కలెక్టర్ స్మితా సబర్వాల్ దూకుడు పెంచారు. ఒకేసారి మూకుమ్మడిగా 21 మంది తహశీల్దార్లు, 9 మంది మంది డిప్యూటీ తహశీల్దార్లను బదిలీ చేసి సంచలనం సృష్టించారు.
సాక్షి, సంగారెడ్డి: కలెక్టర్ స్మితా సబర్వాల్ దూకుడు పెంచారు. ఒకేసారి మూకుమ్మడిగా 21 మంది తహశీల్దార్లు, 9 మంది మంది డిప్యూటీ తహశీల్దార్లను బదిలీ చేసి సంచలనం సృష్టించారు. స్థాన చలనం పొందినవారిలో 16 మండలాల తహశీల్దార్లుండగా.. అందులో 6 మంది హెచ్‌ఎండీఏ పరిధిలోని మండలాల తహశీల్దార్లే కావడం విశేషం. మిగిలిన ఐదు మందిలో ఇద్దరికి పోస్టింగ్ కేటాయించకుండా వెయింటింగ్‌లో ఉంచగా, ముగ్గురికి పరిపాలన విభాగాల్లో తహశీల్దార్లుగా బదిలీ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రెవెన్యూ విభాగంలో భారీగా కదలికలు చోటు చేసుకోవడం అధికార వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కరీంనగర్ కలెక్టర్‌గా పనిచేసినప్పుడు అక్కడ సైతం ఒకేసారి 40 మంది తహశీల్దార్లను బదిలీ చేసి స్మితా సబర్వాల్ వార్తల్లో నిలిచారు. జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే జిల్లాలో పరిపాలనను గాడిలో పెట్టేందుకు దృష్టిసారించిన కలెక్టర్, ఆ దిశగా దూకుడు చర్యలు తీసుకుంటూ అధికారుల్లో గుబులు పుట్టిస్తున్నారు. జిల్లాకు వచ్చిన కొత్తలోనే ఆమె తహశీల్దార్ల పనితీరు, వ్యవహార శైలికి సంబంధించిన ఫైళ్లను తెప్పించుకోవడంతో పాటు వివిధ వర్గాల ద్వారా వివరాలను ఆరా తీశారు.
ప్రతి సోమ, శుక్రవారం నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌లో సైతం కొందరు తహశీల్దార్లతో ముఖాముఖీగా మాట్లాడి వారి పనితీరు, సామర్థ్యంపై స్వయంగా ఒక అవగాహనకు వచ్చేందుకు ప్రయత్నించారు. పనితీరుతో పాటు ఆయా మండలాల్లో ఉండే పని ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని సమర్థులకు ప్రాధాన్యత గల పోస్టింగ్‌లు కేటాయించినట్లు చర్చ జరుగుతోంది. గతంలో తహశీల్దార్ల బదిలీలు, పోస్టింగ్‌లలో పైరవీలు, ముడుపులు కీలకంగా వ్యవహరించేవని ఆరోపణలున్నాయి. హెచ్‌ఎండీఏ పరధిలోని మండలాల తహశీల్దార్ పోస్టులకు భారీ డిమాండు ఉంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ ముఖ్య నేతల సిఫారసుతో పాటు భారీగా ముడుపులు ముట్టజెప్పి పోస్టింగ్‌లు పొందిన వారూ ఉన్నారు. గత మే, జూన్ నెలల్లో చివరి సారిగా తహశీల్దార్ల బదిలీలు జరిగాయి. అప్పుడు, అంతకు ముందు భారీగా ఖర్చు చేసుకుని పోస్టింగ్‌లు తెచ్చుకున్న కొందరు అధికారులకు తాజా బదిలీలు గట్టి షాక్‌నిచ్చాయి. సుదీర్ఘ కాలంగా ఒకేచోట పనిచేస్తున్నారనే కారణంతోనే 9 మంది డీటీలను బదిలీ చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు.