రెచ్చిపోతున్న చికెన్‌ మాఫియా

Special Article On Chicken Danda In Nellore District - Sakshi

చెన్నై, బెంగళూరుల్లో పనికి రాని చికెన్‌ జిల్లా మార్కెట్‌కు..

రోజుకు వెయ్యి కిలోలకు పైగా దిగుమతి, కిలో రూ.30 నుంచి రూ.40కు కొనుగోలు

జిల్లాలో రూ.140 నుంచి రూ.170 వరకూ విక్రయం

బార్లు, రెస్టారెంట్లకు తక్కువ ధరకు సరఫరా

హోటళ్లలో రకరకాల చికెన్‌ ముక్కలు నోరూరిస్తున్నాయని లాగించారో అంతే.. ఆస్పత్రిలో బెడ్‌ ఎక్కాల్సిందే. మాంసం దుకాణం నుంచి కొని తెచ్చుకుని వండుకు తిన్నా అదే పరిస్థితి.. జిల్లాలో చికెన్‌ మాఫియా రెచ్చిపోతోంది. పొరుగు రాష్ట్రాల్లో నిల్వ ఉంచిన, చెడిపోయిన మాంసాన్ని తీసుకువచ్చి చెలగాటమాడుతోంది. నెలరోజులుగా అధికారులు దాడులు చేస్తున్నారు. రోజుకో మోసం వెలుగుచూస్తోంది. చెన్నై, బెంగళూరు నగరాల్లో డంపింగ్‌ యార్డుకు వెళ్లాల్సిన  వేల కేజీల చికెన్‌ జిల్లాకు తీసుకువచ్చి విక్రయిస్తుండటాన్ని తాజాగా గుర్తించిన అధికారులు విస్తుపోయారు. ప్రజలు మాంసం దుకాణాలకు, హోటళ్లకు వెళ్లాలన్నా భయపడుతున్నారు. జిల్లాలో జరుగుతున్న నయా చికెన్‌ దందాపై ప్రత్యేక కథనం.

సాక్షి, నెల్లూరు: జిల్లాలో నయా చికెన్‌ దందా వెలుగుచూసింది. ఇతర రాష్ట్రాల్లో పనికి రాకుండా డంపింగ్‌ యార్డుకు వెళ్లే చికెన్‌ను తక్కువ ధరకు కొనుగోలు చేసి విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతోంది. పొరుగు రాష్ట్రాల నుంచి జిల్లా మార్కెట్లోకి రోజూ ఏకంగా వెయ్యి కిలోలకు పైగా పనికిరాని చికెన్‌ను దిగుమతి చేస్తోంది. నగరంలోని అనేక బార్లు, హోటళ్లకు వీటినే సరఫరా చేస్తోంది. నెల్లూరు నగరపాలక సంస్థ అధికారుల దాడులతో చెన్నై చికెన్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నగరంతో పాటు సూళ్లూరుపేట, నాయుడుపేట, గూడూరు, తదితర ప్రాంతాలకు నిత్యం చెన్నై మార్కెట్‌ నుంచి నాసిరకం చికెన్‌ దిగుమతవుతోంది. బెంగళూరు నుంచి వారంలో రెండుసార్లు జిల్లా మార్కెట్‌కు చికెన్‌ దిగుమతవుతోంది. చెన్నై, బెంగళూరుల్లో చికెన్‌ లివర్‌ను, కందనకాయలు, కోడి వెనుక భాగాన్ని వేస్ట్‌గా తీసేసి డంపింగ్‌ యార్డుకు తరలిస్తుంటారు. దీన్ని స్థానిక వ్యాపారులు ఆదాయవనరుగా మార్చుకున్నారు. మార్కెట్లో సగటున చికెన్‌ ధర నాణ్యతను బట్టి రూ.140 నుంచి రూ.170 వరకు ఉంటుంది. ఈ క్రమంలో స్థానిక వ్యాపారులు అడ్డదారులు తొక్కుతున్నారు.


ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన చెన్నై చికెన్‌

భారీగా లాభాల ఆర్జనకు ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి నాసిరకం మాంసంతో కల్తీకి పాల్పడుతున్నారు. కొద్ది నెలలుగా నగరంలో ఇదే తంతు జరుగుతున్నా అధికారులు దృష్టి సారించకపోవడంతో వాస్తవాలు వెలుగులోకి రాలేదు. ఈ క్రమంలో కలెక్టర్‌ శేషగిరిబాబు ఆదేశాలతో ఫుడ్‌ కంట్రోల్‌ విభాగాధికారులు నెల్లూరు నగరంలో నగరపాలక సంస్థ అధికారులు, మున్సిపాల్టీల్లో స్థానిక అధికారులు వరుస దాడులు నిర్వహిస్తుండడంతో రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. కొద్ది రోజులుగా హోటళ్లలో నిల్వ ఉంచిన చికెన్, ఇతర మాంసంతో వంటలు చేస్తున్నట్లు గుర్తించి పెద్ద సంఖ్యలో కేసులు నమోదు చేశారు. కొనసాగింపుగా చికెన్‌ స్టాళ్లపై దృష్టి సారించారు. దీంతో చికెన్‌ స్టాళ్లలో దిగుమతి చికెన్‌ను ఫ్రిజ్‌లలో ఉంచి మూడు, నాలుగు రోజులు గడిచాక కూడా విక్రయిస్తున్నారు. 

దిగుమతి చికెన్‌ కిలో రూ.30 నుంచి రూ.40
చెన్నై, బెంగళూరు చికెన్‌ మార్కెట్లో నిత్యం విక్రయాలు వేల కిలోల్లో జరుగుతుంటాయి. అక్కడ నాసిరక చికెన్‌ను స్థానిక చికెన్‌ స్టాల్‌ నిర్వాహకులు కిలో సగటున రూ.30 నుంచి రూ.40కు రవాణా ఖర్చులతో కలిపి కొనుగోలు చేసి ఇక్కడి స్టాళ్లలో రోజువారీ చికెన్‌తో కలిపి విక్రయిస్తుంటారు. వినియోగదారుడే కాకుండా నిర్వాహకుడు సైతం గుర్తుపట్టలేని విధంగా కలిపేస్తారు. నగరంలో ప్రతి వారం సగటున 60 శాతం మంది చికెన్‌ను కొనుగోలు చేస్తుంటారు. ఒక్క ఆదివారం రోజే నగరంలో సగటున 16 వేల కిలోల చికెన్‌ విక్రయాలు జరగుతుంటాయి. ఇక రోజువారీగా హోటళ్లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లకు వెయ్యి కిలోలపైనే సరఫరా చేస్తుంటారు. ఈ క్రమంలో అక్రమంగా తెచ్చి కల్తీ చేసిన చికెన్‌ను ఎక్కువగా బార్‌ అండ్‌ రెస్టారెంట్లకు, నగర, శివార్లలోని దాబాలకు ఎక్కువగా విక్రయిస్తున్నారు. తక్కువ ధరకే చికెన్‌ను సరఫరా చేస్తుండటంతో నాణ్యత గురించి ఎవరూ పట్టించుకోని పరిస్థితి. వారానికి మూడు నుంచి నాలుగు వేల కిలోల చికెన్‌ ఎక్కువగా చెన్నై నుంచి వస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు. 

ప్రజారోగ్యం గాలికి
కల్తీ, నిల్వ ఉంచిన చికెన్‌ను విక్రయించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కల్తీ, నిల్వ ఉంచిన చికెన్‌లో బ్యాక్టీరియా సాధారణ స్థాయి కంటే ఐదు వందల రెట్లు అధికంగా ఉంటుంది. దీర్ఘకాలంలతో మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ప్రధానంగా కడుపునొప్పి, విరేచనాలు, నరాల సంబంధిత జబ్బులతో పాటు నిల్వ ఉంచి మాంసంలో ఎలాంటి పోషక గుణాలు ఉండవు. దీని వల్ల టైఫాయిడ్‌ జ్వరాలు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని వైద్యులు తెలిపారు. 

మెగ్‌డీలో నిల్వ చికెన్‌ గుర్తింపు
నెల్లూరు సిటీ: దర్గామిట్టలోని రిలయన్స్‌ సూపర్‌ ఎదురుగా ఉండే మెగ్‌డీలో నగరపాలక సంస్థ మున్సిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ వెంకటరమణ మంగళవారం తనిఖీలు చేశారు. ఈ క్రమంలో నిల్వ ఉండే చికెన్, ఎక్స్‌పైరీ డేట్‌ పూర్తయిన బ్రెడ్, తదితర ఆహార పదార్థాలను గుర్తించారు. యజమానికి రూ.50 వేల జరిమానా విధించారు. వెటర్నరీ డాక్టర్‌ మదన్‌మోహన్, శానిటరీ సూపర్‌వైజర్‌ సాయీపీరా, ఇన్‌స్పెక్టర్‌ శేషయ్య, తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top