
సాక్షి, ఎన్టీఆర్: టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ పోలీసు స్టేషన్‌లో హల్‌చల్ చేశారు. పోలీసులే గంజాయి అమ్మిస్తున్నారని ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపించారు. గంజాయి అమ్మకాలకు కొమ్ముకాస్తున్నారంటూ పోలీసులపై మండిపడ్డారు. దీంతో, పోలీసుల వ్యవహారం, ఎమ్మెల్యే వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
వివరాల ప్రకారం.. ఇద్దరు టీడీపీ కార్యకర్తలు సాయి సుమిత్, రామకృష్ణ మధ్య మంగళవారం ఘర్షణ జరిగింది. దీంతో ఇద్దరు పచ్చ పార్టీ కార్యకర్తలను తిరువూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, వీరిలో ఎంపీ వర్గానికి చెందిన సాయి సుమిత్‌ను పోలీసులు వదిలేశారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే కొలికపూడి వర్గానికి చెందిన రామకృష్ణపై పోలీసులు సెక్షన్-307 కింద కేసు పెట్టారు. అయితే, ఈ ఘర్షణ తర్వాత రామకృష్ణ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో పోలీసులు.. అతని తల్లి రాఘవమ్మ, సోదరి వరలక్ష్మీలను స్టేషన్‌కు తీసుకువచ్చారు.
ఇక, ఇదే సమయంలో తిరువూరు పోలీసు స్టేషన్‌లో ఓ సెటిల్‌మెంట్ కోసం టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి వెళ్లారు. ఈ సందర్బంగా రామకృష్ణ కుటుంబ సభ్యులను చూసిన కొలికపూడి.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రామకృష్ణపై దాడి చేసిన వారిని స్టేషన్‌కు పిలిపించే వరకూ కదిలేది లేదంటూ హంగామా చేశారు. ఒక్కరిపైనే ఎలా కేసు పెడతారని ప్రశ్నించారు. అలాగే, పోలీసులే గంజాయి అమ్మిస్తున్నారని ఆరోపించారు. పోలీసులే గంజాయి అమ్మకాలకు కొమ్ము కాస్తున్నారంటూ స్టేషన్‌లో రచ్చ చేశారు. దీంతో, ఏం చేయాలో తెలియక పోలీసులు ఖంగుతిన్నారు.
