breaking news
Green plants
-
శభాష్ గాడ్గే మీనాక్షి.. ముఖరా(కె) పచ్చదనం భేష్..
ఇచ్చోడ: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా(కె) గ్రామంలో విస్తృతంగా మొక్కలు నాటి ఎకో ఫ్రెండ్లీగా తీర్చిదిద్దిన తీరు అభినందనీయమని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్ శనివారం ట్వీట్ చేశారు. ఇందుకు కృషి చేసిన సర్పంచ్ గాడ్గే మీనాక్షిని అభినందించారు. అడవులు అంతరించిపోతున్న ఈ సమయంలో హరితహారం ద్వారా ఒకటిన్నర ఎకరంలో ఒకేచోట పెద్ద మొత్తంలో మొక్కలు నాటి సంరక్షించడం బాగుందన్నారు. గ్రామాల్లో మొక్కలునాటి పచ్చదనాన్ని పెంపొందించడానికి దేశంలో ఇతర పంచాయతీలకు ముఖరా(కె) ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. -
హరిత ప్రణాళికలు సిద్ధం
సాక్షి, హైదరాబాద్: పచ్చదనం, పరిశుభ్రత పెంపొందించే ప్రధాన లక్ష్యంతో చేపడుతున్న 30 రోజుల ప్రణాళికలో భాగంగా రాష్ట్రంలోని పంచాయతీల్లో హరిత ప్రణాళికలు సిద్ధమయ్యాయి. రాష్ట్రంలోని 530 గ్రామాల్లో మినహా మొత్తం 12,221 పంచాయతీల్లో గ్రీన్ ప్లాన్ రూపొందించుకున్నట్లు గ్రామ పంచాయతీల నుంచి ప్రభుత్వానికి అధికారులు నివేదికలు అందజేశారు. ఈ ప్రణాళికలో భాగంగా పెద్దసంఖ్యలో మొక్కలు నాటడం, నాటిన మొక్కలను కాపాడుకోవడం ముఖ్యకర్తవ్యంగా నిర్దేశించుకున్నారు. గ్రామాల్లోని నర్సరీల్లో మొక్కలు పెంచడం, వాటిని గుర్తించినచోట్ల నాటడం, ఇళ్ల పరిసరాల్లో నాటేందుకు యజమానులకు పంపిణీ చేయడం, వాటి సంరక్షణ చర్యలను గురించి హరిత ప్రణాళికల్లో వివరిస్తున్నారు. 12,250 గ్రామాల్లో వార్షిక ప్రణాళిక .. ప్రస్తుతం గ్రామాల్లో 30 రోజుల ప్రణాళిక చురుకుగా అమలవుతున్న నేపథ్యంలో 12,250 గ్రామాల్లో వార్షిక ప్రణాళికకు తుదిరూపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న 30 రోజుల పల్లె ప్రగతి ప్రణాళికను స్ఫూర్తిగా తీసుకుని ఏడాది పొడవునా నిర్వహించేలా 365 రోజుల ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ తీర్మానాలను పంచాయతీ, గ్రామసభల్లో తీర్మానం చేసుకుని ఏడాది అంతా అభివృద్ధి పనులు కొనసాగించే దిశలో చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. గ్రామాల్లో నియమితులైన స్టాండింగ్ కమిటీ సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు, పంచాయతీల పాలకవర్గాలు ఈ ప్రణాళికలను రూపొందించుకుంటున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 12,751 గ్రామ పంచాయతీలకు గాను 12,250 గ్రామాల్లో వార్షిక ప్రణాళికలు సిద్ధమైనట్టు పీఆర్‌శాఖ అధికారులు తెలియజేశారు. ఈ వార్షిక ప్రణాళికలు రూపొందించుకున్న గ్రామాలు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయానికి తమ నివేదికలను అందజేసినట్టు సమాచారం. వార్షిక ప్రణాళికలో భాగంగా వారంలో ఒక రోజు వీధుల్లో, గ్రామంలో ఒక రోజు గ్రామస్తులంతా కలిసి శ్రమదానం, మొక్కలు నాటడంతోపాటు గ్రామసభల్లో అందరూ కలిసి కొత్త నిర్ణయాలు తీసుకునే విధంగా ప్రణాళిక తయారు చేసుకుంటున్నారు. -
పత్తికి తెగుళ్ల బెడద
=మొదటితీత దశలోనే ప్రారంభం =పది రోజుల వ్యవధిలోనే చనిపోతున్న మొక్కలు =రైతుల బెంబేలు =సర్వే చేస్తున్నామంటున్న అధికారులు మచిలీపట్నం, న్యూస్‌లైన్ : పత్తి పైరుకు తెగుళ్ల బెడద సోకింది. దీంతో మొదటితీత దశలోనే పచ్చని మొక్కలు నిలువునా ఎండిపోతున్నాయి. ఆఖరి దశలో పత్తి మొక్క ఆకులు రంగుమారే అవకాశం ఉందని, ఈ ఏడాది మొదటితీత దశలోనే వైరస్ (ఎర్ర తెగులు) వ్యాపించి తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ముంచుకొచ్చిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది అదనుకు వర్షాలు పడినా వైరస్ తెగులుతో పాటు పురుగుల బెడద అధికం కావటంతో పత్తి సాగు చేసిన రైతులకు నష్టాలే మిగులుతాయనే భావన వ్యక్తమవుతోంది. పనిలో పనిగా ప్రభుత్వం కల్పించిన మద్దతు ధరకు పత్తిని కొనుగోలు చేయకుండా తేమ సాకు చూపి దళారులు తమ ఇష్టానుసారం ధర నిర్ణయిస్తున్నారు. వచ్చిన తెగులేమిటో తెలుసుకుని మందులు వాడేలోపే మొక్కలు చనిపోతుండటంతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 1.50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరుగుతుందని ఆశించగా, 1.37 లక్షల ఎకరాల్లోనే సాగు చేపట్టారు. జిల్లాలోని మైలవరం, గంపలగూడెం, తిరువూరు, రెడ్డిగూడెం, జి.కొండూరు, ఎ.కొండూరు తదితర ప్రాంతాల్లో పత్తి అధికంగా సాగైంది. ప్రారంభదశలోనే పైరుకు తెగుళ్లు సోకటంతో పత్తి రైతులు విలవిల్లాడుతున్నారు. నాణ్యమైన బీటీ విత్తనం సరఫరా కాకపోవటం వల్ల పైరు ప్రారంభ దశలోనే తెగుళ్ల బారిన పడిందని రైతులు చెబుతున్నారు. ఖర్చులు తడిసిమోపెడు... విత్తనం ఖర్చు, అరక దున్నటం, పైపాటు, పురుగు మందుల పిచికారీ, కౌలు చెల్లింపు లెక్క వేసుకుంటే ఎకరానికి రూ.30 నుంచి రూ.35వేలు ఖర్చు అవుతుందని రైతులు చెబుతున్నారు. క్వింటాలు పత్తి తీయాలంటే రూ.800 కూలి ఖర్చు అవుతుందని, దీనిని లారీ వద్దకు చేర్చేందుకు ఖర్చులు అదనమని రైతులు అంటున్నారు. సారవంతమైన భూములకు ఎకరానికి రూ.15 వేలు కౌలుగా ముందే చెల్లించామని, ప్రారంభదశలోనే తెగుళ్లు సోకటంతో ఖర్చులైనా వస్తాయో లేదోనని ఆందోళనకు గురవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో మొదటితీత తరువాత పత్తిపంట పూత, గూడ తొడుగుతున్న దశలో వైరస్ తెగులు సోకి వారం, పదిరోజుల వ్యవధిలోనే ఆకులు నల్ల రంగులోకి మారి మొక్కలు చనిపోతున్నాయని రైతులు చెబుతున్నారు. పత్తికి కనీసంగా ఎనిమిది తీతలు తీస్తామని, మొదటిదశలోనే తెగుళ్లు సోకటంతో దిక్కుతోచటం లేదని వాపోతున్నారు. తేమ శాతం పేరుతో టోకరా... గత ఏడాది క్వింటాలు పత్తికి రూ.3,900 మద్దతు ధర ప్రకటించిన ప్రభుత్వం ఈ ఏడాది మొక్కుబడిగా రూ.100 పెంచి రూ.4 వేలు మద్దతు ధరగా నిర్ణయించింది. మరోపక్క వ్యాపారులు తేమశాతం అధికంగా ఉందనే సాకు చూపి రైతులను నిలువునా దోచేస్తున్నారు. వారు క్వింటాలు పత్తికి రూ.2,200 నుంచి రూ.3,200 వరకు మాత్రమే ధర చెల్లిస్తున్నారు. నాణ్యమైన పత్తికి బంగ్లాదేశ్, పాకిస్తాన్, చైనా దేశాల్లో మంచి డిమాండ్ ఉందని, అయినా ప్రభుత్వం ఎగుమతులకు చర్యలు తీసుకోవడం లేదని రైతులు పేర్కొంటున్నారు. సర్వే చేస్తున్నాం - బాలునాయక్, వ్యవసాయశాఖ జేడీ పత్తికి వైరస్ తెగులు వ్యాపించిందనే విషయం మా దృష్టికి వచ్చింది. వ్యవసాయశాఖ అధికారులు, సిబ్బంది బృందాలుగా ఏర్పడి పరిశీలన చేస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లో దీనిపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం. ఎర్రతెగులు పత్తికి రావటం సహజమే అయినా ముందస్తుగా రావటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. వ్యవసాయాధికారుల సూచనలు పాటిస్తే తెగులును అరికట్టే అవకాశముంది.