‘నిద్ర’మాని నిధులివ్వండి | stop sleeping and grant the money | Sakshi
Sakshi News home page

‘నిద్ర’మాని నిధులివ్వండి

May 6 2015 5:16 AM | Updated on Aug 14 2018 11:26 AM

రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిద్రపోతే అవి పూర్తి కావాని, నిధులు కేటాయిస్తేనే సాధ్యమని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఎద్దేవా చేశారు.

బెళుగుప్ప : రాష్ట్రంలోని  నీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిద్రపోతే అవి పూర్తి కావాని, నిధులు కేటాయిస్తేనే సాధ్యమని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఎద్దేవా చేశారు. మండల కేంద్రంలో మంగళవారం  లక్ష సంతకాల కార్యక్రమం ఏర్పాటు   చేశారు.  ఎమ్మెల్యేతోపాటు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సీపీ వీరన్న ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ హంద్రీ నీవా మొదటిదశ ఆయకట్టుకు ఎగనామం పెట్టి చిత్తూరు, కుప్పంకు నీటిని తరలించే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు.

సంక్రాంతి సంబరాలకు రూ.150 కోట్లు, హెలికాప్టర్ ఖర్చు, విజయవాడ, హైదరాబాద్‌లలో కేబినేట్ ఖర్చులకు రూ.వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు తప్ప రాయలసీమ కరువు రైతులకు సాగునీటికి నిధులు వెచ్చించి నీటిని అందించలేక పోతున్నారని ఆరోపించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి  హంద్రీ నీవాకు రూ. 5800 కోట్లు ఖర్చు చేసి జీడిపల్లి వరకు కృష్ణా జలాలు తీసువచ్చే విధంగా కృషిచేశారని గుర్తు చేశారు. ప్రస్తుత ఖరీఫ్‌కు అయినా  మొదటిదశకు  సాగునీరు అందించాలన్నారు.

నియోజకవర్గంలో 80 వేల ఎకరాలకు సాగునీరు,  బెళుగుప్ప మండల పరిధిలో మాత్రమే జీడిపల్లి రిజర్వాయర్ కింద 26,500 ఎకరాల  ఆయకట్టుకు నీటిని ఇవ్వాలని ఉద్యమించాలని, దీనిపై లక్ష సంతకాలతో ప్రభుత్వానికి నివేదిక అందజేద్దామని పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ హంద్రీ నీవా కింద భూములకు  ఒక తడి ఇస్తే బంగారు పంటలు పండుతాయన్నారు.

మొదటి దశ ఆయకట్టుకు  ప్రస్తుత ఖరీఫ్‌లో నీటిని అందించాలని, లేకపోతే    కాలువలు పగుల గొట్టి నీటిని తీసుకుపోవడానికి వెనుకాడబోమని హెచ్చరించారు. పార్టీలకు అతీతంగా రైతులు సమైక్యంగా పోరాడాలన్నారు.   వైఎస్సార్‌సీపీ  రాష్ట్ర బీసీ సెల్ ప్రదాన కార్యదర్శి దుద్దేకుంట రామాంజనేయులు అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు.

 బెళుగుప్ప సింగిల్‌విండో అధ్యక్షుడు శివలింగప్ప, బెళుగుప్ప సర్పంచ్ రామేశ్వరరెడ్డి, కాలువపల్లి ఎంపీటీసీ వెంకటేశులు,  పార్టీ  మండల ఉపాధ్యక్షుడు అశోక్, శీన, నాయకులు రాజన్న, తిప్పేస్వామి నాయక్, హర్షకుమార్‌రెడ్డి, బాస్కర్‌రెడ్డి, చౌదరి, తిమ్మరాజు  తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement