స్వైన్‌ఫ్లూ జిల్లాలో లేకపోయినా అడపాదడపా కలకలం రేపుతూనే ఉంది. వెంకటాచలం మండలంలోని ఓ మహిళకు స్వైన్‌ఫ్లూ లక్షణాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు చెన్నైకి తీసుకెళ్లారు.
నెల్లూరు (అర్బన్): స్వైన్‌ఫ్లూ జిల్లాలో లేకపోయినా అడపాదడపా కలకలం రేపుతూనే ఉంది. వెంకటాచలం మండలంలోని ఓ మహిళకు స్వైన్‌ఫ్లూ లక్షణాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు చెన్నైకి తీసుకెళ్లారు. నెల్లూరు నగరంలోని 20 రోజుల క్రితం ఓ మహిళకు స్వైన్‌ఫ్లూ లక్షణాలు కనిపించడంతో చెన్నైలోని ఆసుపత్రికి తరలించారు. వెంకటాచలం మండలంలోని మహిళకు స్వైన్‌ఫ్లూ లక్షణాలున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులకు జేసీ, నెల్లూరు ఆర్డీఓలు చెప్పారు. దీంతో ఆదివారం అధికార యంత్రాంగాన్ని కదిలించారు. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ, మెడికల్ ఆఫీసర్, ఇతర అధికారులను వెంకటాచలానికి పంపినట్లు డీఎంహెచ్‌ఓ భారతీరెడ్డి తెలిపారు.
అప్రమత్తత ఏదీ?
ఇదిలా ఉండగా క్షేత్ర స్థాయిలో సిబ్బంది స్వైన్‌ఫ్లూపై అప్రమత్తంగా ఉన్నట్లు కనిపించడంలేదు. కొద్ది రోజులుగా డీఎంహెచ్‌ఓ డాక్టర్ భారతీరెడ్డి నెల్లూరులోని డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో స్వైన్‌ఫ్లూపై సమీక్షలు, సమావేశాలు నిర్వహించారు. అలాగే ఆర్‌డీ, వైద్య విధాన పరిషత్ కార్యదర్శి ఒకరు డీఎస్సార్ ప్రభుత్వ ప్రధాన ఆసుప్రతిలో వార్డును సందర్శించి వెళ్లారు. వీటన్నింటిలో క్షేత్ర స్థాయిలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే జిల్లాలో కరపత్రాల పంపిణీ, అవగాహన కార్యక్రమాలు చేపట్టిన దాఖలాలు లేవు. ఇప్పటికైనా అధికారులు స్వైన్‌ఫ్లూపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది.