
వెలగపూడి నుంచే సేవలు
తాత్కాలిక సచివాలయ భవన నిర్మాణాలు పూర్తయితే ఉద్యోగులు ఇక్కడి నుంచే ప్రజలకు సేవలందిస్తారని రాష్ట్ర ఉప...
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప
తాత్కాలిక సచివాలయానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన
హాజరైన మంత్రులు, ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు
తాడికొండ : తాత్కాలిక సచివాలయ భవన నిర్మాణాలు పూర్తయితే ఉద్యోగులు ఇక్కడి నుంచే ప్రజలకు సేవలందిస్తారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. తుళ్లూరు మండలం వెలగపూడిలో బుధవారం తాత్కాలిక సచివాలయ భవన నిర్మాణాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే అధ్యక్షత వహించారు. చినరాజప్ప మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏడాదిగా విజయవాడ నుంచే పాలన సాగుతోందన్నారు. స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ రేయింబవళ్లు నిర్మాణ పనులు చేయిస్తామని చెప్పారు. ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ రాజధాని రైతులకు అన్ని విధాలా న్యాయం చేకూరుస్తామని వెల్లడించారు. వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ రైతుల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు కృషి చేస్తామని వివరించారు. మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ మాట్లాడుతూ రూ.201 కోట్లతో తాత్కాలిక సచివాలయ భవన నిర్మాణాలు చేపట్టినట్లు చెప్పారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్, ఇంకా పలువురు మంత్రులు, సచివాలయ ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడారు.
2018 నాటికి శాశ్వత భవనాలు నిర్మించాలి : ఏపీఎన్జీవో కార్యదర్శి విద్యా సాగర్
రెండేళ్లలోనే శాశ్వత సచివాలయ భవనాలు పూర్తిచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏపీఎన్జీవో కార్యదర్శి విద్యా సాగర్ కోరారు. జూన్‌లో ఉద్యోగులంతా ఇక్కడకు తరలివస్తారని చెప్పారు. రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఉద్యోగులంతా త్వరగా అమరావతికి రావాలని భావిస్తున్నారన్నారు. సీఆర్‌డీఏ కమిషనర్ ఎన్. శ్రీకాంత్ మాట్లాడుతూ రాజధాని నిర్మాణం అనుకున్న సమయానికి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రిన్సిపల్ కార్యదర్శి అజయ్‌జైన్, జీఏటీ పరిపాలన కార్యదర్శి శశిభూషణ్, ప్రత్యేక సీఎస్ లింగరాజు పాణిగ్రాహి, పౌరసరఫరాల మంత్రి పరిటాల సునీత, దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు, శాసన మండలి చైర్మన్ చక్రపాణి, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, జిల్లాపరిషత్ చైర్‌పర్సన్ షేక్ జానీమూన్, తుళ్లూరు జెడ్పీటీసీ సభ్యుడు బెజవాడ నరేంద్రబాబు, ఎంపీపీ వడ్లమూడి పద్మలత, వెలగపూడి గ్రామ సర్పంచ్ కంచర్ల శాంతకుమారి, మంగళగిరి జెడ్పీటీసీ సభ్యురాలు ఆకుల జయసత్య రైతులు కారుమంచి అప్పయ్య, సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.