బీజేపీ-కాంగ్రెస్‌లతో టీడీపీ అ'విశ్వాస' డ్రామా

TDP Drama With Congress And BJP In Parliament - Sakshi

సాక్షి న్యూఢిల్లీ : పార్లమెంట్‌ సాక్షిగా తెలుగుదేశం, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల అ'విశ్వాస' బంధం కొనసాగింది. నన్ను ఏం చేయొద్దు.. నేను ఏమీ చేయను అన్న చందంగా కాంగ్రెస్‌-బీజేపీలతో టీడీపీ బంధం ప్రతిబింబించింది. శుక్రవారం రోజున అవిశ్వాస తీర్మానం సందర్భంగా కేశినేని నాని బదులుగా గల్లా జయదేవ్‌ పార్లమెంట్‌లో ప్రసంగించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్డీయే నుంచి బయటకు రాగానే టీడీపీపై కేంద్రం యుద్ధం ప్రకటించిందని చెప్పారు. అయితే రాష్ట్రానికి నిధులు, పరిశ్రమల కోసం రాయితీలు ఇవ్వడంలో దారణంగా విఫలైమందని చెప్పిన గల్లా ప్రత్యేక ప్యాకేజీకి ఎందుకు ఒప్పుకున్నారో చెప్పకపోవడం విశేషం. ప్రత్యేక ప్యాకేజీని అర్ధరాత్రి వేళ స్వాగతించిన తెలుగుదేశం.. హోదా కంటే ప్యాకేజీనే మేలంటూ అరుణ్‌ జైట్లీకి చేసిన సన్మాన కార్యక్రమం గురించి ప్రస్తావించలేదు.

పైగా కేంద్రం నుంచి అందరికంటే ఎక్కువగా సాధించామని, ప్రత్యేక ప్యాకేజీని స్వాగతిస్తూ ఆర్థిక మంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ అసెంబ్లీలో తీర్మానాలు కూడా చేశారు. ఈ విషయంపై కూడా గల్లా నోరు మెదపలేదు. విభజన చట్టాన్ని అప్రజాస్వామికంగా సభలో నెగ్గించారని చెప్పిన గల్లా, విభజనతో పాటు కేంద్రం తీరుతో ఏపీ అన్ని విధాలుగా నష్టపోయిందని వ్యాఖ్యానించారు. అలాగే కేంద్రం పూర్తి చేస్తామన్న పోలవరం బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకుందో చెప్పలేదు. నాలుగేళ్లు కేంద్రంలో భాగస్వామిగా టీడీపీ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ఏనాడు బీజేపీని ప్రశ్నించలేదు. 

పైగా అన్నీ సాధించామంటూ జబ్బలు చరుచుకున్నారు. ఏరు దాటాక తెప్ప తగలేసే అలవాటు ఉన్న బాబు నాలుగేళ్ల తరువాత ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబు కొత్త డ్రామాకు తెరలేపారు. రాష్ట్రానికి బీజేపీ అన్యాయం జరిగిదంటూ.. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నంలో భాగంగానే బీజేపీపై గల్లా విమర్శలు చేశారు. కానీ రాష్ట్ర విభజనలో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్‌ను మాత్రం తెలుగుదేశం పల్లెత్తు మాట అనలేదు. అంతేకాకుండా తెలంగాణ ఏర్పాటుకు మద్దతు ఇస్తూ చంద్రబాబు ఇచ్చిన లేఖ విషయాన్ని ప్రస్తావించలేదు. 

అనంతరం కాంగ్రెస్‌ అధ్యక్షడు రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ.. గల్లా జయదేవ్‌ ప్రసంగాన్ని విన్నానని చెప్పారు. గల్లా ప్రసంగంలో ఆవేదన కనిపించిందంటూ గల్లను వెనుకేసుకొచ్చారు. పైగా 21వ శతాబ్ధంలో రాజకీయంగా తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రం అంటూ మొసలి కన్నీరు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కాంగ్రెస్‌ అంతా చేసినట్లు కలరింగ్‌ ఇచ్చారు. ఆర్థిక లోటుతో కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి చేయాల్సిన అన్యాయం అంతా చేసి.. ఇప్పుడు మాత్రం కంటి తుడుపు చర్యగా పార్లమెంట్‌లో తెలుగుదేశం వ్యాఖ్యలకు మద్దతుగా రెండు ముక్కలు ప్రసంగించారు. విభజన సమయంలో రాష్ట్రానికి రావాల్సిన వాటిని చట్టంలో పొందు పరచకుండా ఏపీ ప్రజల గొంతు కోశారు. 

ఆనాడు ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్‌, కడప స్టీల్‌ ప్లాంట్లపై సానుకూలతలు పరిశీలించాలంటూ తీర్మానాలు చేసి చేతులు దులుపుకున్నారు. పైగా వచ్చే ప్రభుత్వం వాటిని అమలు చేయాలంటూ ఐదు కోట్ల ఆంధ్రుల జీవితాలను తీర్మానాల పాలు చేశారు. ఏపీ తీవ్రంగా నష్టపోతుందని తెలిసి కూడా ఏమాత్రం పట్టించుకోని కాంగ్రెస్‌ అధిష్టానం నేడు పార్లమెంట్‌ సాక్షిగా ఏపీకి అన్యాయం జరిగిందంటూ మొసలి కన్నీరు కార్చింది. అనుకున్న ప్రకారం టీడీపీ, కాంగ్రెస్‌లు భాయ్‌ భాయ్‌ అనుకుంటూ కొత్త డ్రామాకు తెరదీశాయి. ఏపీకి జరిగిన అన్యాయంపై తెలుగుదేశం పార్టీ అటు కాంగ్రెస్‌, ఇటు బీజేపీని ఏమీ అనకపోవడం గమనార్హం. పార్లమెంట్‌ సాక్షిగా మూడు పార్టీలు ఇలా మరోసారి తెలుగు ప్రజలను వంచన చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top