‘ఎమ్మెల్యేలూ గళమెత్తండి. వెనుకబడిన జిల్లా అభివృద్ధికి కృషి చేయండి. సమస్యల పరి ష్కారానికి నడుం బిగించండి. నిధుల కేటాయింపు,
సాక్షి ప్రతినిధి, విజయనగరం : ‘ఎమ్మెల్యేలూ గళమెత్తండి. వెనుకబడిన జిల్లా అభివృద్ధికి కృషి చేయండి. సమస్యల పరి ష్కారానికి నడుం బిగించండి. నిధుల కేటాయింపు, ప్రత్యేక ప్రాజెక్టులపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురండి. ప్రకటించిన అభివృద్ధి పథకాలొచ్చేలా సర్కార్‌ను ప్రశ్నించండి. నవ్యాంధ్ర ప్రదేశ్‌లోనైనా జిల్లా కష్టాలు తీరేలా చొరవ తీ సుకోండి.’ ఇదీ జిల్లా ప్రజల వేడుకో లు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో ఏ ఒక్క అభివృద్ధి పనీ జరగలేదు. ఎన్నికల ముం దు, ఎన్నికల తర్వాత అరచేతిలో వైకుంఠం చూపించిన చంద్రబా బు ఇప్పుడా హామీల జోలికి పోవడం లేదు. తాను ప్రకటిం చిన వాటిని ఎప్పుడో మరిచి పోయారు. వాటిని ఎమ్మెల్యేలే గుర్తు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఎన్నికలకు ముందు...
ఎన్నికలకు ముందు జిల్లాకొచ్చిన ప్రతి సారి విజయనగరం జిల్లాకు ప్రత్యేక నిధులిస్తానని చంద్రబాబు ప్రకటించారు. తోటపల్లితో పాటు తారకరామ తీర్థ సాగర్ ప్రాజెక్టును ఏడాదిలోపు పూర్తి చేస్తామన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇప్పుడున్న జూట్ పరిశ్రమలకు అదనంగా మరికొన్ని తెస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు వాటిలో ఏ ఒక్కటీ అమలు చేయలేదు. కనీసం వాటి విషయైమై చర్చించిన దాఖలాల్లేవు.
ఎన్నికల తర్వాత...
అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సీఎం జిల్లాపై వరాల జల్లు కురిపించారు. జిల్లా అభివృద్ధి ప్రణాళిక అని తొమ్మిదింటిని ప్రకటించారు. విజయనగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతానని, ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తామని, గిరిజన యూనివర్సిటీని నెలకొల్పుతామని, ఫుడ్‌పార్క్ ఏర్పాటు చేస్తామని, పారిశ్రామిక నగరంగా తీర్చిదిద్దుతామని, గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు చేస్తామని, లలిత కళల అకాడమీని ఏర్పాటు చేస్తానని, నౌకాశ్రయం, హార్డ్‌వేర్ పార్క్‌ను నిర్మిస్తామని, తోటపల్లి ప్రాజెక్టును ఏడాది లోపు పూర్తి చేస్తామని ప్రకటించారు. కానీ ఏదీ కార్యరూపం దాల్చలేదు. గిరిజన యూనివర్సిటీ, ప్రభుత్వ మెడికల్ కళాశాలపై నీలి నీడలు కమ్ము కున్నాయి.
మిగతా వాటి సంగతంతేనా..?
జిల్లాలో సమస్యలు ఎక్కడికక్కడే ఉన్నాయి. ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలు మూతపడ్డాయి. జ్యూట్ మిల్లుల సమస్య తీరడం లేదు. మూతపడిన పరిశ్రమలు తెరుచుకోవడం లేదు. కార్మికుల ఇళ్లల్లో ఆకలి కేకలు విన్పిస్తున్నాయి. హుద్‌హుద్ తుపాను సాయం అంతంతమాత్రంగానే ఉంది. నష్టానికి, పరిహారానికి ఎక్కడా పొంతన లేదు. పలుచోట్ల అక్రమాలు కూడా జరిగాయి. ఇందిరమ్మ పథకం కింద మంజూరైన ఇళ్లకు బిల్లులు అందడం లేదు. నిధుల్లేవన్న కారణంతో అధికారులు చేతులేత్తేస్తున్నారు. దీంతో నిర్మాణ దశలో ఉన్న ఇళ్లు శిథిలావస్థలోకి వెళ్లిపోతున్నాయి. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల పరిస్థితి దయనీయంగా ఉంది. ఇవే కాదు అనేక ఇరిగేషన్, ఉపాధి హామీ, భూసేకరణ, నిధుల్లేమి తదితర సమస్యలు ఉన్నాయి. వీటిన్నింటిపైనా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రస్తావించాలని, ఓట్లేసి గెలిపించిన ప్రజలు వేడుకుంటున్నారు.