స్వైన్‌ఫ్లూ కలకలం

Swine Flu Case Files in Visakhapatnam - Sakshi

ఈ సీజనులో 64 మందికి పైగా స్వైన్‌ఫ్లూ

నలుగురు మృత్యువాత!

శీతలం ప్రారంభంతో మరింత ఆందోళన

సాక్షి, విశాఖపట్నం: ప్రాణాంతక స్వైన్‌ఫ్లూ విశాఖ వాసులను కలవర పెడుతోంది. ఇటు జిల్లా, అటు నగరంలోనూ అలజడి రేపుతోంది. శీతాకాలంలోనే విజృంభించే స్వైన్‌ఫ్లూ మండుటెండల్లోనూ ప్రతాపం చూపింది. ఇప్పుడు చలికాలం మొదలవుతుండడంతో ఈ వైరస్‌ ఎంతలా అదుపుతప్పుతుందోనన్న ఆందో ళన సర్వత్రా వ్యక్తమవుతోంది. గతేడాది కంటే ఈ ఏడాది జిల్లాలో స్వైన్‌ఫ్లూ తీవ్రత ఎక్కువగా ఉంది. గతేడాది  40 మంది స్వైన్‌ఫ్లూ బారినపడ్డారు. జనవరి నుంచి ఇప్పటిదాకా (ఈ పదకొండు నెలల్లో నే) 64 మంది ఈ వ్యాధితో ఆస్పత్రుల్లో చేరారు. మార్చిలో ఒకరు, అక్టోబర్‌లో 42, నవంబరు 24 వరకు 21 మందికి స్వైన్‌ఫ్లూ సోకినట్టు నిర్ధారించారు. వీరిలో నలుగురు మృత్యువాత పడ్డారు. అయితే వీరు మధుమేహం, గుండెజబ్బు, కిడ్నీ, నరాల సంబంధ వ్యాధులతో మరణించారని వైద్యారోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రైవేటు ఆస్పత్రుల్లో ముగ్గురు, ప్రభుత్వ ఛాతి, అంటువ్యాధుల (చెస్ట్‌) ఆస్పత్రిలో మరొక రు స్వైన్‌ఫ్లూతో చేరి చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

విశాఖ ప్రభావిత ప్రాంతం
విశాఖపట్నం స్వైన్‌ఫ్లూ ప్రభావిత ప్రాంతం. నగరానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు, భక్తులు, సందర్శకులు వస్తుంటారు. ఆయా ప్రాంతాల్లో స్వైన్‌ఫ్లూ వైరస్‌తో ఇక్కడకు రావడం, నగరానికి చెందిన వారు ఆ ప్రదేశాలకు వెళ్లడం ద్వారా వైరస్‌ సోకడం వంటివి కారణాల వల్ల ఇది వ్యాప్తి చెందుతోంది. విశాఖ సమీపంలో సింహాచలం, నగరంలో కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయాలకు దూరప్రాంతాల నుంచి భక్తులు, అలాగే ఏజెన్సీలోని పర్యాటక ప్రాంతాలకు టూరిస్టులు వస్తుంటారు. దీంతో స్థానికులతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి వల్లే స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

అప్రమత్తమైన  యంత్రాంగం
స్వైన్‌ఫ్లూ నియంత్రణకు జిల్లా యంత్రాంగం, జీవీఎంసీ చర్యలు చేపట్టింది. జిల్లా, నగర వ్యాప్తంగా 12 స్రీనింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేసింది. విమానాశ్రయం, విశాఖ రైల్వే స్టేషన్‌ (ప్లాట్‌ఫాం –1, 8), సింహాచలం కొండపైన, దిగువన, ఆర్టీసీ కాంప్లెక్స్‌ తదితర ప్రాంతాల్లో స్క్రీనింగ్‌ సెంటర్ల ద్వారా శాంపిళ్లు సేకరించి పరీక్షలు చేయిస్తున్నారు. కేజీహెచ్‌లో ఉన్న వైరాలజీ ల్యాబ్‌లో స్వైన్‌ఫ్లూ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. స్వైన్‌ఫ్లూ లక్షణాలున్న వారి కోసం కేజీహెచ్‌లో 10 పడకలు, పది వెంటిలేటర్లు, చెస్ట్‌ ఆస్పత్రిలో ఆరు పడకలు, రెండు వెంటిలేటర్లను అందుబాటులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

ఈ లక్షణాలుంటే వైద్యులను సంప్రదించాలి
జలుబు, దగ్గు, గొంతునొప్పి, విపరీతమైన జ్వరం, కళ్లు మంటలు, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్న వారు వెంటనే వైద్యులను సంప్రదించాలి. సమూహాలు, విందులు, వినోదాల్లో పాల్గొనేవారు అప్రమత్తంగా ఉండాలి. బయట తిరిగే వారు ముఖానికి మాస్కులు ధరించి వెళ్లాలి. చెస్ట్‌ ఆస్పత్రి, కేజీహెచ్, జిల్లాలోని నర్సీపట్నం, పాడేరు, అరకు, అనకాపల్లి ఏరియా ఆస్పత్రుల్లోను, అన్ని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లోనూ స్వైన్‌ఫ్లూ నిరోధక మందులను అందుబాటులో ఉంచాం. వీటిని ఉచితంగానే ఇస్తున్నాం. స్వైన్‌ఫ్లూ మందుల కొరత లేదు.      – ఎస్‌.తిరుపతిరావు, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top