ఖాళీ ‘హస్తం’ | Sugar-free packets | Sakshi
Sakshi News home page

ఖాళీ ‘హస్తం’

Oct 11 2013 3:57 AM | Updated on Sep 1 2017 11:31 PM

ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ‘అమ్మహస్తం’ పథకం సరుకులను చూసి రేషన్‌డీలర్లు లబోదిబోమంటున్నారు.

=      చక్కెర లేని ప్యాకెట్లు
=     లీకవుతున్న ఆయిల్
=     బియ్యం తూకంలో తేడా
=     బెంబేలెత్తుతున్న డీలర్లు

 
స్టేషన్‌ఘన్‌పూర్ టౌన్, న్యూస్‌లైన్ : ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ‘అమ్మహస్తం’ పథకం సరుకులను చూసి  రేషన్‌డీలర్లు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే తొమ్మిది సరుకులకు గాను అరకొరగా పంపిణీ చేస్తున్నారు.. వాటిలో కూడా అనేక లోపాలుండడంతో లబ్ధిదారుల చేతిలో డీలర్లు తిట్లు తినాల్సిన పరిస్థితి నెలకొందని వారు వాపోతున్నా రు. గురువారం రేషన్ డీలర్ల సంఘం మండల అధ్యక్షుడు కలకోల బాబు, ప్రధాన కార్యదర్శి గట్టు మొగిళి, జిల్లా ఉపాధ్యక్షుడు సింగపురం మోహన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను విలేకరులకు వివరించారు.
 
పథకం ప్రారంభించిన నాటి నుంచి తమకు తిప్పలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని సరుకుల కోసం డబ్బులు చెల్లిస్తు న్నా నాలుగైదు మాత్రమే వస్తున్నాయని, దీంతో లబ్ధిదారులకు సమాధానం చెప్పలేకుం డా ఉందని అన్నారు. చక్కెర ప్యాకెట్లు కొన్ని పూర్తిగా ఖాళీగా ఉంటున్నాయని, నష్కల్ గ్రామానికి చెందిన రేషన్ డీలర్ కాశం ఎలిషాకు ఈనెల పంపిణీ చేసిన చక్కెర ప్యాకెట్లలో పది ప్యాకెట్లు ఖాళీగా వచ్చాయని చెప్పారు. ఎంఎల్‌ఎస్ పాయింట్ నుంచి సరఫరా చేసే బియ్యం సంచుల్లో 50 కిలోలకు బదులు కేవలం 47 కిలోలే ఉంటున్నాయని తెలిపారు.

ఒక కార్టన్ లో 12 నూనె ప్యాకెట్లు ఉండాలి.. ఒకటి, రెండు తక్కువగా ఉంటున్నాయని, అంతేకాకుండా ప్రతి నెలా నాలుగైదు ప్యాకెట్లు లీకయి వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఒక బ్యాగ్‌లో 50 పప్పు ప్యాకెట్లకు గాను 48 మాత్రమే ఉంటున్నాయన్నారు. ఈ విషయమై డిప్యూటీ తహసీల్దార్ సమ్మయ్య, సివిల్ సప్లై డీటీ పరశురాములు, ఆర్‌ఐ శ్రీనివాస్‌కు విన్నవించినట్లు తెలిపారు. ప్రస్తుతం పండుగ సీజన్‌కు కూడా సరుకులు పూర్తిగా రాలేదని, లబ్ధిదారులతో ఇబ్బందులు తప్పడం లేదన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అన్ని సరుకులు, తూకాల్లో తేడా లేకుండా పూర్తి స్థాయిలో అందేలా చూడాలని కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement