కరెంట్‌కు ఇక పక్కా లెక్క

Tabs Distribute For Electricity Staff In PSR Nellore - Sakshi

సిబ్బంది చేతుల్లో ట్యాబ్‌లు

నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): విద్యుత్‌ బిల్లు ఎంతొచ్చింది.. ఎన్ని నెలల నుంచి కరెంట్‌ బిల్లు చెల్లింపు జరగకుండా పెండింగ్‌లో ఉంది.. విద్యుత్‌ మీటర్‌ ఏ విధంగా నమోదైంది.. విద్యుత్‌ వినియోగం పల్లెల్లో ఎలా ఉంటోంది.. ఇప్పటి వరకు ఈ వివరాలను తెలుసుకోవాలంటే  విద్యుత్‌ సిబ్బంది సమీపంలోని విద్యుత్‌ శాఖ కార్యాలయానికి వెళ్లి తెలుసుకోవాల్సి వచ్చేది. సాధారణ వినియోగదారులే కాకుండా విద్యుత్‌ శాఖలో పని చేసే ఉద్యోగులదీ ఇదే పరిస్థితి. ఏ సమాచారం కావాలన్నా ఉన్నత స్థాయి అధికారులను అభ్యర్థించాల్సిన పరిస్థితి. అయితే ప్రస్తుతం ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. ప్రతి శాఖలోనూ సాంకేతికత ద్వారా సేవలు సులభతరమయ్యేలా విద్యుత్‌ శాఖ కసరత్తును ప్రారంభించింది. ఇందులో భాగంగా ఎస్పీడీసీఎల్‌ రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ ద్వారా పారదర్శకమైన సేవలను అందించేందుకు ఒక అడుగు ముందుకేస్తోంది. ఈ క్రమంలో ఎస్పీడీసీఎల్‌ పరిధిలోని అన్ని జిల్లాలకు ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా జిల్లాకు 1262 ట్యాబ్‌లను సరఫరా చేసింది.

ట్యాబ్‌ల వినియోగం ఇలా..
విద్యుత్‌ శాఖలో పనిచేస్తున్న అన్ని ఉద్యోగులు, సిబ్బందికి ట్యాబ్‌లను పంపిణీ చేయాలనేది విద్యుత్‌ శాఖ ప్రధాన ఉద్దేశం. ఏఎల్‌ఎం, జేఎల్‌ఎం, లైన్‌మెన్, లైన్‌ ఇన్‌స్పెక్టర్, ఫోర్‌మెన్‌ స్థాయిలో ఈ ట్యాబ్‌లను అందిస్తారు. విద్యుత్‌ సబ్‌స్టేషన్లలో విధులు నిర్వర్తిస్తున్న ఆపరేటర్లకు వీటిని అందించనున్నారు. వీటి ద్వారా ఇక క్ష్రేత్ర స్థాయిలో విద్యుత్‌ వినియోగదారుడు బిల్లు చెల్లించకుండా డీ లిస్టులో ఉండే సమాచారం, సబ్‌స్టేషన్లలో లైన్‌లాస్, ఎనర్జీ, అంతరాయాలు, విద్యుత్‌ వినియోగం లాంటి అంశాలను తెలుసుకోవడంతో పాటు ఏయే వినియోగదారుడు ఏ నెల ఎంత విద్యుత్‌ వినియోగిస్తున్నారో తెలుసుకునే వీలు కలుగుతుంది. జిల్లాలోని మొత్తం 254 సబ్‌స్టేషన్ల పరిధిలోని సిబ్బందికి అందజేసేలా ప్రణాళికలను రూపొందించారు.

సిమ్‌కార్డులు మంజూరు కాక ప్రక్రియలో జాప్యం
4జీ సిమ్‌కార్డులు ఇంకా మంజూరు కాకపోవడంతో పంపిణీ ప్రక్రియలో కొంత ఆలస్యమవుతోంది. ట్యాబ్‌లు పూర్తిస్థాయిలో వినియోగంలోకి వస్తే క్షేత్రస్థాయిలో విద్యుత్‌ సమస్యలు, శాఖాపరమైన ప్రగతిని ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది. ట్యాబ్‌ల వినియోగంపై సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు విద్యుత్‌ శాఖ ఐటీ వింగ్‌ ఆధ్వర్యంలో త్వరలో కార్యక్రమాలను నిర్వహించనున్నారు. సిమ్‌లు అందగానే ట్యాబ్‌లను పంపిణీ చేసి, ట్యాబ్‌ల విలువ మొత్తాన్ని సిబ్బంది జీతాల్లో విడతల వారీగా కోత వేసేలా అధికారులు ప్రణాళికలను రూపొందిస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top