48 గంటల్లో సీమకు నైరుతి!

Southwest Monsoons To The State In 48 hours - Sakshi

నేడు, రేపు కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు

3, 4 రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం

శాంతించని భానుడు.. నేడు కూడా వడగాడ్పుల ప్రభావం

సాక్షి, విశాఖపట్నం/అమరావతి/అనకాపల్లి: ఉష్ణతాపంతో ఉడికిపోతున్న ప్రజలకు చల్లటి కబురు! నైరుతి రుతుపవనాలు ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయి. తొలుత  రాయలసీమలో ప్రవేశించి 24 గంటల్లోనే ఉత్తర కోస్తాకు విస్తరించనున్నాయి. నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం కేరళను దాటి కర్ణాటక, తమిళనాడుల్లోని కొన్ని ప్రాంతాల్లోకి విస్తరించాయి. ఇవి 48 గంటల్లోగా రాయలసీమలోకి ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేస్తోంది. మరోవైపు ఆది, సోమవారాల్లో కోస్తాంధ్రలో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు, వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. అదే సమయంలో రాయలసీమ, కోస్తాంధ్రల్లో అక్కడక్కడ గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయనున్నాయి. కొన్నిచోట్ల పిడుగులు పడే ప్రమాదం కూడా ఉంది. కోస్తాంధ్రలో నేడు కూడా వడగాడ్పులు వీస్తాయని, రాయలసీమలో సాధారణం కంటే 2–4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ వెల్లడించింది. శనివారం కోస్తాంధ్రలో తీవ్ర వడగాడ్పులు వీచాయి. సాధారణం కంటే 4–9 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

అల్పపీడనం ప్రభావంతో కోస్తాకు వర్ష సూచన
రానున్న మూడు నాలుగు రోజుల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కోస్తాంధ్రకు ఆవల ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 4.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి ఉంది. ఇది బలపడి ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడానికి దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు. నాలుగు రోజుల్లో కోస్తాంధ్రలో వర్షాలు కురవవచ్చని అంచనా వేస్తున్నారు. 

కోస్తా భగభగ
మండిపోతున్న ఎండలతో కోస్తాంధ్ర కుతకుతలాడుతోంది. వాతావరణంలో తేమ శాతం గణనీయంగా తగ్గడం వల్ల 18వ తేదీ వరకు ఇలాగే కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు. శనివారం విజయనగరం జిల్లా బొండాపల్లెల మండలంలో అత్యధికంగా 46.20 డిగ్రీల సెల్సియస్,  విశాఖ జిల్లా దేవరాపల్లె మండలంలో 46 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ప్రకాశం జిల్లా టంగుటూరులో 45.79, విజయనగరం జిల్లా పెదమోరంగిలో 45.37, విశాఖ జిల్లా భలిగట్టంలో 45.08, గాదిరాయిలో 45.02 డిగ్రీలు, పశ్చిమ గోదావరి జిల్లా పొదురులో 45.31, చిన్నాయగూడెంలో 45.18, చిట్యాలలో 45.07 డిగ్రీలు, తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలంలో  45.30, రాజోలు మండలం శివకోడులో 45.17 డిగ్రీలు, బాపట్లలో 45.12 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు 19న నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకే అవకాశం ఉందని అవేర్‌ వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. వీటి ప్రభావం వల్ల  ఈ నెల 19 నుంచి 24 వరకూ రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు పడొచ్చని అంటున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top