breaking news
AMRC officials
-
రాష్ట్రంలో సెమీ హైస్పీడ్ సబర్బన్ రైలు
సాక్షి, అమరావతి: విజయవాడ, గుంటూరు, తెనాలి, అమరావతి నగరాలను కలుపుతూ సెమీ హైస్పీడ్ సబర్బన్ రైలు సర్వీసు ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది. గత ప్రభుత్వం హయాంలో హైస్పీడ్ సబర్బన్ సర్క్యులర్ రైలు పేరుతో దీని ఏర్పాటుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ, అంచనాలను ఆకాశానికంటేలా రూపొందించడంతో అడుగు ముందుకు వేయలేకపోయారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు లభించేలా ఆకర్షణీయంగా ఈ రైలు మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. గతంలో ఎలివేటెడ్ (పిల్లర్లపై) మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు అప్పటి ప్రభుత్వం ఆసక్తి చూపగా, దానివల్ల ఖర్చు ఎక్కువయ్యే పరిస్థితి ఉండడంతో భూమిపైనే రైలు మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్(ఏఎంఆర్‌సీ) అధికారులకు సూచించారు. ఎలివేటెడ్ కంటే భూమిపై నిర్మించడం ద్వారా 20 నుంచి 30 శాతం వ్యయం తగ్గే పరిస్థితి ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం దానిపైనే మొగ్గు చూపింది. పైగా ఈ ప్రాజెక్టుకు ఎలివేటెడ్ మార్గం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతర్జాతీయంగా ఇలాంటి ప్రాజెక్టులను తక్కువ ఖర్చుతో ఎంతో ఆకర్షణీయంగా రూపొందిస్తున్నారని, ఇక్కడ కూడా అందమైన డిజైన్లు, గ్రీనరీతో పాటు ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు అందేలా సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) తయారు చేయాలని ఏఎంఆర్సీని ముఖ్యమంత్రి ఆదేశించారు. 104 కిలో మీటర్లు 4 నగరాలు విజయవాడ, నంబూరు, అమరావతి, గుంటూరు, తెనాలి మీదుగా 104 కిలోమీటర్ల మేర సెమీ హైస్పీడ్ సబర్బన్ రైలు మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. విజయవాడ నుంచి నంబూరు, అటు నుంచి అమరావతి, తిరిగి నంబూరు, అక్కడి నుంచి గుంటూరు, తెనాలి, అటు నుంచి విజయవాడ మీదుగా ఈ రైలు మార్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించిన డీపీఆర్‌ను రూపొందించే బాధ్యతను ఢిల్లీకి చెందిన అర్బన్ మాస్ ట్రాన్సిట్ కంపెనీకు(యూఎంటీసీ) ఏఎంఆర్‌సీ అప్పగించింది. ఇప్పటికే యూఎంటీసీ సాధ్యాసాధ్యాల(ఫీజిబిలిటీ) నివేదికను తయారు చేసింది. ఈ రైలు మార్గం ఏర్పాటుకు అవసరమైన వ్యయం, భూసేకరణ, నిధుల సమీకరణ, డిజైన్లు తదితర అన్ని వివరాలతో నాలుగైదు నెలల్లో సవివర నివేదిక ఇవ్వనుంది. నంబూరు నుంచి అమరావతి వరకూ 18.5 కిలోమీటర్ల మార్గం ఏర్పాటును ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం రైల్వే శాఖ చేపట్టాల్సి ఉంది. మిగిలిన మార్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం, రైల్వే శాఖ సంయుక్తంగా చేపట్టి, మొత్తం ఖర్చులో 40 శాతాన్ని చెరో సగం భరించనున్నాయి. మిగిలిన 60 శాతం నిధులను ఆర్థిక సంస్థల నుంచి రుణాల రూపంలో సమీకరించేందుకు ప్రణాళిక రూపొందించారు. గతంలో కాగితాలపైనే ప్రణాళికలు విజయవాడ, గుంటూరు, తెనాలి మధ్య అవసరమైన రవాణా సౌకర్యాలు అందుబాటులో లేవు. రాష్ట్ర విభజన తర్వాత ఈ ప్రాంతంలోనే రాజధాని ఏర్పాటు చేయడం, అమరావతికి రాకపోకలు పెరగడంతో ఈ రూట్లకు మరింత ప్రాధాన్యం పెరిగింది. హైస్పీడ్ సబర్బన్ సర్క్యులర్ రైలు ప్రతిపాదన వచ్చినా టీడీపీ ప్రభుత్వం దాన్ని పట్టాలెక్కించేందుకు సరైన ప్రయత్నాలు చేయలేదు. తాజాగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ నాలుగు నగరాలను అనుసంధానిస్తూ సెమీ హైస్పీడ్ సబర్బన్ రైలు సర్వీసు ఏర్పాటుకు సిద్ధమైంది. గతంలో మాదిరిగా కాగితాలకే పరిమితం చేయకుండా, ఆచరణ సాధ్యమయ్యేలా ప్రణాళికలు ప్రతిపాదనలు తయారు చేయించి, అమల్లోకి తెచ్చేందుకు కృషి చేస్తోంది. సెమీ హైస్పీడ్ సబర్బన్ రైలు సర్వీసు ఏర్పాటుపై ముఖ్యమంత్రి తమకు స్పష్టమైన సూచనలు చేశారని, వేగంగా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారని, అందుకనుగుణంగా పని చేస్తున్నట్లు అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి చెప్పారు. -
అప్పు పుట్టేనా..
సాక్షి, విజయవాడ : అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్(ఏఎంఆర్‌సీ) ప్రాజెక్టును ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడవేసేందుకుఅధికారులు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. ప్రాజెక్టు ఊపందుకోవాలంటే నిధులు అవసరం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అరకొరగానే నిధులు విడుదల చేస్తుండటంతో ఆర్థిక సంస్థల నుంచి అప్పు కోసం అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా జర్మనీ, ఫ్రాన్స్‌కు చెందిన రెండు ఆర్థిక సంస్థల ప్రతినిధులను విజయవాడ రప్పించి నిధులపై చర్చలు జరుపుతున్నారు. నగరంలో కెఎఫ్‌డబ్ల్యూ బృందం ... జర్మనీకి చెందిన ఐదుగురు సభ్యులున్న కెఎఫ్‌డబ్ల్యూ బ్యాంకు బృందం సోమవారం విజయవాడ వచ్చింది. ఈ బృందంలో కెఎఫ్‌డబ్ల్యూ సౌత్ ఏసియా రీజియన్ హెడ్ డి.స్కామ్బ్రక్స్, రాబర్ట్ వాల్కోవిక్, పి.రోణి, జైలా సోల్చర్, ఉషారావులు ఉన్నారు. ఏఎంఆర్‌సీ ఎండీ రామకృష్ణారెడ్డి వారికి మెట్రో రైలు ప్రాజెక్టు గురించి వివరించడంతోపాటు, నిధుల ఆవశ్యకతపైనా చర్చించారు.తొలిరోజు బందరు రోడ్డు, ఏలూరు రోడ్డులలో కొన్ని ముఖ్యమైన ప్రాంతాలను చూపించారు. విజయవాడ ట్రాఫిక్, పెరుగుతున్న రద్దీ, కొత్త రాష్ట్రానికి రాజధాని నేపథ్యంలో ఇక్కడ మెట్రో రైలు ఆవశ్యకత గురించి వివరించారు. కాగా ఈ బృందం ఇంకా మూడు నాలుగు రోజులు నగరంలో ఉండి పుష్కర ఘాట్లు, అమరావతి మార్గం తదితర ప్రాంతాలను పరిశీలిస్తుందని సమాచారం. నేడు ఫ్రాన్స్ బృందం రాక... ఫ్రాన్స్‌కు చెందిన ఏఎఫ్‌డీ బృందం మంగళవారం నగరానికి రానుంది. ఇందులో ఏఎఫ్‌డీ ట్రాన్స్ డివిజన్ ప్రాజెక్టు మేనేజర్ మాధ్యూవడ్యూర్, ఎస్.బెర్నాడ్ శ్రీనివాసన్, హర్వే దుబ్రిల్, రజనీష్ అహుజాలు ఉంటారని మెట్రో వర్గాలు చెబుతున్నాయి. ఈ బృందం కూడా మూడు రోజులు నగరంలో ఉండి విజయవాడలో మెట్రో ప్రాజెక్టు అవసరాన్ని గురించి అధ్యయనం చేసి ఎంతమేరకు నిధులు ఇస్తారనే అంశాన్ని చర్చిస్తుందని తెలిసింది. ఎక్కడ అప్పు పుడితే అక్కడ.. నిధులు కోసం ఎదురు చూస్తున్న ఏఎంఆర్‌సీ, ఏ సంస్థ ముందుకు వస్తే ఆ సంస్థ ఆసరా తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ప్రాజెక్టుకు సుమారు రూ.3,600 కోట్లు వరకు అవసరం అవుతాయి. అయితే ఈ ప్రాజెక్టు ఎంత మేరకు విజయవంతం అవుతుందోనన్న అనుమానంతో విదేశీ కంపెనీలు ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో ఒకటి కంటే ఎక్కువ కంపెనీల వద్ద రుణం తీసు కోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే కెఎఫ్‌డబ్ల్యూ, ఏఎఫ్‌డీ బృందాలతో అధికారులు విడివిడిగా, ఆ తరువాత కలిపి చర్చలు జరిపేందుకు సిద్ధమయ్యారు. ఈ రెండు కంపెనీలు కలిసి మెట్రో ప్రాజెక్టుకు మొత్తం నిధులు ఇస్తే తీసుకోవాలనే ఆలోచనలో ఏఎంఆర్‌సీ అధికారులు ఉన్నారు.