యూటర్న్‌ తీసుకుని బీజేపీకి ప్రేమ లేఖలు పంపుతున్నారు

Sidiri Appalaraju Says Chandrababu Is Sending Love Letters To BJP - Sakshi

సాక్షి, తాడేపల్లి: టీడీపీతో పొత్తు ఉండబోదని బీజేపీ వాళ్లు బహిరంగంగా చెబుతున్నా.. సిగ్గులేకుండా చంద్రబాబు బీజేపీతో పొత్తుపై యూటర్న్‌ తీసుకొని .. మళ్లీ బీజేపీకి ప్రేమ లేఖలు పంపుతున్నారని పలాస ఎమ్మెల్యే డాక్టర్ సీదిరి అప్పలరాజు ఘాటుగా విమర్శించారు. గురువారం ఆయన తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీని ఏమైనా బీజేపీలో విలీనం చేయాలని భావిస్తున్నారా? అని ప్రశ్నించారు. బతికుండగానే కోడెలను వేధించిన చంద్రబాబు చనిపోయిన తరువాత పోలిట్‌బ్యూరోలో సంతాపాలు తెలుపడం ఏమి బాగోలేదన్నారు. టీడీపీ జన్మభూమి కమిటీలు దోచుకున్న దోపిడి, చంద్రబాబు అవినీతిపై టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యులు ప్రశ్నించాలన్నారు. అదేవిధంగా మంగళగిరిలో లోకేష్ ఓటమి, కోడెల అరాచకాలపై పోలిట్‌బ్యూరో సమావేశంలో చర్చించాలన్నారు. 

చంద్రబాబు రెండున్నర లక్షల అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని పలాస ఎమ్మెల్యే  మండిపడ్డారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో 45 వేల కోట్లు బిల్లులు పెండింగ్‌లో పెట్టారని, అధికారంలో ఉండి గ్రాఫిక్స్ చూపించారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేసిన తప్పిదాల వల్లే కరెంట్ కోతలు వచ్చాయనీ.. అయితే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సకాలంలో స్పందించి కరెంట్ కోతలను తగ్గించారన్నారు. చంద్రబాబు చేసిన అవినీతి ఎక్కడ బయట పడుతుందోనని విద్యుత్‌ పీపీఏలను వ్యతిరేకిస్తున్నారని అన్నారు. చంద్రబాబు గురించి గొప్పగా రాస్తేనే పత్రికా స్వేచ్ఛ ఉన్నట్టా? వ్యతిరేకంగా వార్తలు రాస్తే పత్రికా స్వేచ్ఛ లేనట్టా? అని సందేహం వ్యక్తం పరిచారు. చంద్రబాబు పాలనలో ఏనాడైనా లక్ష 34 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశారా? అంటూ హేళన చేశారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 80 శాతం అమలు చేసి దేశానికి ఏపీ సీఎం జగన్‌ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top