ఇతర జిల్లాలతో పోలిస్తే పనులను పూర్తి చేయడంలో వెనుకబడ్డారంటూ జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారులపై కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పంచాయతీరాజ్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం
కర్నూలు(జిల్లా పరిషత్): ఇతర జిల్లాలతో పోలిస్తే పనులను పూర్తి చేయడంలో వెనుకబడ్డారంటూ జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారులపై కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ అతిథిగృహంలో పంచాయతీరాజ్ శాఖ అధికారులతో వివిధ పనులపై ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా పంచాయతీ.. స్త్రీ.. మండల సమాఖ్య భవనాల నిర్మాణంలో లక్ష్యాన్ని సాధించలేకపోయారన్నారు.
వారం రోజుల్లో మరోసారి పురోగతిని పరిశీలిస్తానని.. మార్చు రాకపోతే చర్యలు తప్పవన్నారు. మంజూరైన నిధులు, వ్యయం వివరాలపై మండలాల వారీగా నివేదిక అందజేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ ప్రజలు అధికంగా నివసిస్తున్న ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రూ.5 లక్షల్లోపు పనులను ఉపాధి హామీ కింద చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం సంబంధిత ఉన్నతాధికారుల అనుమతి పొందాలన్నారు.
పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఆయా మండలాల్లో గ్రామాల వారీగా పనులను గుర్తించి ఆయా మండల అభివృద్ధి అధికారుల సహకారంతో పనులు పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో సర్పంచ్‌లతో తీర్మానాలు చేయించి సీసీ రోడ్డు వేయించాలన్నారు. సాధించిన ఫలితాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. సమావేశంలో పంచాయతీరాజ్ ఎస్‌ఈ పీఆర్ సురేంద్రనాథ్, డ్వామా పీడీ పుల్లారెడ్డి, పీఆర్ ఈఈలు, డిప్యూటీ ఈఈలు, ఏఈలు పాల్గొన్నారు.