ఐపీఎస్‌ల బదిలీకి రంగం సిద్ధం

Sets the stage for the transfer of IPS - Sakshi

20 మంది ఐపీఎస్‌ల బదిలీలకు కసరత్తు

ఎన్నికల ఏడాది కావడంతో కావాల్సిన వారి కోసం నేతల పైరవీలు

మాటవిననివారిని సాగనంపేందుకు ఒత్తిళ్లు

సాక్షి, అమరావతి: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పలు జిల్లాల ఎస్పీలు, పలు శాఖల్లోని ఐపీఎస్‌ అధికారుల బదిలీకి రంగం సిద్ధమైంది. తమకు అనుకూలంగా ఉండేలా జిల్లా ఎస్పీలను నియమించుకునే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. రాష్ట్రంలో దాదాపు 20 మంది ఐపీఎస్‌ అధికారులను మార్చే అవకాశం ఉందని సమాచారం. చంద్రబాబు అధికారం చేపట్టాక 2014, జూలైలో ఒకేసారి 24 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేశారు. అనంతరం 2017, మార్చిలో ఆరు జిల్లాల ఎస్పీలను; 2017, జూలైలో 18 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేశారు.  గత నెలలో అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం పలు జిల్లాల ఎస్పీలను బదిలీ చేస్తామంటూ అప్పట్లో సీఎం చంద్రబాబు టీడీపీ ముఖ్యనేతలకు సంకేతాలు ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. అనంతరం ఐపీఎస్‌ల బదిలీ ప్రతిపాదనలపై చర్చించేందుకు హోంశాఖ కీలక అధికారులు, డీజీపీ పలుమార్లు ప్రయత్నాలు చేసినప్పటికీ సీఎం దాటవేత ధోరణి అవలంబించినట్టు తెలిసింది. 

అనుకూలురైన అధికారుల కోసమే..
తమకు అనుకూలంగా ఉండే అధికారులను గుర్తించి అందుకు అనుగుణంగా బదిలీలు చేపట్టేందుకే సీఎం కాలయాపన చేస్తున్నారని ఒక ఐపీఎస్‌ అధికారి చెప్పారు. ఇప్పటికే తమ మాట వినని అధికారులను సాగనంపి అనుకూలంగా ఉండేవారి కోసం మంత్రులు, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సీఎంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. పలువురు ఎస్పీలపై ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సీఎంకు ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో తమకు బదిలీ తప్పదని తెలిసిన పలు జిల్లాల ఎస్పీలు కార్యాలయంలో ఉండకపోవడం, ఫైళ్లను పరిష్కరించకపోవడం, రోజువారీ సమీక్షలు నిర్వహించకపోవడం చేస్తున్నారు. బదిలీ కోసం రోజులు లెక్కపెడుతూ జిల్లాలో ఏదో ఒక ప్రాంతానికి వెళ్లి అక్కడి పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి కాలక్షేపం చేస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు డైరెక్ట్‌ ఐపీఎస్‌ అయితే తమ మాట చెల్లదని భావిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు.. పదోన్నతి (కన్ఫర్డ్‌) ఐపీఎస్‌లను తెచ్చుకుంటే చెప్పినట్టు వింటారనే నిర్ణయానికి వచ్చినట్టు పోలీసు శాఖలోనే చర్చ సాగుతోంది. రాష్ట్రంలో ఫోకల్‌ పోస్టు (అధిక ఆదాయం వచ్చే జిల్లా) పేరుతో పోస్టింగ్‌ ఇప్పించేందుకు కూడా కొందరు టీడీపీ నేతలు రూ.లక్షలు డిమాండ్‌ చేస్తున్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

సీఎంతో డీజీపీ భేటీ
ఐపీఎస్‌ల బదిలీలపై ఊహాగానాలు రేగుతున్న తరుణంలో డీజీపీ ఆర్పీ ఠాకూర్, ఇంటెలిజెన్స్‌ ఏడీజీ ఏబీ వెంకటేశ్వరరావులు సీఎం చంద్రబాబుతో శుక్రవారం భేటీ కావడం చర్చనీయాంశమైంది. ఉదయం 10 గంటలకు మొదలైన వీరి సమావేశం ఐదుగంటల పాటు సాగినప్పటికీ ఐపీఎస్‌ల బదిలీలపై స్పష్టత రాలేదని అంటున్నారు. ప్రధానంగా పలువురు ఎస్పీల బదిలీలపై డీజీపీ ఠాకూర్‌ చేసిన ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించకలేదని విశ్వసనీయ సమాచారం. దీంతోపాటు ప్రధానంగా రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలపై సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిసింది. ఏవోబీలో మావోయిస్టు అగ్రనేతలు ఆర్కే, చలపతి కదలికలను గుర్తించడంతోపాటు మావోయిస్టులను కట్టడి చేసేందుకు ఇంటెలిజెన్స్‌ విభాగం అప్రమత్తంగా వ్యవహరించాలని సీఎం సూచించినట్టు సమాచారం. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇకపై ప్రతి జిల్లాలోనూ సీఎం పర్యటనలు, సభలు ఉంటాయని, ఆయనకు భద్రతను కట్టుదిట్టం చేయడంతోపాటు, మావోయిస్టుల కదలికలను ఎప్పటికప్పుడు గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చ జరిగింది. తిత్లీ తుపాను సహాయక చర్యల్లో వివాదం నెలకొనడం, బాధితులు ఉద్యమించడం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారిందని, దీనిపై పోలీసు శాఖ సమయస్ఫూర్తితో వ్యవహరించాలని సీఎం సూచించినట్టు తెలిసింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top