సాయమందిస్తే.. సత్తా చాటుతాం ! | Sakshi
Sakshi News home page

సాయమందిస్తే.. సత్తా చాటుతాం !

Published Thu, Mar 1 2018 12:43 PM

Stanford University welcomes nuziveedu iiit students - Sakshi

నూజివీడు :  ఆ నలుగురు నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు. రెక్కలు ముక్కలు చేసుకుని తల్లిదండ్రులు వారిని చదివించుకుంటున్నారు. మారుమూల గ్రామాల్లో పుట్టి ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ప్రతిభ చూపి నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో సీట్లు సాధించారు. ఇంజినీరింగ్‌ విద్యలోనూ అసాధారణ ప్రతిభ చూపెట్టి విదేశాల్లోని యూనివర్సిటీలను సైతం మెప్పించారు. వీరి ప్రతిభను మెచ్చి అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ డీ స్కూల్‌ ఫెలోషిప్‌కు ఎంపిక చేసింది. యూనివర్సిటీ ఆహ్వానం మేరకు ఈ నెలలో అమెరికా వెళ్లేందుకు విద్యార్థుల వద్ద చేతిలో చిల్లిగవ్వలేదు. తల్లిదండ్రులు సైతం డబ్బు ఖర్చుపెట్టి అమెరికా పంపించే పరిస్థితుల్లో లేరు. అమెరికా వెళ్లి రావాలంటే విమాన టికెట్లు,  వెళ్లిన తరువాత ఖర్చులు కలిపి ఒక్కొక్కరికీ దాదాపు రూ.2లక్షలు అవసరమవుతాయి. ఈ నేపథ్యంలో ఎవరైనా దాతలు ఉంటే సాయమందించాలని విద్యార్థులు కోరుతున్నారు.  దాతలు దయతలచి సాయమందిస్తే అమెరికా వెళ్లి తమ సత్తా చాటుతామని వారు పేర్కొంటున్నారు.

ఎంపికైన విద్యార్థులు వీరే..
నూజివీడు ట్రిపుల్‌ ఐటీ నుంచి 125 మంది ఆన్‌లైన్‌ పరీక్షకు హాజరైతే  గడ్డం సాయికుమార్‌ (సీఎస్‌ఈ ప్రథమ సంవత్సరం), లాల్‌సింగ్‌ నాయక్‌ (మెకానికల్‌ ద్వితీయ సంవత్సరం), పుప్పాల ప్రతాప్‌ (సీఎస్‌ఈ ద్వితీయ సంవత్సరం), వంకలపాటి సాయిదుర్గాప్రసాద్‌ (ఈసీఈ ద్వితీయ సంవత్సరం) ఎంపికయ్యారు. వీరికి ఆరువారాల పాటు ఆన్‌లైన్‌లో స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ అధికారులు శిక్షణ ఇచ్చిన తరువాత ఫెలోషిప్‌ను ప్రకటించారు.  మార్చి 15 నుంచి 19వ తేదీ వరకు అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీలో నిర్వహించే సిలికాన్‌ వ్యాలీ మీట్‌ అప్‌–2018 స్ప్రింగ్‌ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఈ నలుగురు విద్యార్థులకు యూనివర్సిటీ వారు ఆహ్వానం పంపించారు. యూనివర్సిటీలో నిర్వహించే మీట్‌లో విద్యార్థులు వివిధ అంశాలపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ చేస్తారు.

ఆర్థిక స్థోమత లేదు
తల్లిదండ్రులు తిరుపతిరావు, లక్ష్మీలు ఇద్దరూ షాపుల్లో పనిచేస్తారు. తమ్ముడు ఇంటర్మీడియెట్‌ చదువుతున్నాడు. అమెరికా వెళ్లాలంటే రూ.2లక్షలు ఖర్చుచేసే స్థోమత లేదు. దీంతో ఎవరైనా దాతలు ఉంటే సాయం చేయాలని కోరుతున్నా.– వంకలపాటి సాయిదుర్గాప్రసాద్,కృష్ణలంక, విజయవాడ

కూలికి వెళ్లి చదివిస్తున్నారు
రైతు కూలీ కుటుంబం నుంచి వచ్చా. నాన్న మల్లయ్య, అమ్మ పార్వతి ఇద్దరూ వ్యవసాయ పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించుకుంటూ నన్ను చదవిస్తున్నారు. అమెరికా వెళ్లేందుకు అవసరమైన డబ్బులు తీసుకురావడం సాధ్యం కాదు.– గడ్డం సాయికుమార్, చీమలమర్రి, నకరికల్లు మండలం, గుంటూరు జిల్లా

అమ్మ కష్టపడి చదివిస్తోంది
మా నాన్న నా చిన్నప్పుడే చనిపోవడంతో అమ్మ లక్ష్మి కూలి చేసుకుంటూ నన్ను చదివిస్తోంది. తమ్ముడు ఉన్నప్పటికీ ఇంటి వద్దే గొర్రెలు మేపుతాడు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తమ్ముడిని చదివించడం లేదు. ఎవరైనా ఆర్థిక సాయం చేస్తే సిలికాన్‌ వ్యాలీకి వెళ్లగలం.– మూడు లాలూనాయక్, చౌడవరం తండా, వేంసూరు మండలం, ఖమ్మం జిల్లా

ఆదుకుంటేనే వెళ్లగలం
తల్లిదండ్రులు శ్రీనివాసరావు, మాధవి ఇద్దరూ వ్యవసాయ పనులకు వెళ్లి జీవనం సాగిస్తున్నారు. అక్కను ఎంబీఏ చదివిస్తున్నారు. అంత డబ్బు పెట్టడమంటే సాధ్యమయ్యే పనికాదు. ఎవరైనా ఆదుకుంటేనే తాము వెళ్లగలం.– పుప్పాల ప్రతాప్, ప్రజ్ఞం,నిజాపట్నం మండలం, గుంటూరు జిల్లా

Advertisement
 
Advertisement
 
Advertisement