‘హెరిటేజ్‌’ కోసమే బైపాస్‌! | Six rows of bypass road behind the Heritage | Sakshi
Sakshi News home page

‘హెరిటేజ్‌’ కోసమే బైపాస్‌!

Jun 2 2018 4:01 AM | Updated on Jun 2 2018 8:52 PM

Six rows of bypass road behind the Heritage - Sakshi

సాక్షి ప్రతినిధి, తిరుపతి: చిత్తూరు జిల్లాలో నేషనల్‌ హైవే అథారిటీ(ఎన్‌హెచ్‌ఏఐ) చేపట్టిన తిరుపతి–చిత్తూరు రహదారి విస్తరణ పనులు వివాదాస్పదంగా మారాయి. ఈ మార్గంలో ఉన్న హెరిటేజ్‌ డెయిరీ భూములను భూసేకరణ నుంచి తప్పించేందుకు తమ భూములకు ఎసరు పెడుతున్నారని రైతులు మండి పడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మెప్పు కోసం తమను బలి చేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాగు భూములు కోల్పోతే ఇక ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. హెరిటేజ్‌కు మేలు చేసేందుకు రోడ్డు అలైన్‌మెంట్‌ మార్చేశారని, ఆ సంస్థ భూములను కాపాడడంతో పాటు వాటి విలువను భారీగా పెంచేందుకు అధికారులు సిద్ధమయ్యారని విమర్శిస్తున్నారు. 

అసలేం జరిగింది? 
నాయుడుపేట నుంచి చిత్తూరు వరకూ ఉన్న రెండు వరుసల రహదారిని(ఎన్‌హెచ్‌–140) ఆరు లేన్ల రోడ్డుగా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి ప్యాకేజీలో చిత్తూరు–తిరుపతి మధ్యనున్న 61 కిలోమీటర్లు, రెండో ప్యాకేజీలో తిరుపతి–నాయుడుపేట మధ్యనున్న 55 కిలోమీటర్ల రోడ్డు పనులు పూర్తి చేయాలని నిర్ణయానికొచ్చింది. ఒక్కో ప్యాకేజీకి రూ.1,200 కోట్లు కేటాయించింది. భూసేకరణ, పరిహారం చెల్లింపుల కోసం మరో రూ.300 కోట్లు కేటాయించింది. మొదటి ప్యాకేజీలో రెండు చోట్ల బైపాస్‌లు నిర్మించాలని ప్రతిపాదించారు. ముంగిలిపట్టు నుంచి పనబాకం వరకూ (7.5 కిలోమీటర్లు) ప్రతిపాదించిన బైపాస్‌ రోడ్డు విషయంలో అధికారులు భిన్నమైన నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్‌ డెయిరీ భూములకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు పడ్డారు. డెయిరీ ఆ భూముల విలువ రెట్టింపయ్యేలా అలైన్‌మెంట్‌ను సిద్ధం చేశారు. 


హెరిటేజ్‌కు రెండు వైపులా రోడ్లే 
ప్రస్తుతం హెరిటేజ్‌ డెయిరీ ప్రధాన గేటుకు ముందుగా తిరుపతి–చిత్తూరు రెండు వరుసల రహదారి వెళ్తోంది. ఈ ప్రాంతంలో (కాశిపెంట్ల) రోడ్డును ఆరు వరుసలుగా విస్తరించాలంటే కుడి వైపున రైల్వే లైన్, ఎడమ వైపున హెరిటేజ్‌ డెయిరీ సరిహద్దులు ఉన్నాయి. రైల్వే లైన్‌ వైపు విస్తరణకు అవకాశం లేదు కాబట్టి ఎడమ వైపునే ఎక్కువ భూమిని సేకరించాలి. అదే జరిగితే హెరిటేజ్‌ స్థలం చాలావరకు భూసేకరణ కింద పోవడం ఖాయం. దీంతో అధికారులు ఇక్కడ బైపాస్‌ అవసరమని ప్రతిపాదనలు రూపొందించారు. మొత్తం ఏడున్నర కిలోమీటర్ల పొడవు, 60 మీటర్ల వెడల్పుతో బైపాస్‌ రోడ్డు పనులు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఉన్న తిరుపతి–చిత్తూరు రెండు వరుసల రహదారి నుంచి ముంగిలిపట్టు దగ్గర చీలే బైపాస్‌ రోడ్డు హెరిటేజ్‌ డెయిరీ వెనుకగా వెళ్లి పనబాకం రైల్వేస్టేషన్‌కు ముందు మళ్లీ పాత రోడ్డులో కలుస్తుంది. ఈ బైపాస్‌ నిర్మాణం పూర్తయితే హెరిటేజ్‌ డెయిరీకి ముందు రెండు వరసలు, వెనుక ఆరు వరసల రహదార్లు ఉంటాయి.

36 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న హెరిటేజ్‌ భూముల ధర భారీగా పెరుగుతుంది. ముఖ్యమంత్రి మెప్పు పొందడానికే అధికారులు బైపాస్‌ను తెరపైకి తెచ్చారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ బైపాస్‌ నిర్మాణానికి 300 ఎకరాలు సేకరించాల్సి ఉంటుంది. దీనివల్ల 60 మందికి పైగా రైతులు తమ సాగు భూములను కోల్పోనున్నారు. ఏడాదికి మూడు పంటలు పండే భూములను పోగొట్టుకుని ఎలా బతకాలని బాధిత రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.  బైపాస్‌ నిర్మాణానికి భూములిచ్చేందుకు విముఖత వ్యక్తం చేస్తున్న రైతులు న్యాయం కోసం ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు యథాతథ స్థితి(స్టేటస్‌ కో) ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో కొన్నాళ్లపాటు భూముల సర్వే నిలచిపోయింది. అయితే, వారం రోజులుగా చంద్రగిరి, పాకాల మండలాల రెవెన్యూ అధికారులు బైపాస్‌ రోడ్డు పనుల కోసం రైతుల భూములను సర్వే చేస్తున్నారు. కోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ సర్వే చేయడం ఏమిటని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ కోర్టును ఆశ్రయించేందుకు సమాయత్తమవుతున్నారు. 

ప్రత్యామ్నాయం ‘బోనిత్తుల రోడ్డే..
బైపాస్‌ నిర్మాణం అనివార్యమని అధికారులు చెబుతుండగా, ఎప్పటి నుంచో వాడకలో ఉన్న బోనిత్తుల రోడ్డు ఇందుకు ఉపయోగించుకోవచ్చని రైతులు అంటున్నారు. ఈ రోడ్డుకు ఇరువైపులా ప్రభుత్వ భూములే ఉన్నాయని, దీన్ని ఆరు లేన్లుగా విస్తరిస్తే ఎవరికీ నష్టం వాటిల్లదని పేర్కొంటున్నారు. 

పొలం, ఇల్లు పోతున్నాయి 
‘‘నేను రిటైర్డ్‌ ఉద్యోగిని. ఉన్న కొద్దిపాటి పొలాన్ని సాగు చేసుకుంటూ సొంతింట్లో ఉంటున్నా. బైపాస్‌ కోసం భూసేకరణలో నా పొలం, ఇల్లు పోతున్నాయి. ఏం చేయాలో దిక్కు తోచడం లేదు. పనబాకంలో 30కి పైగా ఇళ్లు పోయే ప్రమాదం ఉంది’’ 
– డాక్టర్‌ జె.బాపూజీ, పనబాకం గ్రామం

పొలమంతా పోతుంది
‘‘బైపాస్‌ రోడ్డు నిర్మాణం కోసం భూసేకరణ జరిపితే నాకున్న 2.50 ఎకరాల వ్యవసాయ భూమి మొత్తం పోతుంది. ఆ భూమే నాకు జీవనాధారం. అది లేకుండా పోతే ఎలా బతకాలో తెలియడం లేదు. పెద్దలు భూములను కాపాడడానికి మాలాంటి పేదల భూములు లాక్కోవడం అన్యాయం’’ 
– ఎస్‌.జనార్దన్, రైతు, కొత్తిఇండ్లు గ్రామం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement