రాష్ట్రంలో సెమీ హైస్పీడ్‌ సబర్బన్‌ రైలు

Semi high speed suburban train in AP - Sakshi

విజయవాడ, గుంటూరు, తెనాలి,అమరావతి మధ్య రవాణా సదుపాయం

ప్రాజెక్టును వేగంగా ముందుకు తీసుకెళ్లాలని ఏఎంఆర్‌సీకి ప్రభుత్వం ఆదేశాలు  

నేలపైనే రైలు మార్గం ఏర్పాటు ద్వారా ఖర్చు తగ్గించాలని నిర్ణయం  

డీపీఆర్‌ రూపకల్పన బాధ్యతలు యూఎంటీసీకి అప్పగింత

సాక్షి, అమరావతి: విజయవాడ, గుంటూరు, తెనాలి, అమరావతి నగరాలను కలుపుతూ సెమీ హైస్పీడ్‌ సబర్బన్‌ రైలు సర్వీసు ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది. గత ప్రభుత్వం హయాంలో హైస్పీడ్‌ సబర్బన్‌ సర్క్యులర్‌ రైలు పేరుతో దీని ఏర్పాటుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ, అంచనాలను ఆకాశానికంటేలా రూపొందించడంతో అడుగు ముందుకు వేయలేకపోయారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు లభించేలా ఆకర్షణీయంగా ఈ రైలు మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. గతంలో ఎలివేటెడ్‌ (పిల్లర్లపై) మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు అప్పటి ప్రభుత్వం ఆసక్తి చూపగా, దానివల్ల ఖర్చు ఎక్కువయ్యే పరిస్థితి ఉండడంతో భూమిపైనే రైలు మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్‌(ఏఎంఆర్‌సీ) అధికారులకు సూచించారు. ఎలివేటెడ్‌ కంటే భూమిపై నిర్మించడం ద్వారా 20 నుంచి 30 శాతం వ్యయం తగ్గే పరిస్థితి ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం దానిపైనే మొగ్గు చూపింది. పైగా ఈ ప్రాజెక్టుకు ఎలివేటెడ్‌ మార్గం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతర్జాతీయంగా ఇలాంటి ప్రాజెక్టులను తక్కువ ఖర్చుతో ఎంతో ఆకర్షణీయంగా రూపొందిస్తున్నారని, ఇక్కడ కూడా అందమైన డిజైన్లు, గ్రీనరీతో పాటు ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు అందేలా సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌) తయారు చేయాలని ఏఎంఆర్‌సీని ముఖ్యమంత్రి ఆదేశించారు.

104 కిలో మీటర్లు 4 నగరాలు
విజయవాడ, నంబూరు, అమరావతి, గుంటూరు, తెనాలి మీదుగా 104 కిలోమీటర్ల మేర సెమీ హైస్పీడ్‌ సబర్బన్‌ రైలు మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. విజయవాడ నుంచి నంబూరు, అటు నుంచి అమరావతి, తిరిగి నంబూరు, అక్కడి నుంచి గుంటూరు, తెనాలి, అటు నుంచి విజయవాడ మీదుగా ఈ రైలు మార్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించిన డీపీఆర్‌ను రూపొందించే బాధ్యతను ఢిల్లీకి చెందిన అర్బన్‌ మాస్‌ ట్రాన్సిట్‌ కంపెనీకు(యూఎంటీసీ) ఏఎంఆర్‌సీ అప్పగించింది. ఇప్పటికే యూఎంటీసీ సాధ్యాసాధ్యాల(ఫీజిబిలిటీ) నివేదికను తయారు చేసింది. ఈ రైలు మార్గం ఏర్పాటుకు అవసరమైన వ్యయం, భూసేకరణ, నిధుల సమీకరణ, డిజైన్లు తదితర అన్ని వివరాలతో నాలుగైదు నెలల్లో సవివర నివేదిక ఇవ్వనుంది. నంబూరు నుంచి అమరావతి వరకూ 18.5 కిలోమీటర్ల మార్గం ఏర్పాటును ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం ప్రకారం రైల్వే శాఖ చేపట్టాల్సి ఉంది. మిగిలిన మార్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం, రైల్వే శాఖ సంయుక్తంగా చేపట్టి, మొత్తం ఖర్చులో 40 శాతాన్ని చెరో సగం భరించనున్నాయి. మిగిలిన 60 శాతం నిధులను ఆర్థిక సంస్థల నుంచి రుణాల రూపంలో సమీకరించేందుకు ప్రణాళిక రూపొందించారు.

గతంలో కాగితాలపైనే ప్రణాళికలు 
విజయవాడ, గుంటూరు, తెనాలి మధ్య అవసరమైన రవాణా సౌకర్యాలు అందుబాటులో లేవు. రాష్ట్ర విభజన తర్వాత ఈ ప్రాంతంలోనే రాజధాని ఏర్పాటు చేయడం, అమరావతికి రాకపోకలు పెరగడంతో ఈ రూట్లకు మరింత ప్రాధాన్యం పెరిగింది. హైస్పీడ్‌ సబర్బన్‌ సర్క్యులర్‌ రైలు ప్రతిపాదన వచ్చినా టీడీపీ ప్రభుత్వం దాన్ని పట్టాలెక్కించేందుకు సరైన ప్రయత్నాలు చేయలేదు. తాజాగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ నాలుగు నగరాలను అనుసంధానిస్తూ సెమీ హైస్పీడ్‌ సబర్బన్‌ రైలు సర్వీసు ఏర్పాటుకు సిద్ధమైంది. గతంలో మాదిరిగా కాగితాలకే పరిమితం చేయకుండా, ఆచరణ సాధ్యమయ్యేలా ప్రణాళికలు ప్రతిపాదనలు తయారు చేయించి, అమల్లోకి తెచ్చేందుకు కృషి చేస్తోంది. సెమీ హైస్పీడ్‌ సబర్బన్‌ రైలు సర్వీసు ఏర్పాటుపై ముఖ్యమంత్రి తమకు స్పష్టమైన సూచనలు చేశారని, వేగంగా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారని, అందుకనుగుణంగా పని చేస్తున్నట్లు అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్‌ ఎండీ రామకృష్ణారెడ్డి చెప్పారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top