బినామీ డీలర్ల బియ్యం దందా | Subsidy rice moving to abroad | Sakshi
Sakshi News home page

బినామీ డీలర్ల బియ్యం దందా

Dec 13 2018 4:59 AM | Updated on Dec 13 2018 4:59 AM

Subsidy rice moving to abroad - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బినామీ రేషన్‌ డీలర్ల హవా కొనసాగుతోంది. వివిధ కారణాలతో ఖాళీ అయిన రేషన్‌ డీలర్ల స్థానాలను భర్తీ చేయకుండా అధికార పార్టీ నేతలు అడ్డుపడుతున్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సొంత జిల్లా గుంటూరులోనే 310 మంది బినామీ డీలర్లు ఉండడం గమనార్హం. బినామీ డీలర్లు అక్రమాలకు పాల్పడుతున్నారని, వారిని తొలగించి, రెగ్యులర్‌ డీలర్లను నియమించాలని కలెక్టర్ల సదస్సులో పౌర సరఫరాల శాఖ ఎక్స్‌ అఫీషియో కార్యదర్శి బి.రాజశేఖర్‌ నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. బినామీలను పక్కనపెట్టి,  రెగ్యులర్‌ డీలర్లను నియమించేందుకు వెంటనే నోటిఫికేషన్‌ జారీ చేయాలని సీఎం ఆదేశించినా పట్టించుకునే వారే లేకుండా పోయారు. అధికార తెలుగుదేశం పార్టీ నేతల అనుచరులే బినామీ డీలర్ల అవతారం ఎత్తారు. సబ్సిడీ బియ్యం అక్రమ వ్యాపారంలో కొందరు తెలుగు తమ్ముళ్లకు నేరుగా భాగస్వామ్యం ఉండటంతో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. బినామీ డీలర్లు రేషన్‌ దుకాణాల్లోనే లబ్ధిదారుల నుండి సబ్సిడీ బియ్యాన్ని కిలో రూ.8 చొప్పున కొనుగోలు చేసి వ్యాపారులకు సరఫరా చేస్తున్నారు. వ్యాపారులు ఆ బియ్యాన్ని పాలిష్‌ చేసి, అధిక ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ దందాలో ఎవరికి దక్కాల్సిన వాటాలు వారికి దక్కుతున్నాయి.
 
విదేశాలకు తరలుతున్న సబ్సిడీ బియ్యం 
రాష్ట్రంలో 1.44 కోట్ల మంది తెల్ల రేషన్‌కార్డుదారులు ఉన్నారు. ప్రతినెలా రెండు లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం రేషన్‌కార్డుదారులకు సరఫరా చేస్తోంది. ఇందులో ప్రతినెలా 50 వేల మెట్రిక్‌ టన్నులకు పైగా బియ్యాన్ని బినామీ రేషన్‌ డీలర్లు లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేసి వ్యాపారులకు విక్రయిస్తున్నారు. వ్యాపారులు సబ్సిడీ బియ్యానికి పాలిష్‌ చేసి, మళ్లీ మార్కెట్లోకి తెచ్చి కిలో రూ.45 నుంచి రూ.50 వరకు విక్రయిస్తున్నారు. కొందరు వ్యాపారులు సబ్సిడీ బియ్యాన్ని కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గుంటూరు, ప్రకాశం, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల నుంచి ఎక్కువగా సబ్సిడీ బియ్యం అక్రమంగా విదేశాలకు తరలిపోతున్నట్లు అధికారులు గుర్తించారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినా ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement