సేవ చేస్తే దాడులా..?

Staff Nurse Protest in Anantapur - Sakshi

ఆస్పత్రిలో స్టాఫ్‌నర్సుల ధర్నా  

నిందితునిపై చర్యలకు డిమాండ్‌  

అనంతపురం న్యూసిటీ: సిబ్బంది కొరతతో పనిభారం అధికంగా ఉన్నా ఓర్చుకుని సేవలందిస్తున్న తమపైనే దాడి చేస్తారా అంటూ స్టాఫ్‌నర్సులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టాఫ్‌నర్స్‌ విజయనిర్మలపై దాడిచేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ శుక్రవారం సర్వజనాస్పత్రి ఓపీ బ్లాక్‌ను మూసేసి ధర్నా చేశారు. ఈ నెల ఆరో తేదీ రాత్రి ఆస్పత్రిలోని ఎంఎస్‌ 3 వార్డులో స్టాఫ్‌నర్సు విజయనిర్మలపై పేషెంట్‌ కుటుంబసభ్యులు దాడి చేసిన విషయం విదితమే. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జగన్నాథ్‌ డౌన్‌ డౌన్, దాడికి పాల్పడిన వారిని శిక్షించాలి అంటూ నినాదాలు చేశారు. స్టాఫ్‌నర్సు అసోసియేషన్‌ అధ్యక్షురాలు ఆర్‌బీ పద్మ మాట్లాడుతూ ఆస్పత్రిలో సిబ్బంది బండెడు చాకిరీ మీద వేసుకుని చేస్తున్నా రోగులు, వారి సహాయకులు తమపై దాడులకు పాల్పడడం తగదన్నారు. వందమంది రోగులకు ఒకే స్టాఫ్‌నర్సు సేవలందించాల్సిన దయనీయ పరిస్థితి ఉందన్నారు.  

స్టాఫ్‌నర్స్‌లకు రక్షణ కరువు
సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జగన్నాథ్‌ తమ సమస్యలను పట్టించుకోవడం లేదని అసోసియేషన్‌ అధ్యక్షురాలు ఆర్‌బీ పద్మ ధ్వజమెత్తారు. చాలాసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండాపోయిందన్నారు. ఆస్పత్రిలో సెక్యూరిటీ విభాగం విఫలమైందని, స్టాఫ్‌నర్సులకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. అసోసియేషన్‌ నాయకురాళ్లు రజిని, మంజుల, భాగ్యరాణి, కాంట్రాక్ట్‌ స్టాఫ్‌నర్సు అసోసియేషన్‌ అధ్యక్షురాలు శ్రీదేవి మాట్లాడుతూ స్టాఫ్‌నర్సులపై కత్తులతో దాడి చేసినా పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. సెక్యురిటీ గార్డులు ప్రేక్షకపాత్ర వహించడం మినహా చేసేదేమీ లేదన్నారు. గతంలో తక్కువ సంఖ్యలో హోంగార్డులున్నా ఎటువంటి సమస్యా తలెత్తలేదన్నారు. విజయనిర్మలపై దాడి చేసిన వారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి కఠినంగా శిక్షించాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటన జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ నిర్మల, స్టాఫ్‌నర్సు అసోసియేషన్‌ నాయకురాళ్లు లత, త్రివేణి, నారాయణస్వామి, స్టాఫ్‌నర్సులు మేరీ సుజాత, శోభ, అనిత, సుజిత, ప్రవీణ, హెడ్‌నర్సులు తదితరులు పాల్గొన్నారు. 

అమానుష చర్య  
స్టాఫ్‌నర్సుపై దాడి చేయడం అమానుష చర్య అని ఇన్‌చార్జ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కేఎస్‌ఎస్‌ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆస్పత్రి చరిత్రలో ఎన్నడూ ఇటువంటి సంఘటన చోటు చేసుకోలేదన్నారు. స్టాఫ్‌నర్స్‌పై దాడి చాలా బాధకరమన్నారు. దీనిపై ఎస్పీ దృష్టికి తీసుకెళ్లి భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.  

అడిషనల్‌ ఎస్పీకి ఫిర్యాదు
సర్వజనాస్పత్రి స్టాఫ్‌నర్స్‌ విజయనిర్మలపై దాడి చేసిన రామాంజనేయులుపై చర్యలు తీసుకోవాలని స్టాఫ్‌నర్సు అసోసియేషన్‌ నాయకురాళ్లు అడిషనల్‌ ఎస్పీ చౌడేశ్వరికి ఫిర్యాదు చేశారు. శుక్రవారం డీపీఓ కార్యాలయంలో ఆమెకి వినతిపత్రం అందజేశారు. ఆస్పత్రిలో సెక్యూరిటీ పెంచాలని కోరారు. ఇందుకు ఏఎస్పీ స్పందిస్తూ రాత్రి వేళల్లో మరో కానిస్టేబుల్‌ను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో మరింత భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. స్టాఫ్‌నర్సు అసోసియేషన్‌ అధ్యక్ష, కోశాధికారులు ఆర్‌బీ పద్మ, రజిని, నాయకులు నారాయణస్వామి, మంజుల, లత, స్టాఫ్‌నర్స్‌ విజయనిర్మల తదితరులు పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top