
నగరవనంలో హద్దు మీరుతున్న ప్రేమ జంట
పేరేచర్ల(గుంటూరు): పేరేచర్ల ప్రధాన రహదారి పక్కనే 531 ఎకరాల్లో ప్రకృతి రమణీయతను ఆకళింపు చేసుకుని ఉంది నగరవనం. ఇక్కడ ఎత్తైన కొండలు, చెట్లు, వన్యప్రాణులు, ఔషధ మొక్కలు ప్రకృతి ప్రేమికులను ఇట్టే కట్టిపడేస్తాయి. పర్యాటకులను ఆకర్షించడంతో పాటు ప్రజలు తమ కుటుంబ సభ్యులతో సేదదీరేందుకు ప్రభుత్వం నగరవనాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు 2017 నవంబర్ 4న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నగరవనానికి శంకుస్థాపన చేశారు. ఔషధ మొక్కల పెంపకం, పిల్లల పార్కు, సైక్లింగ్, ట్రెక్కింగ్, జంతుప్రదర్శనశాల తదితరాల ఏర్పాటుకు రూ.5 కోట్లు నిధులు కేటాయిస్తున్నామని ప్రకటించారు. నగరవనం అందుబాటులోకి వచ్చి ఆహ్లాదం చేరువవుతుందని ప్రజలు ఆశపడ్డారు. కానీ నేటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. దీంతో ఈ ప్రాంతం అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారింది.
కొరవడిన నిఘా..
నగరవనంలో నిఘా వ్యవస్థ పూర్తిగా నిద్రావస్థలోకి జారుకుంది. దీనికి తోడు వనంలో ఒక్కచోట కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. ఈ ప్రాంతంలో పర్యవేక్షణ కొరవడడంతో వివిధ ప్రాంతాల నుంచి ఆకతాయితీలు ప్రకృతి రమణీయతలో వికృతి చేష్టలకు పాల్పడుతున్నారు. దీంతో కుటుంబాలతో నగరవన వీక్షణకు వెళ్లేవారు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఇక అటవీశాఖకు చెందిన అధికారులు ఎప్పుడో ఒకసారి చుట్టం చూపుగా కనిపిస్తారు లేకపోతే అదీ కూడా లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. వనంలో కనీసం ఒక్క సెక్యూరిటీ గార్డు కూడా లేకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి.
బోర్డుకే పరిమితమైన పిల్లల పార్కు..
నగరవనంలోకి అడుగుపెట్టగానే కొద్ది దూరంలో పిల్లల పార్కు అని కనబడుతుంది తప్ప పార్కు కనిపించదు. పిల్లల కోసం ఇంత దూరం వస్తే ఇక్కడ పరిస్థితి వేరేలా ఉందని పర్యాటకులు వాపోతున్నారు. కనీసం పిల్లలు ఆడుకునేందుకు ఆట వస్తువులు, వారు ఆసక్తిగా తిలకించేందుకు బొమ్మలు లాంటివి కూడా ఏర్పాటు చేయలేదు. నగరవనానికి సమీపంలోనే కొన్ని క్రషర్లు, కంపెనీలు ఉండడంతో వాటి నుంచి వచ్చే పొగ వనాన్ని కమ్మేస్తోంది. దీంతో పర్యాటకులు కొంతమేర ఇబ్బంది పడుతున్నారు. నగరవనానికి చుట్టుపక్కల ఉన్న క్రషర్లు, కంపెనీలను వేరే చోటకి మారుస్తానని అప్పుడు అధికారులు, మంత్రులు చెప్పారు కానీ ఆచరణలో పాటించలేదు.
పిల్లలను అతిగారాబం చేయకూడదు
తల్లిదండ్రులు తమ పిల్లలను అతి గారాబం చేయకూడదు. కొంతవారి పట్ల కఠినంగానే వ్యవహరించాలి. పిల్లల కదలికలపై నిఘా ఉంచాలి. ముఖ్యంగా సంస్కృతీ, సంప్రదాయాలు పట్ల కాసేపు వారితో ప్రేమగా మాట్లాడాలి. తల్లిదండ్రులు ప్రమేయం లేకుండా తీసుకొనే కొన్ని నిర్ణయాల వలన జరిగే సంఘటనలు వారికి ఉదాహరణగా తెలియపరచాలి. అంతేకాకుండా నగరవనంలో ప్రత్యేకమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేయాలి. – కాసు విజయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు
ప్రభుత్వ పనితీరు లోపం కనిపిస్తుంది
ఇలాంటి వనాల్లో ప్రభుత్వ పనితీరు లోపం కనిపిస్తుంది. రూ.5 కోట్లు మంజూరు చేసి దానిని గుత్తేదార్లుకు అప్పగించి ప్రభుత్వం చేతులు దులుపుకొంటుంది. దీని వలన అక్కడ సరైన వసతులు లేకుండా పోతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో నగరవానికి కుటుంబ సభ్యులతో రాలేని దుస్థితి. అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేయాలి. వనంలో నిఘానేత్రాలు ఏర్పాటు చేయాలి. – రమాదేవి, ఐద్వా నాయకురాలు