కనుల పండువగా తొలేళ్ల ఉత్సవం

Sirimanothsavam Tribal Fest From Today in Srikakulam - Sakshi

అమ్మవారిని దర్శించుకున్న భక్తులు

మధ్యాహ్నం రెండున్నర, మూడు గంటల మధ్యలో సిరిమాను ప్రారంభం

మూడు లక్షలకు పైగా భక్తులు వస్తారని అంచనా

సీసీ కెమెరాలు... డ్రోన్‌కెమెరాలతో నిఘా

మక్కువ(సాలూరు): ఉత్తరాంధ్ర ఇలవేల్పు, ఆరాధ్యదైవం శంబర పోలమాంబ తోలేళ్ల ఉత్సవం సోమవారం సంప్రదాయ బద్ధంగా జరిగింది. సోమవారం రాత్రి అమ్మవారి ఘటాలకు ఊరేగించిన అనంతరం ప్రధానవీధిలో అమ్మవారి ఘటాలను ఉంచి, కారుగేదె వాలకాలను నిర్వహించారు. మహిషాసుర వేషాధారణ, పోతురాజు వేషధారణ, మేళతాళాల నడుమ కార్యక్రమం జరిగింది. గ్రామానికి చెందిన రైతులు ఉపవాసాలు ఉండి రాత్రి ఏరోత్సవం నిర్వహించారు. గ్రామపెద్దలంతా జన్నివారి ఇంటికి వెళ్లి జన్నివారిని పిలిచి ఏరోత్సవం నిర్వహించారు.  జన్నివారి, గిరిడవారి ఇంటి నుంచి విత్తనాలను తీసుకొని వచ్చి అమ్మవారి ముందుంచి పూజ చేస్తారు. అమ్మవారికి అక్షింతలు చల్లి, రైతులు కాళ్లì మీద(పశువులేర్లుకు పూచిన పూజ) నిలబడి రైతులు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం గిరడవారు తెచ్చిన విత్తనాలను అమ్మవారి వద్ద పూజలు చేసిఅనంతరం రైతులు తలోపిడికెడు తీసుకొని వెళ్లి పంటలు సాగుచేసిన సమయంలో వారి విత్తనాల్లో వీటిని కలుపుతారు.

తోలేళ్లనాడు సాధారణ రద్దీ
అమ్మవారి తోలేళ్ల ఉత్సవానికి భక్తుల తాకిడి సాధరణంగానే ఉంది. చదురుగుడి వెనుక, వనంగుడి వద్ద  భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వీలుగా దేవాదాయ శాఖాధికారులు ఉచితదర్శనం, రూ.10లు, రూ. 50ల క్యూలైన్లను ఏర్పాటు చేశారు. భక్తులు ప్రధానాలయంలో ఉన్న శంబర పోలమాంబను, వనంగుడిలోని అమ్మవారిని దర్శించుకున్నారు. వనంగుడి వెనుకన ఉన్న వేపచెట్టుకు పూజలు చేశారు. కోళ్లు, చీరలు, తలనీలాలు సమర్పించారు.

జాతరలో పోలీసులు పహారా
జాతర సందర్భంగా పోలీసులు పెద్ద ఎత్తున పహరా కాశారు. సీఆర్‌పీఎఫ్, ఎస్టీఎఫ్‌ బలగాలు గ్రామంలోని అన్ని వీధుల్లో పర్యటించారు. ప్రధానాలయం నుంచి, వనంగుడి వరకు అడుగడుగున మోహరించారు. ఓఎస్‌డీ రామ్మోహన్,  ఏఎస్పీ సుమిత్‌ ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకున్నారు. అమ్మవారిని ఓఎస్‌డీ రామ్మోహన్‌ దర్శించుకున్నారు. అనంతరం సిరిమాను తిరిగే ప్రదేశాన్ని పరిశీలించారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 700మంది పోలీసులు, సీఆర్‌పీఎఫ్, ఏపీఎస్పీ, ఎస్టీఎఫ్‌ బలగాలు బందోబస్తు నిర్వహించారు. సబ్‌కలెక్టర్‌ టి.ఎస్‌.చేతన్‌ చదురుగుడి, వనంగుడి ఆలయాల వద్ద క్యూలైన్లను పరిశీలించి, భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. సిరిమాను తిరిగే ప్రదేశాలను పరిశీలించారు.

అయిదుచోట్ల వైద్యశిబిరాలు
శంబర పీహెచ్‌సీ, వైఎస్‌ఆర్‌ విగ్రహం వద్ద, వనంగుడి, గ్రంథాలయం, క్యూలైన్లవద్ద వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు. గోముఖి నది వద్ద కేశఖండనశాలను ఏర్పాటు చేయగా భక్తులు తలనీలాలను సమర్పించి, పక్కనే ఉన్న గోముఖినదిలో స్నానాలు చేసి, వస్త్రమార్పిడి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

సిరిమానోత్సవానికి ఏర్పాట్లు పూర్తి
శంబర పోలమాంబ సిరిమాను సంబరాన్ని లక్షలాది మంది తిలకించేందుకు వీలుగా సబ్‌ కలెక్టర్‌ టి.ఎస్‌.చేతన్, ఓఎస్‌డీ రామ్మోహన్, ఏఎస్పీ సుమిత్, దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్‌ ఎస్‌.వి.ఎస్‌.ఎన్‌.మూర్తి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మంగళవారం మధ్యాహ్నం రెండున్నర, మూడు గంటల మధ్య సిరిమానోత్సవం ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నారు. అందుకు అవసరమైన 30అడుగుల సిరిమానును తయారుచేశారు. సిరిమానును పూజారి జన్ని పేకాపు జగదీ అలియాస్‌ భాస్కరరావు అధిరోహించనున్నారు.

భక్తులకు మెరుగైన సౌకర్యాలు
జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని సబ్‌కలెక్టర్‌ టి.ఎస్‌.చేతన్‌ తెలిపారు. సిరిమాను తిరిగే ప్రదేశాన్ని పరిశీలించిన ఆయన అనంతరం  పంచాయతీరాజ్, ట్రాన్స్‌కో, రెవెన్యూ, దేవాదాయశాఖ అధికారులతో సమీక్షించారు. క్యూలైన్ల వద్ద మంచినీరు, పాలు అందుబాటులో ఉంచాలన్నారు. పారిశుద్ధ్య పనులు నిర్వహించి, చెత్తను వెంటవెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని డీపీవో సత్యనారాయణకు తెలిపారు.

ప్రసాదాలు సిద్ధం
జాతరకు వచ్చే భక్తులకోసం 40వేల పులిహోర పొట్లాలు, 25వేల లడ్డూలను తయారుచేసినట్లు ఈవో ప్రకాశరావు తెలిపారు. దేవాదాయశాఖ కమిషనర్‌ మూర్తి పర్యవేక్షణలో 100 మంది దేవాదాయశాఖ సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. వనంగుడి, రామాలయం, గ్రంథాలయం వద్ద ప్రసాదం కౌంటర్లను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. జాతరకు వచ్చిన భక్తులకు సమాచారం అందించేందుకు చదురుగుడి క్యూలైన్లు, ప్రధానరహదారివద్ద కంట్రోల్‌రూమ్‌లు ఏర్పాటుచేశారు. డీపీవో సత్యనారాయణ, డీఎల్‌పీఓ రాజు పర్యవేక్షణలో పారిశుద్ధ్యపనులు చురుగ్గా సాగుతున్నాయి. 130 మంది పారిశుద్ధ్యకార్మికులు, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌తో పాటు, ఇద్దరు మేస్త్రీలు పర్యవేక్షణలో పారిశుద్ధ్య పనులను ఎప్పటికప్పుడు జరిపిస్తున్నారు.

సిరిమాను అధిరోహించడం పూర్వజన్మ సుకృతం
సిరిమాను అధిరోహించడం పూర్వజన్మ సుకృతమని పూజారి జన్ని పేకాపు జగదీ తెలిపారు. ఈయన తండ్రి త్రినాథ రెండేళ్లక్రితం అనారోగ్యంతో మృతిచెందడంతో, త్రినాథ తమ్ముడు రామారావు గతేడాది సిరిమానును అధిరోహించగా ఈ ఏడాది త్రినాథ కొడుకు జగదీ కొత్తగా సిరిమానును అధిరోహించనున్నారు.

పెద్ద సంఖ్యలో తరలిరానున్న భక్తులు
సిరిమానోత్సవం తిలకించేందుకు ఒడిశా, చత్తిస్‌ఘడ్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల భక్తులతోపాటు విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు నలుమూలల నుంచి సుమారు మూడు లక్షలకు పైబడి భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనావేస్తున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. వారికోసం అయిదుచోట్ల పార్కింగ్‌ స్థలాలను ఏర్పాటు చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచితం, రూ. 50, రూ. 10ల క్యూలైన్లను ఏర్పాటు చేశారు. భక్తులకు తాగునీరు అందించేందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు. జాతరకు వచ్చే వృద్ధులు, దివ్యాంగులు, చిన్నారులు, గర్భిణులకు ప్రత్యేక దర్శనం క్యూలైన్‌ ఏర్పాటుచేశారు. జాతరను రెండు డ్రోన్‌ కెమెరాలు, 25 సీసీ కెమెరాలతో నిఘా చేపడుతున్నామని ఓఎస్‌డీ రామ్మోహన్‌ తెలిపారు.

జాతరకు 130 బస్సులు
జాతరకు వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ అధికారులు చర్యలు చేపడుతున్నారు. మంగళవారం నుంచి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఏడు డిపోల నుంచి 130 ఆర్టీసీ బస్సులు నడుపనున్నట్లు పార్వతీపురం డిపో మేనేజర్‌ డి.జాన్‌సుందరం తెలిపారు.  భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అవసరమైతే అదనపు సర్వీసులను నిర్వహిస్తామన్నారు.

చేరుకోవడం ఇలా...
మక్కువ నుంచి కవిరిపల్లి మీదుగా శంబరకు చేరుకోవాలంటే 6 కిలోమీటర్ల దూరం ఉంటుంది.
సాలూరు నుంచి మక్కువ మీదుగా శంబర చేరుకోవడానికి 25 కిలోమీటర్లు ప్రయాణించాలి.
పార్వతీపురం నుంచి తాళ్లబురిడి మీదుగా శంబర చేరుకునేందుకు 47 కిలోమీటర్లు ప్రయాణించాలి.
పార్వతీపురం నుంచి చినబోగిలి మీదుగా శంబర చేరుకోవడానికి 34 కిలోమీటర్లు ప్రయాణించాలి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top