త్వరలో పోర్టు పనులు | Soon the port works | Sakshi
Sakshi News home page

త్వరలో పోర్టు పనులు

Jul 20 2014 1:19 AM | Updated on Aug 24 2018 2:36 PM

త్వరలో పోర్టు పనులు - Sakshi

త్వరలో పోర్టు పనులు

బందరుపోర్టు పనులు కొద్దిరోజుల్లోనే ప్రారంభిస్తామని రాష్ట్ర ఎక్సైజ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు.

  • గుంటూరు-విజయవాడ మధ్యే రాజధాని
  •  రాష్ట్రమంతటా అభివృద్ధి చేస్తాం
  •  పదేళ్లలో ఏపీని నంబర్ వన్ స్టేట్‌గా మారుస్తాం
  •  మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడి
  • సాక్షి, విజయవాడ : బందరుపోర్టు పనులు కొద్దిరోజుల్లోనే ప్రారంభిస్తామని రాష్ట్ర ఎక్సైజ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. భూసేకరణ సమస్యే కాదని, అక్కడి ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారని, అందరూ భూములు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. దీనిపై జిల్లా కలెక్టర్ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక పంపారని, కొద్దిరోజుల్లోనే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని వివరించారు. విజయవాడలోని స్టేట్ గెస్ట్‌హౌస్‌లో శనివారం మంత్రి విలేకరులతో మాట్లాడారు. గుంటూరు-విజయవాడ మధ్య రాజధాని ఏర్పాటుకు అంతా అనుకూలంగా ఉందని చెప్పారు. ఇక్కడ రాజధాని ఏర్పాటయ్యే అవకాశం ఉందని వివరించారు.
     
    బందరులో ఆయిల్ రిఫైనరీ పరిశ్రమ
     
    వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని మంత్రి చెప్పారు. రానున్న రోజుల్లో అంధ్రప్రదేశ్‌ను దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. బందరుకు ఆయిల్ రిఫైనరీ పరిశ్రమ, పోర్టుల్లో వినియోగించే కంటెయినర్లు తయారు చేసే క్రాకర్స్ పరిశ్రమ వస్తాయని తెలిపారు. జిల్లాలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తారని వివరించారు.

    రాష్ట్ర అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహకరిస్తామని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు హామీ ఇచ్చారని చెప్పారు. దేశానికి తూర్పు తీర ప్రాంతమైన వైజాగ్-చెన్నై మధ్య ఉన్న కారిడార్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయటమే తమ లక్ష్యమని, దీనికి అనుసంధానంగా రోడ్డు, రవాణా మార్గాలను కూడా అభివృద్ధి పరుస్తామన్నారు. నర్సాపురం నుంచి మచిలీపట్నం మీదుగా రేపల్లె వరకు రైలుమార్గం ఏర్పాటైతే మరింత అభివృద్ధి సాధించవచ్చన్నారు.
     
    1,400 కేసులు 1200 మంది అరెస్ట్
     
    రాష్ట్రవ్యాప్తంగా 29 టాస్క్‌ఫోర్స్ బృందాలు బెల్ట్‌షాపులపై విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నాయని మంత్రి చెప్పారు. బెల్ట్‌షాపులను నియంత్రిచటానికి కసరత్తు చేస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,400 కేసులు నమోదు చేసి 1,200 మందిని అరెస్ట్ చేశామని వివరించారు. రానున్న రోజుల్లో బెల్ట్‌షాపుల నిర్వాహకులపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

    వైన్ షాపులు, బార్లు కచ్చితంగా నిర్ణీత సమయంలోనే విక్రయాలు సాగించాలని, లేకపోతే చర్యలు తప్పవన్నారు. రాష్ట్రంలో 500 మద్యం షాపులు ఖాళీగా ఉన్నాయని, మూడో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశామని చెప్పారు. అనంతరం ఖాళీగా ఉన్న షాపులను ప్రభుత్వమే నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తామని ఆయన తెలిపారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement