పత్రం ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top