పత్తికి తెగుళ్ల బెడద | Seemingly pattiki disease | Sakshi
Sakshi News home page

పత్తికి తెగుళ్ల బెడద

Oct 21 2013 12:12 AM | Updated on Sep 1 2017 11:49 PM

పచ్చని మొక్కలుపత్తి పైరుకు తెగుళ్ల బెడద సోకింది. దీంతో మొదటితీత దశలోనే పచ్చని మొక్కలు నిలువునా ఎండిపోతున్నాయి.

=మొదటితీత దశలోనే ప్రారంభం
 =పది రోజుల వ్యవధిలోనే చనిపోతున్న మొక్కలు
 =రైతుల బెంబేలు
 =సర్వే చేస్తున్నామంటున్న అధికారులు
 
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : పత్తి పైరుకు తెగుళ్ల బెడద సోకింది. దీంతో మొదటితీత దశలోనే పచ్చని మొక్కలు నిలువునా ఎండిపోతున్నాయి. ఆఖరి దశలో పత్తి మొక్క ఆకులు రంగుమారే అవకాశం ఉందని, ఈ ఏడాది మొదటితీత దశలోనే వైరస్ (ఎర్ర తెగులు) వ్యాపించి తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ముంచుకొచ్చిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది అదనుకు వర్షాలు పడినా వైరస్ తెగులుతో పాటు పురుగుల బెడద అధికం కావటంతో పత్తి సాగు చేసిన రైతులకు నష్టాలే మిగులుతాయనే భావన వ్యక్తమవుతోంది.

పనిలో పనిగా ప్రభుత్వం కల్పించిన మద్దతు ధరకు పత్తిని కొనుగోలు చేయకుండా తేమ సాకు చూపి దళారులు తమ ఇష్టానుసారం ధర నిర్ణయిస్తున్నారు. వచ్చిన తెగులేమిటో తెలుసుకుని మందులు వాడేలోపే మొక్కలు చనిపోతుండటంతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 1.50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరుగుతుందని ఆశించగా, 1.37 లక్షల ఎకరాల్లోనే సాగు చేపట్టారు.

జిల్లాలోని మైలవరం, గంపలగూడెం, తిరువూరు, రెడ్డిగూడెం, జి.కొండూరు, ఎ.కొండూరు తదితర ప్రాంతాల్లో పత్తి అధికంగా సాగైంది. ప్రారంభదశలోనే పైరుకు తెగుళ్లు సోకటంతో పత్తి రైతులు విలవిల్లాడుతున్నారు. నాణ్యమైన బీటీ విత్తనం సరఫరా కాకపోవటం వల్ల పైరు ప్రారంభ దశలోనే తెగుళ్ల బారిన పడిందని రైతులు చెబుతున్నారు.
 
ఖర్చులు తడిసిమోపెడు...

 విత్తనం ఖర్చు, అరక దున్నటం, పైపాటు, పురుగు మందుల పిచికారీ, కౌలు చెల్లింపు లెక్క వేసుకుంటే ఎకరానికి రూ.30 నుంచి రూ.35వేలు ఖర్చు అవుతుందని రైతులు చెబుతున్నారు. క్వింటాలు పత్తి తీయాలంటే రూ.800 కూలి ఖర్చు అవుతుందని, దీనిని లారీ వద్దకు చేర్చేందుకు ఖర్చులు అదనమని రైతులు అంటున్నారు. సారవంతమైన భూములకు ఎకరానికి రూ.15 వేలు కౌలుగా ముందే చెల్లించామని, ప్రారంభదశలోనే తెగుళ్లు సోకటంతో ఖర్చులైనా వస్తాయో లేదోనని ఆందోళనకు గురవుతున్నారు.

కొన్ని ప్రాంతాల్లో మొదటితీత తరువాత పత్తిపంట పూత, గూడ తొడుగుతున్న దశలో వైరస్ తెగులు సోకి వారం, పదిరోజుల వ్యవధిలోనే ఆకులు నల్ల రంగులోకి మారి మొక్కలు చనిపోతున్నాయని రైతులు చెబుతున్నారు. పత్తికి కనీసంగా ఎనిమిది తీతలు తీస్తామని, మొదటిదశలోనే తెగుళ్లు సోకటంతో దిక్కుతోచటం లేదని వాపోతున్నారు.
 
తేమ శాతం పేరుతో టోకరా...

 గత ఏడాది క్వింటాలు పత్తికి రూ.3,900 మద్దతు ధర ప్రకటించిన ప్రభుత్వం ఈ ఏడాది మొక్కుబడిగా రూ.100 పెంచి రూ.4 వేలు మద్దతు ధరగా నిర్ణయించింది. మరోపక్క వ్యాపారులు తేమశాతం అధికంగా ఉందనే సాకు చూపి రైతులను నిలువునా దోచేస్తున్నారు. వారు క్వింటాలు పత్తికి రూ.2,200 నుంచి రూ.3,200 వరకు మాత్రమే ధర చెల్లిస్తున్నారు. నాణ్యమైన పత్తికి బంగ్లాదేశ్, పాకిస్తాన్, చైనా దేశాల్లో మంచి డిమాండ్ ఉందని, అయినా ప్రభుత్వం ఎగుమతులకు చర్యలు తీసుకోవడం లేదని రైతులు పేర్కొంటున్నారు.
 సర్వే చేస్తున్నాం
 - బాలునాయక్, వ్యవసాయశాఖ జేడీ


 పత్తికి వైరస్ తెగులు వ్యాపించిందనే విషయం మా దృష్టికి వచ్చింది. వ్యవసాయశాఖ అధికారులు, సిబ్బంది బృందాలుగా ఏర్పడి పరిశీలన చేస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లో దీనిపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం. ఎర్రతెగులు పత్తికి రావటం సహజమే అయినా ముందస్తుగా రావటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. వ్యవసాయాధికారుల సూచనలు పాటిస్తే తెగులును అరికట్టే అవకాశముంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement