ప్లీజ్‌ సార్‌..వెళ్లొద్దు

Students Sad About School Head Master Transfer In Anantapur - Sakshi

అనంతపురం, కళ్యాణదుర్గం: ఉపాధ్యాయుడంటే...ఏ విద్యార్థికైనా భయమే..కానీ ఆ ప్రిన్సిపాల్‌ అంటే మాత్రం ఆ పాఠశాలందరికీ గౌరవం..కాదు..ప్రేమ...ఆ ప్రిన్సిపాల్‌కు కూడా విద్యార్థులంటే ప్రాణం..తండ్రిలా బిడ్డలపై వాత్సల్యం. అందుకే బదిలీపై ఆ ప్రిన్సిపాల్‌ పాఠశాల వదిలివెళ్తుంటే విద్యార్థులంతా చుట్టుముట్టారు..వెళ్లవద్దు సార్‌..ప్లీజ్‌..అంటూ అడ్డుపడిపోయారు. దీంతో ఉద్వేగానికిలోనైన సదరు ప్రిన్సిపాల్‌ కూడా ఇక్కడి నుంచి వెళ్లలేకపోయారు..ఈ ఘటన గురువారం కళ్యాణదుర్గంలో మోడల్‌ స్కూల్‌లో చోటుచేసుకుంది.

ఐదేళ్ల క్రితం ఎఫ్‌ఏసీపై వచ్చి...
ఐదేళ్ల క్రితం కళ్యాణదుర్గంలో మోడల్‌ పాఠశాల తరగతులు ప్రారంభమయ్యాయి. ఎఫ్‌ఏసీ ప్రిన్సిపాల్‌గా వరప్రసాద్‌ బాధ్యతలు చేపట్టారు. అరకొర వసతులతో మొదట్లో పాఠశాలను నడుపుకొచ్చారు. విద్యార్థులను తండ్రిలా చూశారు. పేద విద్యార్థులకు ఫీజులు సైతం చెల్లించారు. బాలురకు భోజన వసతి లేకపోతే... సొంత డబ్బులతో భోజనం పెట్టారు. 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలకు ముందు నెలరోజులు ప్రత్యేక స్టేడీ హవర్స్‌ నిర్వహించి భోజన వసతి కల్పించారు.

సుదూర ప్రాంతాల్లో రెజ్లింగ్, జూడో, హ్యాండ్‌బాల్‌ లాంటి పోటీలకే వెళ్లే క్రీడాకారులకు ఖర్చులు భరిస్తు సౌకర్యాలు కల్పించారు. అందువల్లే వరప్రసాద్‌తో విద్యార్థులకు విడదీయరాని బంధం ఏర్పడింది. ఇంతటి అనుబంధాన్ని ఏర్పరుచుకున్న ప్రిన్సిపాల్‌ వరప్రసాద్‌ను పామిడి ఆదర్శ పాఠశాలకు బదిలీ చేస్తూ బుధవారం ఉత్తర్వులందాయి. దీంతో గురువారం ఆయన ఈ విషయం విద్యార్థులకు చెప్పడంతో వారంతా అడ్డుపడ్డారు. కన్నీటి పర్యంతమయ్యారు. ఫ్లీజ్‌సార్‌...వెళ్లొద్దు ఇక్కడే ఉండండి అంటూ విద్యార్థిని, విద్యార్థులు ఆయనను చుట్టుముట్టారు. భావోద్వేగానికి గురైన వరప్రసాద్‌ కూడా కంటతడి పెట్టారు. 

ప్రిన్సిపాల్‌ వెళ్లకూడదంటూ ధర్నా
అనంతరం విద్యార్థులంతా తమ ప్రిన్సిపాల్‌ను మరోచోటకు బదిలీ చేయడాన్ని నిరసిస్తూ ధర్నా చేశారు. ప్రిన్సిపాల్‌ పాఠశాల దాటకుండా అడ్డుకుని చుట్టుముట్టారు. ప్రిన్సిపాల్‌ వెళ్లకూడదూ... ఉండాలి ప్రిన్సిపాల్‌ ఇక్కడే ఉండాలి... అంటూ నినాదాలతో హోరెత్తించారు. మధ్యాహ్నం 1.00 గంట నుంచి 4.30గంటల వరకు ఆందోళన జరిగింది. అనంతరం ర్యాలీగా విద్యార్థులంతా ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి ఇంటికి వెళ్లి ప్రిన్సిపాల్‌ బదిలీ ఆపాలని విజ్ఞప్తి చేశారు.  

నాకు అన్నం పెట్టాడు
నాకు తల్లిలేదు. మా నాన్న సురిబాబు వ్యవసాయం చేస్తున్నారు. ఇక్కడ వసతి గృహం సౌకర్యం లేనప్పుడు ప్రిన్సిపాల్‌ సార్‌ భోజన సౌకర్యం కల్పించారు.  – మాతశ్రీ, 8వ తరగతి విద్యార్థిని

లోటు లేకుండా చూసుకున్నారు  
8వ తరగతి నుంచి ఇక్కడే చదువుతున్నా. ఎలాంటి లోటు లేకుండా చూసుకున్నారు. ఏ ఇబ్బంది ఉన్నా పరిష్కరించారు. మా సార్‌ను బదిలీ చేయకూడదు.– బాలాంజలి, ఇంటర్‌ విద్యార్థిని  

క్రీడాకారులకు ప్రోత్సహించారు
రాష్ట్రంలో ఏ ప్రాం తానికి వెళ్లినా క్రీడకారుల ఖర్చంతా సారే భరించేవారు. విజయం తో తిరిగి రావాలంటూ ఉత్సాహపరిచేవారు. అలాంటి సార్‌ను బదిలీ చేయడం అన్యాయం.–మౌర్య, 9వ తరగతి విద్యార్థి 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top