
నగరి డీఎస్పీని సస్పెండ్ చేయాలి
పుత్తూరు డీఎస్పీ కృష్ణమోహన్‌రెడ్డిని సస్పెండ్ చేయాలని నగరి ఎమ్మెల్యే రోజా జిల్లా కలెక్టర్‌ను కోరారు. ఇటీవల నగరిలో జాతర సందర్భంగా జరిగిన గొడవకు ఆయన వ్యవహారశైలే కారణమని ఆమె తెలిపారు.
చిత్తూరు(సెంట్రల్): పుత్తూరు డీఎస్పీ కృష్ణమోహన్‌రెడ్డిని సస్పెండ్ చేయాలని నగరి ఎమ్మెల్యే రోజా జిల్లా కలెక్టర్‌ను కోరారు. ఇటీవల నగరిలో జాతర సందర్భంగా జరిగిన గొడవకు ఆయన వ్యవహారశైలే కారణమని ఆమె తెలిపారు. జాతరలో తనపై జరిగిన గొడవకు కారణమైన మాజీ శాసనసభ్యుని అనుచరులు ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని, మంగళవారం నగరి మున్సిపల్ చైర్‌పర్సన్,మాజీ చైర్మన్‌తో కలిసి వెళ్లి జిల్లాకలెక్టర్ సిద్ధార్థ్‌జైన్‌ను కోరినట్లు ఆమె విలేకరులకు చెప్పారు.
గొడవ జరిగే అవకాశం ఉందని తాను ముందుగానే డీఎస్పీకి వివరించి రక్షణ ఏర్పాట్లు చేయాలని కోరినా ఆయన పట్టించుకోకపోగా ఉద్దేశపూర్వకంగానే అధికారపార్టీ నాయకులకు, కార్యకర్తలకు సహకరించారని తెలిపారు. నగరి పట్టణ అభివృద్ధికి ప్రణాళిక రూపొందించి నిధులు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆమె కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
నగరిలో వస్త్ర పరిశ్రమ అభివృద్ధి చెందినందున డైయింగ్ యూనిట్ల వల్ల నీరు కలుషితమవుతోందని, దీని నివారణకు తగిన చర్యలు చేపట్టాలని కోరారు. నగరికి మంజూరైన నీటి శుద్ధి ప్లాంటు ఇంకా ప్రారంభానికి నోచుకోకపోవటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీని ప్రారంభానికి చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఆమె జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్.భరత్‌గుప్తాను ఆయన కార్యాలయంలో కలసి నగరి వీఆర్వోపై చర్యలు తీసుకోవాలని కోరారు. జేసీని కలసినవారిలో వైఎస్సార్‌సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గాయత్రి, నగరి మున్సిపల్ చైర్‌పర్సన్, మాజీ చైర్మన్ ఉన్నారు.