ప్రజా సంక్షేమాన్ని విస్మరించి రాష్ట్ర విభజనకు కుమ్మక్కు కుట్రలు చే స్తున్న టీడీపీ, కాంగ్రెస్‌పార్టీలు రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గాలికి అడ్రస్ లేకుండా కొట్టుకుపోవడం ఖాయమని వైఎస్సార్‌సీపీ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి తోట చంద్రశేఖర్ చెప్పారు.
నూజివీడు, న్యూస్‌లైన్ :
ప్రజా సంక్షేమాన్ని విస్మరించి రాష్ట్ర విభజనకు కుమ్మక్కు కుట్రలు చే స్తున్న టీడీపీ, కాంగ్రెస్‌పార్టీలు రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గాలికి అడ్రస్ లేకుండా కొట్టుకుపోవడం ఖాయమని వైఎస్సార్‌సీపీ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి తోట చంద్రశేఖర్ చెప్పారు. నూజివీడులో మంగళవారం నూజివీడు పట్టణ, మండల కార్యకర్తల సమావేశం నియోజకవర్గ సమన్వయకర్త మేకా ప్రతాప్‌అప్పారావు అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ పార్టీ అధినేత వైఎస్.జగన్‌మోహనరెడ్డికి ఉన్న ప్రజాదరణ చూసి ఎక్కడ ముఖ్యమంత్రి అవుతాడోనని కాంగ్రెస్, టీడీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు.
జగన్ ప్రభంజనాన్ని తట్టుకోలేకే వ్యతిరేక పార్టీలు వారికి అనుకూలమైన పత్రికల్లో జగన్‌పై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని, వీటిని ఎవరూ నమ్మవద్దన్నారు. జగన్‌గ్రాఫ్ తగ్గుతుందో,పెరుగుతుందో ప్రజల్లోకి వెళ్తే తెలుస్తుందని, టీవీ స్టూడియోల్లో కూర్చుంటే తెలియదని ధ్వజమెత్తారు. రాబోయే మూడునెలలు కీలకమైనవని జగన్‌ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టే వరకు ప్రతి కార్యకర్త సైనికునిలా పనిచేయాలని కోరారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన 9ఏళ్ల కాలంలో రైతుల రుణాలకు సంబంధించిన వడ్డీలనే మాఫీ చేయని చంద్రబాబు, అధికారంలోకి వస్తే రుణాలన్నింటినీ మాఫీ చేస్తానని చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.
రైతులకు , డ్వాక్రా మహిళలకు రుణాలు ఇస్తే చంద్రబాబు రుణమాఫీ అంటున్నారు కాబట్టి ఎవరూ తిరిగి చెల్లించరనే ఉద్ధేశంతో బ్యాంకులు వారికి రుణాలివ్వడమే మానేశాయన్నారు. మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాలకు ప్రభుత్వం బూజు పట్టించినప్పటికీ, ప్రజల గుండెల్లో ఇప్పటికీ సజీవంగానే ఉన్నారన్నారు. ఆ పథకాలన్నింటికీ తిరిగి జీవం రావాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలన్నారు. భావితరాల కోసం వైఎస్సార్‌సీపీని అధికారంలోకి తీసుకురావాలన్నారు. నూజివీడు నియోజకవర్గ కన్వీనర్ మేకా వెంకట ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం మడమ తిప్పకుండా పోరాడుతున్న గొప్ప పోరాట యోధుడు జగన్ అని అన్నారు. వైఎస్ విగ్రహాల జోలికి వస్తే ప్రజలే గాలి ముద్దుకృష్ణమనాయుడి చేతులు వెనక్కుకట్టి బంగాళాఖాతంలో విసిరేస్తారని హెచ్చరించారు. ప్రజలను పీడించిన ఔరంగజేబుకు, చంద్రబాబుకు ఏమాత్రం తేడా లేదన్నారు. అనంతరం మండలంలోని పార్టీకి చెందిన సర్పంచులను, సొసైటీ అధ్యక్షులను సన్మానించారు. బసవా భాస్కరరావు, శీలం రాము, మందాడ నాగేశ్వరరావు, కలగర వెంకటేశ్వరరావు, పల్నాటి గంగాధరరావు, గుడిమెళ్ళ రామస్వామి, పిళ్ళా చరణ్, కోటగిరి సందీప్, నత్తా నాగేశ్వరరావు, షేక్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.
అదరగొట్టిన బైక్‌ర్యాలీ...
కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేస్తున్న తోట చంద్రశేఖర్‌కు పట్టణం, మండలంలోని కార్యకర్తలందరూ బైక్‌ర్యాలీతో స్వాగతం పలికారు. గొల్లపల్లి నుంచి నూజివీడు వరకు దాదాపు 7వందల ద్విచక్రవాహనాలతో ర్యాలీ దారిపొడవునా సాగింది.