జగన్‌ ‘ఉక్కు’సంకల్పం 

Steel Factory Hopes Again Raise Ys Jagan Govt Jammalamadugu - Sakshi

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో జిల్లాలో ఉక్కు కర్మాగారం నెలకొల్పడం తథ్యమని జిల్లావాసులు గట్టిగా నమ్ముతున్నారు. తాను ఎన్నికల్లో చెప్పిన విధంగా ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేసేందుకు కొత్త సీఎం చర్యలు ప్రారంభించారు. ఇటీవల ఓ విదేశీ సంస్థ ప్రతినిధులతో ఆయన చర్చలు జరిపారు. కొంత పురోగతి కనిపించింది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి సారథ్యంలో గతంలో ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన జరిగి ఆయన మరణానంతరం పనులు నిలిచిపోయాయి. మళ్లీ ఆయన తనయుడు జగన్‌ నేతృత్వంలో ఉక్కు కర్మాగారం వచ్చి తీరుతుందని జిల్లాప్రజలు ఆశిస్తున్నారు. 

సాక్షి, జమ్మలమడుగు(కడప) : జమ్మలమడుగు మండలంలో స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణంపై తాజాగా ఆశలు చిగురిస్తున్నాయి. 2007లో చిటిమిటి చింతల వద్ద బ్రాహ్మణి స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి  అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. రూ.20వేల కోట్లతో దీనిని నిర్మించేందుకు ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్ధన్‌రెడ్డి అప్పట్లో ముందుకు వచ్చారు. 10వేల మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో నిర్మించాలని సంకల్పించారు. స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణం కోసం 10,670 ఎకరాల భూమిని సేకరించారు. అక్కడే దీనికి అవసరమైన విమానాశ్రయం కోసం మరో 4వేల ఎకరాల భూమిని కేటాయించారు. ఎకరాకు రూ.18వేల వంతున నాటి యాజమాన్యం భూములను కొనుగోలు చేసింది. 2009లో అనూహ్య దుర్ఘటనలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి అసువులు బాయడంతో స్టీల్‌ప్లాంట్‌ పనులు నిలిచిపోయాయి.

రూ.1300 కోట్ల పనులు..
రూ.20వేల కోట్లతో నాలుగు దశల్లో స్టీల్‌ ప్లాంట్‌ను పూర్తి స్థాయిలో నిర్మిస్తామని యాజమాన్యం ప్రకటించింది. మొదట రూ.5వేల కోట్లతో 2.5 మిలియన్‌ టన్నుల సామర్థ్యంగల ప్లాంటు నిర్మాణం పనులకు శ్రీకారం చుట్టింది. రూ.1300 కోట్లతో పనులు కూడా చేపట్టారు. ప్లాంట్‌ నీటి అవసరాలకు గండికోట ప్రాజెక్టు నుంచి రెండు టీఎంసీలను ఇచ్చేందుకు ప్రభుత్వం ఉత్తర్వులను విడుదల చేసింది. మైలవరం జలాశయం నుంచి నీటిని ఇస్తామని వైఎస్‌ ప్రభుత్వం చెప్పింది.

జరిగిన పనులివి
140 గదులతో అతిథి గృహాలను నిర్మించారు. బ్లాస్ట్‌ఫర్నేస్, కోకోవన్‌..స్లీట్‌ వెల్డింగ్‌షాపు, పవర్‌ ప్లాంట్‌..సబ్‌స్టేషన్‌ల పనులు పూర్తయ్యాయి. రిజర్వాయర్‌ సెంట్రల్‌ ప్లాంట్‌ పనులు కూడా పూర్తయ్యాయి. వైఎస్‌ చనిపోయినప్పటి నుంచి పనులు పూర్తిగా నిలిచిపోయాయి. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం 2012లో స్టీల్‌ప్లాంట్‌కు ఇచ్చినభూములను వెనక్కితీసుకుంది. వివాదం కోర్టుకు వెళ్లడంతో  భద్రపరిచారు. దానికి సంబంధించిన భూమిని కాకుండ మిగతా భూమి అంతా ప్రభుత్వ ఆధీనంలో ఉంది. స్టీల్‌ఫ్లాంట్‌ యాజమాన్యం కొర్టుకు వెళ్లింది.దీనికి  సంబంధించిన వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది.దీంతో ప్లాంటు కోసం విదేశాలనుంచి దిగుమతి చేసుకున్న సామగ్రిని బ్రహ్మిణిలో భద్రపరిచారు. దానికి సంబంధించిన భూమి కాకుండ మిగతా భూమి ప్రభుత్వ ఆధీనంలో ఉంది. దీనికి  సంబంధించిన వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది.

రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న...
రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొదటి సారిగా 2014లో ఎన్నికలు జరిగాయి. రాష్ట్ర విభజన సమయంలో కడప జిల్లాకు స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని చట్టంలో పొందుపరిచారు. 2014లో ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణం గురించి పట్టించుకోలేదు. ఎన్నికల సమీపిస్తున్న సమయంలో కంటితుడుపుగా 2018 డిసెంబర్‌లో మైలవరం మండలంలోని కంబాలదిన్నె వద్ద స్టీల్‌ ప్లాంటు నిర్మాణం కోసం పైలాన్‌ను ఆవిష్కరించారు. పైలాను కోసం రెండుకోట్ల రూపాయలు వెచ్చించడం విశేషం. ఈ నేపథ్యంలో మొన్నటి ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అధినేతగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్టీల్‌ప్లాంటు నిర్మిస్తామని జిల్లా వాసులకు హామీ ఇచ్చారు.

ఇచ్చిన హామీల అమలుకు సీఎంగా పగ్గాలు చేపట్టిన వెంటనే ఆయన వడివడిగా అడుగులు వె?స్తున్నారు. అందులో భాగంగానే స్టీల్‌ప్లాంటుపై కూడా ఆయన గట్టి సంకల్పంతో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల రూ.30వేల కోట్లతో రాష్ట్రంలో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుకు కొరియాకు చెందిన పోస్కో స్టీల్‌ కంపెనీ ఆసక్తి చూపింది. ముఖ్యమంత్రితో ఈ సంస్థ ప్రతినిధులు చర్చించారు. విశాఖ వంటి భారీ ప్లాంటు నిర్మిస్తామని సంస్థ ప్రతినిధులు చెప్పినట్లు తెలిసింది. అయితే ఈ తరహాలో కడపజిల్లాలో ఏర్పాటుకు తగిన పరిస్థితులు చూడాలంటూ ముఖ్యమంత్రి వారికి సూచించిట్లు తెలుస్తోంది. చర్చలన్ని సానుకూలంగా జరిగి సఫలమైతే మరో మూడు నెలలు లేదా డిశెంబర్‌ చివరిలోగా స్టీలుప్లాంటు శంకుస్థాపన జరుగుతుందని భావిస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top