కానరావా కన్నీళ్లు?!

Srisailam Dam Almost Full Kurnool - Sakshi

కర్నూలు సిటీ: దేశంలోనే అత్యంత కరువు ప్రాంతంగా రాయలసీమ గుర్తింపు పొందింది. అలాంటి ప్రాంతానికి సాగు, తాగునీరు ఇచ్చేందుకు అవకాశం ఉన్నా.. ప్రభుత్వం ఏ మాత్రమూ పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేటాయింపులు ఉన్న రిజర్వాయర్లు కాదని, ఎలాంటి కేటాయింపులూ లేని ప్రాంతానికి నీటిని తరలిస్తున్నా జిల్లాకు చెందిన నేతలు పట్టించుకోవడం లేదు. కృష్ణా జలాలతో శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా తొణికిసలాడుతున్నప్పటికీ జిల్లాలోని గోరుకల్లు, అవుకు రిజర్వాయర్లకు నీరందని దుస్థితి నెలకొంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో సీమకు కృష్ణా జలాలు తరలించి గోరుకల్లులో 10 టీఎంసీలు, అవుకులో 4 టీఎంసీలు నింపుతామని, గండికోటకు కూడా నీరు తీసుకుపోతామని గత నెల 28న జరిగిన నీటిపారుదల సలహా మండలి (ఐఏబీ) సమావేశంలో తీర్మానం చేశారు. కానీ ఇంత వరకు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు తుంగభద్ర, కృష్ణా నదుల నుంచి 3.63 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీటి ప్రవాహం ఉంది. దీంతో పూర్తి స్థాయి నీటి మట్టానికి (885 అడుగులు) చేరువలో ఉంది. దీంతో  నేడు (శనివారం) రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు శ్రీశైలం క్రస్ట్‌ గేట్లు పైకెత్తి దిగువనున్న సాగర్‌కు నీటిని విడుదల చేయనున్నారు.
 
అవకాశమున్నా అన్యాయమే.. 
పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి 44 వేల క్యూసెక్కుల నీటిని తీసుకునేందుకు అవకాశం ఉన్నా.. నిన్న, మొన్నటి వరకు కేవలం 2 నుంచి4 వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే ఇచ్చారు. ఈ నీటిలో నుంచి కూడా కేసీ ఎస్కేపు ఛానల్‌ నుంచి నిప్పులవాగు ద్వారా నెల్లూరు జిల్లాలోని సోమశిలకు పంపించారు. ఎస్‌ఆర్‌బీసీకి ఇవ్వలేదు. ఎక్కువ నీటిని తీసుకునేందుకు అవకాశం లేదని, మీరు గట్టిగా మాట్లాడితే పోతిరెడ్డిపాడు నుంచి పూర్తి స్థాయిలో బంద్‌ చేయాలని కూడా జల వనరుల శాఖలోని ఓ ఉన్నతాధికారి మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. గురువారం శ్రీశైలానికి భారీ వరద రావడంతో తప్పనిసరి పరిస్థితిలోనే పోతిరెడ్డిపాడు నుంచి 26 వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. కానీ ఎస్‌ఆర్‌బీసీకి మాత్రం తక్కువగానే నీటిని విడుదల చేస్తున్నారు.
 
గోరుకల్లు నిండేదెప్పుడు? 
శ్రీశైలం కుడి గట్టు కాలువ కింద జిల్లాలో 1.55 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ కాలువకు 19 టీఎంసీల  శ్రీశైలం నీటి వాటా ఉంది. దీని ప్రధాన కాలువ పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ నుంచి ప్రారంభమవుతుంది. 16.34 కి.మీ దగ్గర ఉన్న బానకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ వద్ద నుంచి 16 బ్లాకులు 198 కి.మీ వరకు ఉన్నాయి. ఇదేమార్గంలో 50.22 కి.మీ దగ్గర గోరుకల్లు రిజర్వాయర్‌ 12.34 టీఎంసీల సామ«ర్థ్యంతో, 112 కి.మీ వద్ద 4.62 టీఎంసీల సామర్థ్యంతో అవుకు స్టేజీ–1,2 రిజర్వాయర్లు ఉన్నాయి. కాలువ నిర్మాణ సమయంలో 11,150 క్యూసెక్కుల మేరకు మాత్రమే డిజైన్‌ చేశారు. ఈ కాలువ నుంచి గాలేరుకు నీరు పంపించడం కోసం  21 వేల క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచేందుకు చేపట్టిన పనులు అసంపూర్తిగా ఉన్నాయి.

అయినా ఇప్పుడు 10 వేల క్యూసెక్కుల నీటిని ఇచ్చేందుకు అవకాశం ఉంది. కానీ మూడు వేల క్యూసెక్కులు మాత్రమే విడుదల చేస్తున్నారు. ఇలా అయితే 12.34 టీఎంసీల సామర్థ్యం ఉన్న గోరుకల్లు నిండేదెప్పుడు అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఏడాది ఇందులో 10 టీఎంసీల నీటిని నిల్వ చేయడంతో పాటు ఆవుకు టన్నెల్‌ ద్వారా 10 వేల క్యూసెక్కులకుపైగా పంపిస్తామన్న ఇంజినీర్లు ఇంత వరకు ఆ స్థాయిలో పనులు పూర్తి చేలేదని తెలుస్తోంది. అదే విధంగా అవుకు రిజర్వాయర్‌లో మూడు టీఎంసీలు కూడా పెట్టలేని పరిస్థితి ఉంది. ఇందుకు కారణం ఆ స్థాయిలో నీటి నిల్వకు అటవీశాఖ అనుమతులు లేకపోవడమే. అనుమతులు తీసుకోవడంలో నాలుగేళ్లుగా నాన్చుతున్నారు. ఇక వైఎస్సార్‌ జిల్లాలోని గండికోటకు నీరు పంపించాలంటే ఎస్‌ఆర్‌బీసీకి నీటి విడుదల పెంచాలని ఆ జిల్లా రైతులు, ప్రతిపక్ష నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

నెల్లూరుకు నీటి తరలింపులో ఆంతర్యమేమిటి? 
రాయలసీమకు చెందిన రిజర్వాయర్లు నింపకుండానే గత నెల 25 నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా విడుదల చేస్తున్న నీటిని గుట్టుచప్పుడు కాకుండా కేసీ ఎస్కేపు ఛానల్‌ ద్వారా నిప్పులవాగుకు, అక్కడి నుంచి కుందూ నది గుండా నేరుగా నెల్లూరు జిల్లాలోని సోమశిల రిజర్వాయరుకు పంపుతున్నారు. ఇప్పటికే 15 టీఎంసీలకుపైగా నీటిని పంపించారు. ఇంజినీర్లు మాత్రం 4.8 టీఎంసీలే పంపించినట్లు చెబుతున్నారు. వాస్తవానికి సోమశిలకు కృష్ణా జలాలను తరలించేందుకు ఎలాంటి హక్కు కానీ, వాటా కానీ లేదు. కేవలం చెన్నైకు తాగునీరు ఇచ్చేందుకు మాత్రమే అనుమతులు ఉన్నాయి. దీన్ని సాకుగా చూపి ప్రతి ఏటా రాయలసీమ కాలువలకు నీరు ఇవ్వకుండా సోమశిలకు తరలించడంలో ఉన్న ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదని ఇంజినీర్లే అభిప్రాయపడుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top