అత్తారింట్లో ఎలా ఉండాలో నేర్పాలి

Senior Civil Judge Speech in International Womens Day Chittoor - Sakshi

సీనియర్‌ సివిల్‌ జడ్జి నాగశైలజ

చిత్తూరు అగ్రికల్చర్‌: ఆడపిల్లలు అత్తవారింట్లో ఎలా మెలగాలన్న విషయాలను నేర్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని సీనియర్‌ సివిల్‌ జడ్జి నాగశైలజ తెలిపారు. స్థానిక డీఆర్‌డీఏ కార్యాలయ సమావేశ భవనంలో ఆదివారం ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలతో సమావేశం నిర్వహించారు. ఇందులో జడ్జి నాగశైలజ, కలెక్టర్‌ సతీమణి కావ్యశ్రీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జడ్జి మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాలు, నైతిక విలువలను పిల్లలకు నేర్పించడంలో తల్లి ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండడం వల్ల పిల్లలకు అన్ని విషయాలను పెద్దలు నేర్పించేవారన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేనందున తల్లిదండ్రులే ఆ బాధ్యతను తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఆడపిల్లలు, అత్త, మామలతో మెలగాల్సిన తీరును వివరించాలని సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రతి మహిళకు ఉచిత న్యాయ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.

మహిళల చట్టాలపై ప్రతి మహిళా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కలెక్టర్‌ సతీమణి కావ్యశ్రీ మాట్లాడుతూ స్త్రీగా జన్మించడం అదృష్టమని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే సాధించలేనిది ఏదీ లేదని మహిళలు ఇప్పుడు నిరూపిస్తున్నారని చెప్పారు. గతంతో పోలిస్తే నేడు మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారని తెలిపారు. జేసీ–2 చంద్రమౌళి, డీఆర్‌డీకే పీడీ మురళి మాట్లాడుతూ మహిళలు డ్వాక్రా సంఘాల ద్వారా బ్యాంకు రుణాలు పొంది ఆర్థికాభివృద్ధిని సాధిస్తున్నారని తెలిపారు.  ఐసీడీఎస్‌ పీడీ ఉషాఫణికర్‌ మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం వారు పోషణ్‌ అభియాన్‌ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో నాబార్డ్‌ ఏజీఎం ప్రశాంత్‌బాబు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ లీలావతి, పట్టుపరిశ్రమశాఖ జేడీ అరుణకుమారి, డీఎస్‌డబ్ల్యూవో రాజేశ్వరి, సప్తగిరి గ్రామీణ బ్యాంకు మేనేజర్‌ మహేశ్‌బాబు, డెప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో రమాదేవి, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు రమా పాల్గొన్నారు.

మహిళా సంరక్షణ కార్యదర్శులకు డీజీపీ శుభాకాంక్షలు
తిరుమల : మహిళ సంరక్షణ కార్యదర్శులు, పోలీస్‌ కుటుంబ సభ్యులతో ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం ఈస్ట్‌ పోలీస్‌స్టేషన్‌లో ఈ కాన్ఫరెన్స్‌కు హాజరైన వారితో ఆయన మాట్లాడుతూ, దిశ పోలీస్‌ స్టేషన్‌ గురించి, అక్కడనున్న సదుపాయాలను గురించి తెలుసుకున్నారు. దిశ చట్టంపై ప్రతి ఒక్కరిలో అవగాహన తీసుకురావాలన్నారు.  

మహిళలదే అగ్రస్థానం
తిరుపతి తుడా: అన్ని రంగాల్లో మహిళలే అగ్రస్థానంలో ఉన్నారని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ నారాయణ భరత్‌గుప్తా అన్నారు. తిరుపతి స్విమ్స్‌ ఆడిటోరియంలో సెట్విన్, మహిళా వైద్యకళాశాల సంయుక్తంగా ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్‌ మాట్లా డుతూ అనేక రంగాల్లో మహిళలు ఉన్నతంగా రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగితే ఆ కుటుంబం ఉన్నతంగా అభివృద్ధి చెందేందుకు దోహదపడుతుందన్నారు. తిరుపతిలోని మహిళా వైద్యకళాశాలకు దేశంలోనే గుర్తింపు ఉందన్నారు. వైద్యులుగా ఎదిగే ఏ ఒక్కరూ లింగనిర్ధారణ పరీక్షలను పూర్తిగా వ్యతిరేకించాలన్నారు. ఆడబిడ్డల శాతం తగ్గడానికి ఇది ఒక కారణమన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ ఘనంగా సన్మానించారు. సెట్విన్‌ సీఈవో మురళీకృష్ణతోపాటు వైద్యులు పద్మావతి, వనజ, సుధారణి, మాధవి, రజనీ, ఉమామహేశ్వరీ, డ్వామా పీడీ పద్మలత, అగ్రికల్చరల్‌ ఆఫీసర్‌ లక్ష్మీదేవి, లెక్చరర్‌ హేమలతలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్విమ్స్‌ ఇన్‌చార్జ్‌ డైరెక్టర్‌     డాక్టర్‌ రాం, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ శ్రీధర్‌ పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top