రాహుల్ కోసమే రాష్ర్టం ముక్కలు | State bifurcation for rahul gandhi | Sakshi
Sakshi News home page

రాహుల్ కోసమే రాష్ర్టం ముక్కలు

Dec 10 2013 6:37 AM | Updated on Sep 27 2018 5:59 PM

రాహుల్‌గాంధీని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ బలీయమైన ఆంధ్రప్రదేశ్‌ను ముక్కలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు.

అనంతపురం అర్బన్, న్యూస్‌లైన్:  రాహుల్‌గాంధీని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ బలీయమైన ఆంధ్రప్రదేశ్‌ను ముక్కలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. సోనియాగాంధీ బర్‌‌తడేని సోమవారం నిరసన దినంగా పాటించారు. ఇందులో భాగంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో సోనియా దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. నగరంలోని సుభాష్ రోడ్డు వైఎస్సార్ విగ్రహం వద్ద నుంచి రఘువీరా కాంప్లెక్ మీదుగా క్లాక్‌టవర్ తిరిగి సప్తగిరి సర్కిల్ చేరుకుని దిష్టిబొమ్మకు అంత్యక్రియలు జరిపారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ ఓ ఇటలీ దేశస్తురాలు ఆంధ్రప్రదేశ్ సంస్కృతిని తెలుసుకోకుండా స్వార్థ రాజకీయాల కోసం విభజనకు తెరలేపారని విరుచుకుపడ్డారు. సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి ‘సమైక్య’ ముసుగులో విభజనకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సీడబ్ల్యూసీ తీర్మానం వచ్చిన వెంటనే సీఎం రాజీనామా చేసి ఉంటే ఈ పరిస్థితి దాపురించేది కాదన్నారు. ఇప్పటి కీ మించి పోయింది లేదని, సీఎంకి దమ్మూ, ధైర్యం ఉంటే  విభజన బిల్లు అసెంబ్లీకి రాకముందే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు లేఖ ఆధారంగానే కేంద్రం నిర్ణయం తీసుకుందన్నారు. ప్రతిపక్ష తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రజల ముందు మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు.

టీడీపీ, కాంగ్రెస్‌లు కుమ్మక్కై విభజన ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నాయన్నారు. నాలుగు రాష్ట్రాల్లో ఇవాళ కాంగ్రెస్ పరిస్థితి ఏ స్థాయికి చేరిందో అందరికీ తెల్సిందేనన్నారు. మన రాష్ట్రంలోనూ కాంగ్రెస్, టీడీపీలను భూస్థాపితం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. సమైక్య రాష్ట్రం కోసం పోరాడుతున్న ఏకైక వ్యక్తి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అని కొనియాడారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా ముఖ్యనేత ఎర్రిస్వామిరెడ్డి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి చింతకుంట మధు, అనుబంధ సంఘాల అధ్యక్షులు రిలాక్స్ నాగరాజు, బోరంపల్లి ఆంజినేయులు, లింగాల రమేష్, మిద్దె భాస్కర్‌రెడ్డి, మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి షెక్షావలి, యువజన విభాగం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు బండిపరుశురాం,  విద్యార్థి విభాగం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు బండిపరుశురాం, నగరాధ్యక్షుడు రంగంపేట గోపాల్ రెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బోయ సుశీలమ్మ, ఉపాధ్యక్షురాలు ప్రమీళమ్మ, బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణవేణి, పార్టీ నగరాధ్యక్షురాలు శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement