
ప్రతీకాత్మక చిత్రం
తాడేపల్లి రూరల్: ఓ విద్యార్థినిని తోటి విద్యార్థులు దొంగతనం చేశావంటూ వేధింపులకు గురిచేయడం, ఆ విషయం కళాశాలలో ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో మనస్తాపం చెందిన విద్యార్థిని శనివారం సీతానగరం అమరావతి కరకట్ట వెంట ఉన్న బకింగ్ హామ్ కెనాల్‌లో దూకేందుకు యత్నించింది. అది గమనించిన మంగళగిరి హోంగార్డు డేనీ అలియాస్ దానయ్య ఆమె ప్రయత్నాన్ని అడ్డుకుని తాడేపల్లి పోలీసులకు అప్పగించారు. విజయవాడ రామలింగేశ్వరనగర్ పడవలరేవులో నివాసముంటూ లారీ డ్రైవర్‌గా పనిచేసే నాదెండ్ల రమేష్ పెద్దకుమార్తె సుమలత విజయవాడలోని లయోలా కాలేజీలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతోంది.
కళాశాలలో శుక్రవారం వేరే విద్యార్థిది ఫోన్ పోవడంతో, సుమలతే తీసిందంటూ తోటి విద్యార్థులు ఆమెను అవమానించి ఆపై అసభ్యంగా మాట్లాడారు. ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపాల్‌కు సుమలత తెలియజేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ‘కాలేజీకి వెళితే తోటి విద్యార్థులు చులకనగా చూస్తారు, వెళ్లకపోతే అమ్మానాన్న తిడతారు, అందుకే మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నా’ అని విద్యార్థిని పోలీసులకు తెలిపింది. జరిగిన ఘటనపై తాడేపల్లి పోలీసులు వివరాలు సేకరించి, విద్యార్థినిని తల్లిదండ్రులకు అప్పగించారు.