కౌంటింగ్‌పై మే 7న రాష్ట్రస్థాయి శిక్షణ

State Level Training on May 7 on counting Says Gopal krishna Dwivedi - Sakshi

ఫలితాల వెల్లడికి ఆరు గంటల సమయం

3.50 లక్షల మందికి పోస్టల్‌ బ్యాలెట్లు జారీ

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎన్నికల కౌంటింగ్‌పై ఉన్నతాధికారులకు అవగాహన కల్పించేందుకు మే 7న రాష్ట్రస్థాయి శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. సోమవారం సచివాలయంలో కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ప్రతి నియోజకవర్గానికి చెందిన ఆర్వోలు, ఈఆర్వోలు ఈ సమావేశానికి హాజరుకానున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో తొలిసారిగా వీవీప్యాట్‌లను వినియోగించడంతో ఓట్ల లెక్కింపులో అనుసరించాల్సిన నిబంధనలపై ఈ సమావేశంలో అవగాహన కల్పించనున్నట్లు వివరించారు.

నియోజకవర్గానికి 5 వీవీప్యాట్లను ఆర్వో, పరిశీలకుల సమక్షంలో లెక్కించాల్సి ఉండటంతో అసెంబ్లీ ఫలితాలకు ఆరు గంటలకు పైగా సమయం పడుతుందన్నారు. మొత్తం రాష్ట్రంలో 1,750 వీవీప్యాట్లలో పోలైన స్లిప్పులను లెక్కించాల్సి ఉంటుందని తెలిపారు. ఈవీఎంలో పోలైన ఓట్లు, వీవీప్యాట్లలోని స్లిప్పులతో సరిపోయిన తర్వాతనే ఫలితాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు. ఒకవేళ ఈవీఎంలు మొరాయిస్తే వాటిని పక్కన పెట్టి మిగిలిన వాటిని లెక్కిస్తామన్నారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత మొరాయించిన ఈవీఎంలపై ఆర్వో నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.

ఒకవేళ అభ్యర్థి మెజార్టీ కంటే మొరాయించిన ఈవీఎంలో నమోదైన ఓట్లు తక్కువ ఉంటే ఏజెంట్ల నిర్ణయం ప్రకారం ఆర్వో నడుచుకుంటారని తెలిపారు. మెజార్టీ కంటే మొరాయించిన ఈవీఎంలో నమోదైన ఓట్లు ఎక్కువ ఉంటే ఆ ఈవీఎంకు చెందిన బూత్‌లో రీ పోలింగ్‌ నిర్వహించే పరిస్థితులు ఏర్పడతాయన్నారు. రాష్ట్రంలో 3.50 లక్షల మందికి పోస్టల్‌ బ్యాలెట్‌లు ఇచ్చామని, ఇందులో 90 శాతంపైగా ఓట్లు నమోదైతే ఒక శాతం పోలింగ్‌ పెరుగుతుందని వివరించారు. దీంతో పోటాపోటీగా జరిగే నియోజకవర్గాల్లో ఈ ఓట్లు ప్రభావం చూపించే అవకాశం ఉందన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top