జిల్లాలో విజృంభిస్తున్న స్వైన్‌ఫ్లూ | Swine Flu Casrs Filed In Anantapur | Sakshi
Sakshi News home page

స్వైన్‌ సైరన్‌

Nov 6 2018 12:03 PM | Updated on Nov 6 2018 12:03 PM

Swine Flu Casrs Filed In Anantapur - Sakshi

జిల్లాలో విజృంభిస్తున్న స్వైన్‌ఫ్లూ

అనంతపురం న్యూసిటీ: జిల్లాలో స్వైన్‌ఫ్లూ సైరన్‌ మోగుతోంది. వ్యాధి చాపకింద నీరులా పాకుతోంది. రెండు నెలల్లో ముగ్గురికి వ్యాధి లక్షణాలు బయటపడటం కలవరపెడుతోంది. ఇప్పటికే మలేరియా, డెంగీ, కంఠసర్పితో ప్రత్యక్షనరకం చూస్తున్న జనం..స్వైన్‌ టెర్రర్‌తో హడలిపోతున్నారు. కర్నూలు, వైఎస్సార్‌ జిల్లా, తిరుపతి ప్రాంతాల్లో స్వైన్‌ఫ్లూ తీవ్రస్థాయిలో ఉండడం... జిల్లాలోనూ కేసులు నమోదవడంతో మరింత భయాందోళనలు చెందుతున్నారు. అయితేఅప్రమత్తం కావాల్సిన ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం నిద్రావస్థలో తూగుతోంది. మందులు కూడా అందుబాటులో ఉంచకుండా తన నిర్లక్ష్యాన్ని మారోసారి చాటిచెబుతోంది.

స్వైన్‌ఫ్లూ జాడలు
జిల్లా 45 రోజుల నుంచి స్వైన్‌ఫ్లూ అలజడి మొదలైంది. నెల రోజుల క్రితం కళ్యాణదుర్గం బైపాస్‌ సమీపంలో ఓ మహిళ స్వైన్‌ఫ్లూ లక్షణాలతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరింది. అక్కడ వైద్య పరీక్షలు చేయగా స్వైన్‌ఫ్లూగా నిర్ధారణ అయ్యింది. ఈ నెల 3న ఓడీ చెరువు కొండకమర్ల గ్రామానికి చెందిన 40 ఏళ్ల మహిళ అనారోగ్యంతో నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలోని చేరింది. పరీక్షించిన వైద్యులు స్వైన్‌ఫ్లూ అనుమానంతో సర్వజనాస్పత్రికి రెఫర్‌ చేశారు. ఆమెను పరీక్షించిన వైద్యులు..రక్తనమూనాలు సేకరించి స్వైన్‌ఫ్లూగా నిర్ధారించారు. వెంటనే కర్నూలు ఆస్పత్రికి రెఫర్‌ చేశారు. అక్కడ మరోసారి పరీక్షించగా ఆ మహిళకు స్వైన్‌ఫ్లూ సోకినట్లు తేలింది. ఇక తాజాగా సోమవారం అనంతపురం రూరల్‌ ప్రాంతానికి చెందిన ఓ 50 ఏళ్ల వృద్ధునికి స్వైన్‌ఫ్లూ నిర్ధారణ అయ్యింది. ఈయన ప్రస్తుతం కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇలా స్వైన్‌ప్లూ కేసులు రోజు రోజుకూ పెరుగుతుండడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.  

ప్రత్యామ్నాయ చర్యలేవీ?
స్వైన్‌ఫ్లూ విజృంభిస్తున్నా..ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. జిల్లాలోని సర్వజనాస్పత్రి మినహా మిగితా ఏ ఆస్పత్రుల్లోనూ స్వైన్‌ఫ్లూకు సంబంధించిన ఫ్లూవిర్‌ మందులు లేవు. ప్రభుత్వం కనీసం సరఫరా చేయలేదంటే ప్రజారోగ్యంపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో ఇట్టే అర్థమవుతుంది. ఇక స్వైన్‌ఫ్లూ సోకకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన వైద్యులు, స్టాఫ్‌నర్సులకు వ్యాక్సిన్‌ వేయలేదు. సర్వజనాస్పత్రిలో ఎన్‌95 మాస్క్‌లు అందుబాటులో ఉన్నా స్టాఫ్‌నర్సులకు సరఫరా చేయలేదు. ఇక స్వైన్‌ఫ్లూ నిర్ధారణ పరీక్ష(ఆర్‌టీపీసీఆర్‌) ఒక్క వైద్య కళాశాలలో మాత్రమే చేస్తారు. మిగితా ఆస్పత్రుల్లో అటువంటి సదుపాయం లేదు.  

ఇప్పుడిప్పుడే మేల్కొంటున్న ఆరోగ్యశాఖ
మరో రెండ్రోజుల్లో జిల్లాలోని ఆస్పత్రులకు ఆరోగ్యశాఖ ప్లూవిర్‌ మందులతో పాటు ఫ్లూ వ్యాక్‌ వ్యాక్సిన్‌ అందించేందుకు ఆరోగ్యశాఖ చర్యలు తీసుకుంటోంది. పీహెచ్‌సీలకు 20 మాత్రలు, ఏరియా ఆస్పత్రులకు 50, జిల్లా ఆస్పత్రులకు 200 మాత్రలు అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

పడకలు అంతంతే
స్వైన్‌ఫ్లూ బారిన పడిన వారిని ఐసొలేషన్‌ వార్డులో ఉంచాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ఇతరులకు సోకే ప్రమాదం ఉంది. అందవల్లే స్వైన్‌ఫ్లూ బాధితుల కోసం అనంతపురంలోని సర్వజనాస్పత్రిలో పది పడకలు, హిందూపురం, కదిరి, గుంతకల్లు ఏరియా ఆస్పత్రుల్లో 5 పడకలు ఏర్పాటు చేశారు. ఒక్క అనంతపురం బోధనాస్పత్రిలో మినహా మిగితా ప్రాంతాల్లో సదుపాయాలు సరిగా లేవు. దీంతో పరిస్థితి మరింత చేయిదాటిపోయే ప్రమాదం లేకపోలేదని ఆరోగ్యశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.

మందులు వస్తాయి  
స్వైన్‌ఫ్లూ బారిన పడిన వారికి ఇచ్చే మందులు నేడో రేపో వస్తాయి. ఏరియా ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచుతాం. వ్యాక్సిన్, ఎన్‌95 మాస్క్‌లు లేవు. అయినా రోగులకు ఇబ్బందులు కల్గకుండా చర్యలు తీసుకుంటాం.  – డాక్టర్‌ రమేష్‌నాథ్, డీసీహెచ్‌ఎస్‌

పండుగ తర్వాత వ్యాక్సిన్‌లు
మందుల కొరత లేదు. రోగ నిర్ధారణ అయిన వారికి మందులు సరఫరా చేస్తాం. వ్యాక్సిన్లు ఆర్డర్‌ పెట్టాం. 235 వ్యాక్సిన్లు పండుగ తర్వాత వస్తాయి. ప్రజలను అప్రమత్తం చేసేందుకు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం.– డాక్టర్‌ కేవీఎన్‌ఎస్‌అనిల్‌కుమార్, డీఎంహెచ్‌ఓ  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement