పంచాయతీ పోరుకు కసరత్తు

State Election Commission Orders To Prepare Voters List In AP - Sakshi

వచ్చే నెల 10న ఓటర్ల జాబితా ప్రదర్శించాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులు జారీ

గత ఏడాది ఆగస్టు నుంచి  గ్రామాల్లో కొనసాగుతున్న ‘ప్రత్యేక’ పాలన

సాక్షి, అరసవల్లి (శ్రీకాకుళం): ఓ వైపు సార్వత్రిక ఎన్నికల వే‘ఢీ’ కొనసాగుతుంటే..మరోవైపు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అధికారులు మరో కీలక అడుగు వేశారు. గ్రామ స్థాయిలో ప్రధానమైన ‘స్థానిక’ ఎన్నికల నిర్వహణకు సమాయత్తమవుతున్నారు. గ్రామస్థాయిలో వార్డుల వారీగా, కేటగిరీల వారీగా ఓటర్ల జాబితాలను ప్రదర్శనకు సిద్ధం చేయాలంటూ తాజాగా ఉత్తర్వులు విడుదల చేయడంతో.. త్వరలోనే పంచాయతీల పోరు షురూ అన్న సంకేతాలు పంపినట్లయ్యింది.

జిల్లాలోని 1095 గ్రామ పంచాయతీల్లోనూ పాలక వర్గాల గడువు తీరిపోవడంతో గత ఏడాది ఆగస్టు 2 నుంచి ‘ప్రత్యేక’ అధికారుల పాలన కొనసాగుతున్న సంగతి విదితమే. వాస్తవానికి గత ఏడాదే స్థానిక ఎన్నికలకు సిద్ధపడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, తీవ్ర ప్రతికూల వాతావరణం నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు వెనుకడుగు వేసింది. అప్పటి నుంచి ప్రత్యేక పాలనలోనే పల్లెలున్నాయి. శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ డాక్టర్‌ ఎన్‌.రమేష్‌కుమార్‌ జారీ చేసిన తాజా ఉత్తర్వుల మేరకు మరికొద్ది నెలల్లోనే పంచాయతీలకు కూడా ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నట్లు సిగ్నల్‌ ఇచ్చేశారు. ఇందులో భాగంగానే శుక్రవారం సాయంత్రం జిల్లా పంచాయతీ అధికారులకు ఉత్తర్వులు పంపారు.

గతేడాది జూన్‌లో కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేష్‌కుమార్‌ జారీ చేసిన ఉత్తర్వులు మేరకు అప్పట్లో కూడా పంచాయతీలకు ఓటర్ల జాబితాను ప్రదర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో ఎన్నికల ప్రక్రియకు తాత్కాలిక బ్రేక్‌ పడిందనే చర్చ జరిగింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ పాలన గడువు కూడా పూర్తికానుండడంతో, సార్వత్రిక ఎన్నికలు జరిగిన వెంటనే ‘స్థానిక’ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల చేద్దామనే ఆలోచనలో రాష్ట్ర ఎన్నికల అధికారులున్నట్లు సమాచారం. ఈమేరకు తొలి అడుగుగా వచ్చే నెల 10న అన్ని పంచాయతీల్లోనూ వార్డుల వారీగా ఓటర్ల జాబితాను ప్రదర్శించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

జిల్లాలో 21 లక్షల 75 వేల మంది ఓటర్లు..
2019 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారిని ప్రామాణికంగా తీసుకుని జిల్లాలో అన్ని పంచాయతీల్లోనూ ఓటర్లను ఖరారు చేయాల్సి ఉంది. తాజా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో 1095 పంచాయతీల నుంచి 21,75,176 మంది ఓటర్లతో జాబితా సిద్దమైంది. ఇందులో పురుషులు 10,88,410, మహిళలు 10,86,493 మందిగా నమోదయ్యారు.

జిల్లాలో ఇదీ పరిస్థితి..
2013లో జిల్లాలో మొత్తం 1100 పంచాయితీలకు గాను 1099 పంచాయతీలకు, 10,542 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. అప్పట్లో శ్రీకాకుళం మున్సిపాల్టీలో నగరానికి శివారు పంచాయతీలను విలీనం చేసే క్రమంలో పెద్దపాడు పంచాయతీ ఆమోదం తెలియజేయడంతో పంచాయతీకి ఎన్నికలు జరగలేదు. దీంతో ఇప్పటికీ అక్కడ ప్రత్యేకాధికారి పాలనే కొనసాగుతోంది. తాజా పరిస్థితులను బట్టి చూస్తే జిల్లాలో మొత్తం 5 పంచాయతీలు పూర్తిగా వంశధార ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా పూర్తిగా తొలిగింపునకు గురయ్యాయి. హిరమండలం పరిధిలోని చిన్న కొల్లివలస, పెద్ద సంకిలి, శిలగాం, దుగ్గిపురం, తులగాం పంచాయతీలతో పాటు వంగర మండలంలోని దేవకివాడ గ్రామ పంచాయతీ కూడా వంశధార ప్రాజెక్టు కారణంగా మెర్జింగ్‌ అయ్యింది.

గార్లపాడులో మూడు అనుబంధ గ్రామాలు (హేమ్లెట్స్‌), పాడలి పంచాయతీలో రెండు అనుబంధ గ్రామాలు వంశధార పరిధిలో తొలిగిపోయినప్పటికీ, ఈ రెండు పంచాయతీలు మాత్రం రికార్డుల్లో కొనసాగుతున్నాయి. వంశధార ప్రాజెక్టు భూసేకరణ కారణంగా మొత్తం 5 పంచాయతీలు పూర్తిగా కాలగర్భంలో కలిసిపోయాయి. ఇకపై జిల్లాలో 1095 పంచాయతీలుగా రికార్డుల్లో నమోదు చేసుకోవాల్సి ఉంది. ఈ పంచాయతీల్లోనే ఈసారి ఎన్నికలు జరుగనున్నాయని అధికారులు కూడా స్పష్టం చేస్తున్నారు. గ్రామ సర్పంచులతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు కూడా ఇవే ఓటర్ల జాబితా ఆధారంగా ఎన్నికలను నిర్వహించే అవకాశాలు లేకపోలేదు. గతంలో మాదిరిగా ఈసారి కూడా వార్డుకో పోలింగ్‌ స్టేషన్‌ ఉండేలా ఎన్నికల అధికారులు నిర్ణయించారు. చట్ట ప్రకారం 50 శాతం పంచాయతీలు, వార్డులను మహిళలకు, జనాభా దామాషా ప్రకారం రొటేషన్‌ పద్ధతిలో రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంది. 

చర్యలు చేపడతాం 
జిల్లాలో మొత్తం 1095 పంచాయతీల్లో వార్డుల వారీగా కొత్త ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తాం. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఎన్నికల అధికారుల ఉత్తర్వుల ప్రకారం వచ్చే నెల 10న ఓటర్ల జాబితాను ఆయా పంచాయతీ గ్రామాల్లోనే ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తాం. ఎన్నికల అధికారుల సర్క్యులర్‌ ప్రకారం తదుపరి చర్యలు చేపడతాం. ఎన్నికలు ఎప్పుడు జరిగినా అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తాం. 
–  బి.కోటేశ్వరరావు, జిల్లా పంచాయతీ అధికారి, శ్రీకాకుళం 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top