
సాక్షి, న్యూఢిలీ: అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం కమ్మవారిపల్లి గ్రామంలో జరుగుతున్న హంద్రీ–నీవా సుజల స్రవంతి పనుల్లో ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. దీనిపై కౌంటర్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. ఈ ప్రాజెక్టు కోసం తమ స్థలాలను స్వాధీనం చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ కింద నోటిఫికేషన్ జారీచేసిందని, ఇది 2013 భూసేకరణ చట్టానికి విరుద్ధమని ముమ్మనేని వెంకటరాముడు హైకోర్టులో పిటిషన్ వేశారు.
భూసేకరణ సబబేనని, పిటిషనర్‌కు నష్టపరిహారం చెల్లించి భూసేకరణ జరపవచ్చని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో పిటిషనర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీన్ని సోమవారం జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ నేపథ్యంలో ధర్మాసనం హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధిస్తూ, కౌంటర్ వేయాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది.