సొంతింటి కోసం వడివడిగా.. 

Survey Of Public Lands In Nellore District For Distribution Of Home Rails To The Peoples - Sakshi

జిల్లాలో ప్రభుత్వ భూముల సర్వే

446 గ్రామాల్లో 2,360 ఎకరాల గుర్తింపు

పరిశీలనకు స్థానికంగా బృందాలు

ఉగాదికి లబ్ధిదారులకు పట్టాల పంపిణీ

ఇళ్ల స్థలాలు కోరుతూ 70 వేలకు పైగా దరఖాస్తులు

అర్హులైన పేదలకు స్థలం ఇచ్చి.. పక్కా ఇంటిని నిర్మించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఆ దిశగా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. భూ అన్వేషణ ప్రకియను వేగవంతంగా చేపడుతోంది. నివాస యోగ్యమైన భూములను గుర్తిస్తోంది. గ్రామాల వారీగా ఉన్న రికార్డులను పరిగణనలోకి తీసుకుని సర్వే చేస్తోంది. ఇప్పటికే రెవెన్యూ యంత్రాంగం 40 శాతం గ్రామాల్లో ప్రక్రియను ముగించి రికార్డులను సిద్ధం చేసింది. రెండు నెలల వ్యవధిలో మిగిలిన గ్రామాల్లోనూ దీనిని పూర్తి చేయనుంది.

సాక్షి, నెల్లూరు:  ఎన్నికల సమయంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా అడుగులు పడుతున్నాయి. అధికారంలోకి వచ్చాక అర్హులకు ఇంటి పట్టాలను అందజేస్తామని ప్రకటించింది. పూర్తి హక్కులు ఉండేలా ఇంటి పట్టాలను మహిళల పేరుపై రిజిస్ట్రేషన్‌ చేసిస్తామని హామీ ఇచ్చింది. దీనికి అనుగుణంగా అధికార యంత్రాంగం జిల్లాలో పంపిణీ చేసేందుకు అనువుగా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించే ప్రక్రియను నిర్వహిస్తోంది. కలెక్టర్‌ శేషగిరిబాబు ఆదేశాలతో జేసీ నుంచి తహసీల్దార్‌ వరకు అందరూ భూ సేకరణపై దృష్టి పెట్టారు. జిల్లాలోని 940 పంచాయతీల పరిధిలో ఇంటి స్థలాలు కోరుతూ అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. దీంతో పాటు ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమంలోనూ ఇంటి స్థలాలను కోరుతూ జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో అర్జీలు వస్తున్నాయి. వచ్చే ఉగాదిన మహిళ పేరుతో రిజిస్ట్రేషన్‌ చేసిన ఇంటి పట్టాలను పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీనికి అనుగుణంగా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. 

మండలాలను యూనిట్‌గా..
మండలాలను యూనిట్‌గా గ్రామ రికార్డులను పరిగణనలోకి తీసుకొని తొలుత ప్రభుత్వ భూమిని గుర్తిస్తున్నారు. ఇందులో నివాసయోగ్యమైన భూమి ఎంత ఉంది.. అందుబాటులో ఉన్న సౌకర్యాలను అంచనా వేస్తున్నారు. ప్రతి గ్రామంలో సాధారణంగా కొంత ప్రభుత్వ భూమి ఉంది. అయితే ఇందులో 60 శాతం భూమి నివాసయోగ్యమైంది కాకుండా ఉంది. ఈ క్రమంలో గత నెల్లో అధికారులతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించి భూముల వివరాలను పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని ఆదేశించారు. దీంతో భూ ఆన్వేషణ ప్రక్రియ ఇప్పటి వరకు 40 శాతం పూర్తయింది.

446 గ్రామాల్లో 2,360 ఎకరాల గుర్తింపు
ఇప్పటి వరకు జిల్లాలోని 446 గ్రామాల్లో 2360 ఎకరాలను గుర్తించారు. పూర్తి నివాసయోగ్యమైన భూమిగా అధికారులు గుర్తించి వాటిని అర్హులైన పేదలకు పంపిణీ చేసేందుకు వీలుగా నివేదికలను సిద్ధం చేశారు. మూడు నెలల నుంచి జిల్లాలోని పేదల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ప్రతి దరఖాస్తును ఆన్‌లైన్లో నమోదు చేసి వారికి రసీదును అందజేస్తున్నారు. ఇప్పటి వరకు 70 వేలకు పైగా దరఖాస్తులను స్వీకరించారు. భూమిని పంపిణీ చేసేంత వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రకియ కొనసాగనుంది. క్షేత్రస్థాయిలో అధికారులు ఇప్పటి వరకు 940 గ్రామ పంచాయితీల్లో భూములను పరిశీలించారు. రికార్డుల నిర్వహణలో ఇబ్బందులు, తదితర కారణాలతో అన్ని చోట్ల ప్రకియ పూర్తిగా కొలిక్కిరాని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో జేసీ వెట్రిసెల్వి, ఇతర అధికారులు కూడా పర్యటనలకు వెళ్లి ప్రభుత్వ భూములను పరిశీలిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు పుష్కలంగా ఉన్నా, రాళ్ల గుట్టలు, గతంలో గ్రావెల్‌ కోసం తవ్విన గుంతలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. 

వెరిఫికేషన్‌ ప్రక్రియ ప్రారంభం
సిద్ధమైన 446 గ్రామాల్లో వెరిఫికేషన్‌ ప్రక్రియను ప్రారంభించారు. స్థానిక తహసీల్దార్‌ నేతృత్వంలో వీఆర్వోలు, వలంటీర్లు క్షేత్ర స్థాయిలో దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. అధికారులు స్వీకరించిన దరఖాస్తులను గ్రామాల వారీగా పంపి పరిశీలనను పూర్తి చేసి అర్హుల జాబితాను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. సగటున ఎకరా భూమిలో రోడ్డు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించి 45 మందికి ప్లాట్లుగా పంపిణీ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top