ప్రేమించనని చెప్పిన పాపానికి ఓ అమ్మాయికి అసభ్య ఎస్ఎంఎస్లు పెడుతూ, వేధింపు కాల్స్ చేస్తున్న ఓ సైనికుడిని పోలీసులు అరెస్టుచేశారు.
ప్రేమించనని చెప్పిన పాపానికి ఓ అమ్మాయికి అసభ్య ఎస్ఎంఎస్లు పెడుతూ, వేధింపు కాల్స్ చేస్తున్న ఓ సైనికుడిని పోలీసులు అరెస్టుచేశారు. విశాఖపట్నంలోని గాజువాక ప్రాంతానికి చెందిన మైలపల్లి వినోద్కుమార్ (21) కొన్నేళ్ల క్రితం భారతసైన్యంలో చేరాడు. తమిళనాడులోని ఊటీ సమీపంలో గల వెల్లింగ్టన్లో అతడికి పోస్టింగ్ లభించింది. ఇటీవల సెలవులు గడిపేందుకు అతడు విశాఖపట్నం వచ్చాడు. పెందుర్తి ప్రాంతంలోని ఓ అమ్మాయిని అతడు ప్రేమిస్తున్నట్లు చెప్పగా, ఆమె నిరాకరించింది. అప్పటినుంచి అతడు తమిళనాడులో కొన్న మూడు సిమ్ కార్డులు ఉపయోగించి అసభ్య ఎస్ఎంఎస్లు పంపడం మొదలుపెట్టాడు. దీంతోపాటు పదేపదే వేధిస్తూ ఫోన్లు కూడా చేసేవాడు.
అర్ధరాత్రి, అపరాత్రి అని కూడా లేకుండా ఇలా పదే పదే విసిగిస్తుండటంతో ఆమె పెందుర్తి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ కేసును సిటీ సైబర్ క్రైం ఇన్వెస్టిగేషన్ సెల్కు పంపారు. నిందితుడి ఫోన్ ఐఎంఈఐ నెంబర్లు, సిమ్ కార్డుల గుర్తింపు కార్డుల ఆధారంగా కేసును దర్యాప్తుచేసిన పోలీసులు.. వినోద్ కుమార్ను సోమవారం అరెస్టు చేశారు. నిందితుడి నుంచి ఒక మొబైల్ ఫోన్, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆర్మీ వర్గాలకు తెలియజేసి తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతామని అదనపు డీసీపీ మహమూద్ ఖాన్ తెలిపారు.