రాయలసీమకు చంద్రబాబు ప్రభుత్వం ద్రోహం చేస్తోంది
కరువుబండ పాదయాత్రకు 40 ఏళ్లు పూర్తి
ఈ సందర్భంగా నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో వక్తలు
రాయలసీమ ఎత్తిపోతల సాధన సమితి ఏర్పాటు
తిరుపతి సిటీ: ‘రాయలసీమ భవిష్యత్తు ప్రమాదంలో పడనుంది. మౌనంవీడి రండి. పిడికిలి బిగించి పోరాడదాం’ అని అఖిలపక్ష నేతలు పిలుపునిచ్చారు. రాయలసీమ ఎత్తిపోతల సాధన సమితి ఏర్పాటు చేశారు. రాయలసీమ దాహారి తీర్చేందుకు కరువుబండ పేరుతో 1986 జనవరి 1నుంచి 21వరకు జరిగిన పోతిరెడ్డిపాడు పాదయాత్ర పూర్తయి 40 ఏళ్లు అయింది. ఈ సందర్భంగా రాయలసీమ భవిష్యత్తు నీటి అవసరాలపై చర్చించేందుకు వైఎస్సార్‌సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం తిరుపతిలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.
రాయలసీమ అధ్యయనాల సంస్థ చైర్మన్ భూమన సుబ్రమణ్యంరెడ్డి మట్లాడుతూ రాయలసీమ తాగు, సాగునీటి కోసం పోతిరెడ్డిపాడు తూముల సామర్థ్యాన్ని లక్ష క్యూసెక్కులకు పెంచాలనే ప్రధాన ఉద్దేశంతో రాయలసీమలోని అన్ని ప్రాంతాల నుంచి కరువుబండ పేరుతో పాదయాత్ర చేసినట్లు చెప్పారు. 50 కిలోమీటర్ల పాదయాత్ర అనంతరం పోతిరెడ్డిపాడు వద్ద శ్రీశైలం కుడికాలువ హెడ్ రెగ్యులేటర్ వద్ద వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రసంగిస్తూ రాయలసీమకు న్యాయం జరిగేవరకు ఉద్యమం ఆగదని చెప్పారని గుర్తుచేశారు.
చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్నప్పుడు జారీచేసిన చీకటి జీవో 69ని తరువాత సీఎం అయిన వైఎస్ రాజశేఖరరెడ్డి రద్దుచేశారని చెప్పారు. చంద్రబాబు మళ్లీ కుట్ర రాజకీయాలతో అడ్డుకున్నారన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కాగానే రూ.7 వేలకోట్లు కేటాయించి రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు చేపట్టారని తెలిపారు.
కానీ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. చంద్రబాబుతో చర్చించి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయించానని చెప్పారన్నారు. దీనిపై చంద్రబాబు ప్రభుత్వం స్పందించకపోగా ఈ ఎత్తిపోతల పథకం వల్ల ఉపయోగం లేదని మాట్లాడడం రాయలసీమకు ద్రోహం చేసినట్టు కాదా అని ప్రశ్నించారు.
పార్లమెంట్‌లో పోరాడతా
తిరుపతి ఎంపీ ఎం గురుమూర్తి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిజమైన విజనరీలని తెలిపారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం కోసం పార్లమెంట్‌లో పోరాటం చేస్తానని చెప్పారు. ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం మాట్లాడుతూ రాయలసీమకు ఇప్పటివరకు మేలుచేసింది వైఎస్ కుటుంబమేనన్నారు. మాజీ ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ ఉద్యమం చేపట్టి రాయలసీమ హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు.
సీపీఎం నాయకుడు కందారపు మురళి మాట్లాడుతూ రాయలసీమ ఎత్తిపోతల పథకంపై బీజేపీ నోరు విప్పకపోవడం, పవన్‌కళ్యాణ్ స్పందించకపోవడం దారుణమని చెప్పారు. రాయలసీమ తాగు, సాగునీటి హక్కులను పరిరక్షించుకునేందుకు భూమన అభినయ్‌రెడ్డి పలు ప్రతిపాదనలు చేశారు.
రాయలసీమ ఎత్తిపోతల సాధన సమితి ఏర్పాటు చేస్తూ సమావేశం తీర్మానించింది. త్వరలో పోతిరెడ్డిపాడు సందర్శించేందుకు, రాయలసీమ ప్రజలకు ఎత్తిపోతల పథకం అవసరాన్ని తెలిపేలా ప్రణాళిక సిద్ధం చేయాలని సమావేశం నిర్ణయించింది. సీపీఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, సీపీఐ, కాంగ్రెస్, రైతు,ఉద్యోగ ప్రతినిధులు పాల్గొన్నారు.


