
గంట్యాడ: రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి చెందిన సంఘటన విజయనగరం సమీపంలో శనివారం చోటుచేసుకుంది. ఎస్సై పి. నారాయణరావు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం ఎన్‌టీయూలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు తాటిపూడి నుంచి విజయనగరం వైపు వస్తుండగా, వాహనం అదుపుతప్పి సమీపంలో ఉన్న ఖానును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురూ గాయపడడంతో స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను 108 వాహనంలో విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పోతురాజు సాయివికాస్ (20) మృతి చెందాడు. మృతుడు తెలంగాణ రాష్ట్రం భద్రాచలం మండలం వనపర్తికి చెందినవాడుగా గుర్తించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.