గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో చేసిన రెండో గుండెమార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయిందని కార్డియాలజిస్ట్ డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే తెలిపారు.
వివరాలు వెల్లడించిన డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే
గుంటూరు రూరల్: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో చేసిన రెండో గుండెమార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయిందని కార్డియాలజిస్ట్ డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే తెలిపారు. ఆదివారం గుంటూరులో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఈ నెల 4న హీరామూన్‌బాయి అనే మహిళకు గుండె మార్పిడి శస్త్రచికిత్స చేశామన్నారు. ఆమె గుండె ఆదివారం నుంచీ సజావుగా పనిచేస్తోందని, మరో రెండు రోజుల్లో ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు.
నెల్లూరు నుంచి గుండెను గుంటూరుకు తరలించేందుకు సహకరించి హెలికాప్టర్‌ను ఇచ్చిన కృష్ణపట్నం పోర్టు ఎండీ శశిధర్, సీఈవో అనిల్‌కు, 25 మంది రక్తదాతలకు, ప్రత్యేక సౌకర్యాలు కల్పించిన ఐజీ సునీల్‌కుమార్‌కు, గుండె మార్పిడికి సహకరించిన జీవన్‌దాన్ డాక్టర్ కృష్ణమూర్తికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వాస్పత్రిలోని సౌకర్యాలను వినియోగించుకోగా మందులు తదితరాలకు రూ.20 లక్షలు, హెలికాప్టర్ కోసం రూ.5 లక్షలు.. మొత్తం రూ.25 లక్షలు ఖర్చయిందన్నారు. ఇలాంటి శస్త్ర చికిత్సల నిర్వహణకు ప్రభుత్వం కూడా తోడ్పాటునందించాలని కోరారు.