అనధికార షాపుల తొలగింపుపై రగడ

TDP Activists Conflicts on Shops Removed - Sakshi

ఎంవీపీ కాలనీలో జీవీఎంసీ టౌన్‌ ప్లానింగ్‌ ప్రత్యేక డ్రైవ్‌

బినామీలను కాపాడేందుకు రంగంలోకి ఎమ్మెల్యే వెలగపూడి

టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బందిని అడుక్డున్న వైనం

బినామీ, దళారుల షాపులు తొలగించాల్సిందేనన్న

వైఎస్సార్‌ సీపీ వర్గాలు

ఎంవీపీ కాలనీ(విశాఖ తూర్పు): ఎంవీపీ కాలనీలో అనధికారిక షాపుల తొలగింపు వ్యవహారం ఆదివారం రచ్చకెక్కింది. కాలనీలోని పలు కూడళ్ల వద్ద కొందరు టీడీపీ నాయకులు తమ అనుచరులతో షాపులు ఏర్పాటు చేయించారు. వారి వద్ద నుంచి కొందరు నెలవారీ వసూళ్లు చేస్తుండగా.. మరికొందరు బినామీల ద్వారా యథేచ్ఛగా వ్యాపారం చేస్తూ లక్షలు దండుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. షాపుల ఆక్రమణతో దశాబ్దాలుగా ఈ కూడళ్ల వద్ద వాహనచోదకులు, పాదచారులు నానా అవస్థలు పడుతున్నారు. గతంలో పలుమార్లు ఆయా షాపులను తొలగించే ప్రయత్నం జీవీఎంసీ చేసినా ఎమ్మెల్యే వెలగపూడి అడ్డుతగులుతూ వచ్చారు. ఆ వ్యాపారులు వెలగపూడికి బినామీలు, అనుచరుల కావడంతో టౌన్‌ ప్లానింగ్‌ విభాగాన్ని కట్టడి చేశారు. ప్రస్తుతం ఈ సమస్యపై జీవీఎంసీ మరోసారి దృష్టి సారించడంతో ఈ వ్యవహారం రచ్చకెక్కింది. రెండు రోజులుగా జీవీఎంసీ టౌన్‌ ప్లానింగ్‌ విభాగం కూడళ్ల వద్ద షాపుల తొలగింపు చేపట్టింది. దీంతో ఎమ్మెల్యే వెలగపూడి, వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ ఆదివారం ఆయా ప్రాంతాల్లో పర్యటించడంతో వివాదం ముదురింది.

వెలగపూడి హల్‌చల్‌
ఎంవీపీలో పలు షాపుల తొలగింపు కార్యక్రమం జీవీఎంసీ టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బంది ఆదివారం ఉదయం చేపట్టారు. ఇంతలో అక్కడికి ఎమ్మెల్యే వెలగపూడి చేరుకొని హల్‌చల్‌ చేశారు. తొలగింపు ప్రక్రియను అడ్డుకోవడంతో కొంత గందరగోళం నెలకొంది. ఆ షాపులు చాలా ఏళ్లుగా ఉంటున్నాయని వాటిని తొలగించడం కుదరదని ఎమ్మెల్యే వారించడంతో టౌన్‌ప్లానింగ్‌ సిబ్బంది మిన్నకుండిపోయారు. దీంతో ఎంవీపీ కాలనీలోని ఏఎస్‌ రాజా కూడలి, బీసీ స్టడీ సర్కిల్‌ కూడలి, టీటీడీ కూడళ్లలో పరిస్థితి చక్కబడుతుందని ఆశించిన స్థానికుల ఆశలు ఫలించలేదు. వెలగపూడి తన అనుచరుల వ్యాపారాలను కాపాడుకునేందుకు టౌన్‌ప్లానింగ్‌ సిబ్బంది విధులకు ఆటంకం కలిగించారని పలువురు ఆరోపించారు. ఆయా కూడళ్లలో షాపులను తొలగించి ట్రాఫిక్‌కు ఆటంకం లేకుండా జీవీఎంసీ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.  

టౌన్‌ ప్లానింగ్‌ అధికారుల అడ్డగింపు అనుచితం: వైఎస్సార్‌సీపీ
జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్‌ అధికారులను ఎమ్మెల్యే వెలగపూడి అడ్డుకున్న విషయం తెలుసుకున్న వైఎస్సార్‌ సీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్‌ కొంత సేపటికి అక్కడికి చేరుకున్నారు. ట్రాఫిక్‌ సమస్య పరిష్కారం కోసం అనధికార షాపుల తొలగింపు చేపట్టాల్సిందేనని, ఈ విషయంలో టౌన్‌ప్లానింగ్‌ అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఉందని వంశీకృష్ణ స్పష్టం చేశారు. బతుకుదెరువు కోసం నిబంధనలకు అనుగుణంగా వ్యాపారం చేసుకుంటున్న వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. వెంటనే టౌన్‌ప్లానింగ్‌ ఏసీపీ మహాపాత్రతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిపై ఆరా తీశారు. వెలగపూడి బినామీ షాపులను తక్షణమే తొలగించాలన్నారు. టీడీపీ 7వ వార్డు అధ్యక్షుడు పోలారావుతో పాటు చాలా మంది వ్యాపారుల నుంచి అద్దెలు వసూళ్లు చేస్తున్నట్టు తమకు సమాచారం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ 8వ వార్డు అధ్యక్షుడు రమణమూర్తి, యువజన విభాగం అధ్యక్షుడు లవనకుమార్, మహిళా అధ్యక్షురాలు జోషిల, తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top