బిల్లు చూస్తే గుండె దడ

stunts business in kurnool private hospitals - Sakshi

హృద్రోగంతో వస్తే అంతే సంగతులు

కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రుల్లో నిలువు దోపిడీ

అవసరం లేకపోయినా గుండె నాళాలకు స్టెంట్లు

పరీక్షల పేరుతో బెదిరింపులు

చోద్యం చూస్తున్న అధికారులు

కర్నూలు నగరంలోనిఓ ఫంక్షన్‌ హాలుకు చెందిన వ్యక్తి రెండు నెలల క్రితం గుండెనొప్పి రావడంతో నగరంలో కొత్తగా ఏర్పాటైన ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. అతన్ని 45 రోజుల పాటు ఆసుపత్రిలో ఉంచుకుని రూ.33 లక్షల బిల్లు వేశారు. ముక్కుపిండి మరీ వసూలు చేశారు. ఆ బిల్లు కట్టి బతుకు జీవుడా అంటూ సదరు వ్యక్తి డిశ్చార్జ్‌ అయ్యాడు.  

కర్నూలు నగరానికి చెందిన ఫైనాన్స్‌ వ్యాపారి రాము బీపీ చెక్‌ చేయించుకోవడానికి తన సామాజిక వర్గానికే చెందిన వైద్యుడు నిర్మించిన ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాడు. అతనికి అక్కడ ఈసీజీ, 2డీ ఎకోతో పాటు యాంజియోగ్రామ్‌ పరీక్షలు చేశారు. రూ.10వేలు బిల్లు వేశారు. అలాగే రెండు వాల్వులు బ్లాక్‌ అయ్యాయని, ఆపరేషన్‌ చేసి స్టెంట్లు వేయాలని చెప్పారు. దీంతో బెదిరిపోయిన అతను బెడ్‌పై నుంచే ఇంటికి ఫోన్‌ చేసి రూ.4లక్షలు తెప్పించుకుని స్టెంట్లు వేయించుకున్నాడు.  

కర్నూలు(హాస్పిటల్‌): ప్రకాశం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఛాతి నొప్పి అంటూ నగరంలోని ఓ ప్రముఖ ఆసుపత్రికి వెళ్లాడు. అతనికి స్టెంట్‌ వేయాలని, రూ.2లక్షలు అవుతుందని వైద్యులు చెప్పారు. తనకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందని చెప్పగా, క్లెయిమ్‌ మొత్తంతో పాటు అదనంగా రూ.50వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే నాణ్యత లేని స్టెంట్‌ వేయాల్సి ఉంటుందని బెదిరించారు. 

ఎడతెరిపిలేని దగ్గు అయితే టీబీ కావచ్చనే తరహాలో ఛాతిలో నొప్పి ఉంటే అది గుండెనొప్పికి దారితీయొచ్చంటూ రోగులను కొందరు వైద్యులు బెంబేలెత్తిస్తున్నారు. అవసరం లేకపోయినా ఈసీజీ, 2డీ ఎకో పరీక్షలతో పాటు యాంజియోగ్రామ్‌ పరీక్షలూ చేస్తున్నారు. ఈ పరీక్షలపై అవగాహన లేని వారికి కాస్త తేడా కన్పిస్తోందని, స్టెంట్‌ వేయించుకోకపోతే ప్రాణాలకే ప్రమాదమని బెదిరించి మరీ రూ.లక్షలు వసూలు చేస్తున్నారు. ఒకప్పుడు కర్నూలు నగరంలో నాణ్యమైన వైద్యం అందించే ఆసుపత్రులు లేవని బాధపడేవారు. ఇప్పుడు నాణ్యమైన వైద్యం అందించే ఆసుపత్రులు వచ్చినా, లేనిపోనివి చెప్పి ఎక్కడ బిల్లుతో బాదుతారోనని జనం బెదిరిపోతున్నారు. అవసరం లేకపోయినా పలు పరీక్షలు చేయించి..బిల్లుల మోత మోగిస్తుండటంతో అప్పులు చేసి మరీ చెల్లించాల్సి వస్తోంది.

గతంలో కర్నూలు నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మాత్రమే యాంజియోగ్రామ్‌లు చేసేవారు. ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ఐదారు ఆసుపత్రుల్లో కేథలాబ్‌లు ఏర్పాటు చేశారు. నాలుగు ఆసుపత్రుల్లో గుండె శస్త్రచికిత్సలు కూడా చేస్తున్నారు. కర్నూలుతో పాటు వైఎస్‌ఆర్‌ జిల్లా, అనంతపురం, తెలంగాణలోని గద్వాల, అలంపూర్, మహబూబ్‌నగర్, బళ్లారి ప్రాంతాలకు చెందిన హృద్రోగులు చికిత్స కోసం కర్నూలు వస్తున్నారు. హైదరాబాద్‌తో పోలిస్తే గుండె చికిత్సలు ఇక్కడ కాస్త తక్కువైనా పోటీ ఎక్కువ కావడం, పెట్టుబడులు, నిర్వహణఖర్చులు పెరిగిపోవడంతో కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రులు కొన్ని అనైతిక వైద్యానికి తెరతీశాయన్న విమర్శలు విన్పిస్తున్నాయి. ఆయా ఆసుపత్రుల వైపు వెళ్లాలంటేనే జనం భయపడే పరిస్థితి ఏర్పడింది.

డామిట్‌ ‘స్టెంట్‌’ కథ అడ్డం తిరిగింది!
స్టెంట్‌ల పేరుతో ప్రైవేటు ఆసుపత్రులు దోపిడీ చేస్తున్నాయని ఫిర్యాదులు రావడంతో కేంద్ర ప్రభుత్వం వాటి ధరలను గణనీయంగా తగ్గించేసింది. ఒక్కో స్టెంట్‌ ధర రూ.30,180లుగా నిర్ణయించింది. కానీ తెలివిమీరిన కొందరు ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల నిర్వాహకులు స్టెంట్ల ధరలు తగ్గించి,  హ్యాండ్లింగ్‌ చార్జీలు(నిర్వహణ ఖర్చులు) మాత్రం పెంచేశారు. ఈ కారణంగా ఒక స్టెంట్‌ వేయించుకుంటే ఎప్పటిలాగే రూ.1.50 లక్షల నుంచి రూ.2లక్షల వరకు ఖర్చవుతోంది.

ఫీజుల వివరాలు జాడలేదు
ప్రతి కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రిలో ప్రజలందరికీ కనిపించేలా ఫీజుల వివరాలు ప్రదర్శించాలి. ఆసుపత్రిలోకి ప్రవేశించగానే రిసెప్షన్‌ కౌంటర్‌ వద్ద గానీ, అందరికీ కనిపించే విధంగా గానీ ఈ బోర్డు ఏర్పాటు చేయాలి. ఆసుపత్రిలో ఏయే చికిత్సకు ఎంత వసూలు చేస్తున్నారు.. ల్యాబ్‌ పరీక్షా ఫీజుల వివరాలను సైతం ఇందులో ప్రదర్శించాలి. కర్నూలు నగరంలో  కొన్ని ఆసుపత్రులు మాత్రమే ఈ విధానాన్ని పాటిస్తున్నాయి. అధికశాతం కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఫీజుల వివరాలు మచ్చుకైనా కనిపించవు. ఈ విషయమై ప్రశ్నించే అధికారం, దమ్ము జిల్లా అధికారులకు లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top