చెయ్యేరులో ఇసుకదందా! | Sand trafficking | Sakshi
Sakshi News home page

చెయ్యేరులో ఇసుకదందా!

Dec 17 2014 3:27 AM | Updated on Sep 2 2017 6:16 PM

చెయ్యేరులో ఇసుకదందా అడ్డూఅదుపులేకుండా సాగుతోంది. అధికార పార్టీ నేతలుగా చెలామణి అవుతున్న కొందరి కనుసన్నల్లో భారీగా ఇసుకను తోడేస్తున్నారు.

 రాజంపేట: చెయ్యేరులో ఇసుకదందా అడ్డూఅదుపులేకుండా సాగుతోంది. అధికార పార్టీ నేతలుగా చెలామణి అవుతున్న కొందరి కనుసన్నల్లో భారీగా ఇసుకను తోడేస్తున్నారు. దాడి చేసే అధికారులకు దొరకకుండా ఉండేందుకు సొంతంగా నిఘా ఏర్పాటు చేసుకున్నారు. అధికారులు వాహనాల్లో వేగంగా చేరుకోకుండా సొంతంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసుకున్నారంటే ఈ దందా ఏ స్థారుులో జరుగుతోందో అర్థమవుతుంది.  రెవిన్యూ డివిజన్ పరిధిలోని రాజంపేట, నందలూరు, పెనగలూరులో ఇసుకమాఫియా పెట్రేగిపోతోంది. ఈ మాఫీయాకు అధికారపార్టీ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. కొందరు అధికారులు సైతం వారితో మిలాఖత్ అయ్యారన్న  విమర్శలున్నాయి. చెయ్యేరు నది రాజంపేట, నందలూరు, పెనగలూరు మండలాలకు అనుకూలంగా ఉండటంతో అడ్డదారులు ఏర్పాటుచేసుకుని ఇసుకను అడ్డూఅదుపూ లేకుండా తోడేసుకుంటున్నారు. రాత్రి వేళల్లో వందలాది ట్రాక్టర్లలో ఇసుక రవాణా జోరుగా సాగుతోంది. రాజంపేట సబ్‌డివిజన్ పరిధిలోని రెండు పోలీస్‌స్టేషన్లకు మాముళ్లు అందుతున్నాయన్న ఆరోపణలు వినపడుతున్నాయి.
 
 మందరం వయా రాజంపేట మీదుగా...
 చెయ్యేరు నది పరిధిలోని మందరం(రాజంపేట) కేంద్రంగా ఇసుక అక్రమరవాణా సాగిస్తున్నారు. అనధికారిక క్వారీలను ఏర్పాటుచేసుకొని ఏటికి వెళ్లే రహదారిలో గేట్ పెట్టుకున్నారు. దానికి తాళాలు కూడా వేస్తారు. చెయ్యేరులోకి దారులు ఏర్పాటుచేసుకొని వందలాది ట్రాక్టర్లతో ఇసుకను రవాణా చేసుకుంటున్నారు.
 
  అక్రమరవాణాకు పటిష్టమైన నిఘా వ్యవస్థను సైతం ఏర్పాటు చేసుకున్నారు. బెస్తపల్లె, మందరం, ఇసుకపల్లె, తాళ్లపాక(ఆర్చి) మర్రిపల్లెతోపాటు యేటి పరిసరాల్లో బృందాలుగాా ఉంటూ రవాణా విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అధికారులో, విజిలెన్స్ వస్తున్నారంటే వెంటనే ట్రాక్టర్లు, ఇసుక నింపే కూలీలు చెయ్యేటిలో నుంచి సురిక్షిత ప్రాంతానికి చేరుకుంటారు. మందరం నుంచి పుల్లంపేట, రైల్వేకోడూరు, చిట్వేలితోపాటు తదితర ప్రాంతాలకు ఇసుక రవాణా జరుగుతోంది.  
 
 భారీగా ఫైన్ వేస్తున్నా..
 పోలీసు, రెవిన్యూ అధికారుల కన్నా విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించిన తరుణంలో పట్టుబడిన డంప్, రవాణా చేసే వాహనాలను సీజ్ చేసి భారీగా పైన్ వేస్తున్నా వీరు వెనుకంజ వేయడంలేదు. నందలూరు మండలంలోని కుమరనిపల్లెలో అధికారిక  క్వారీ ఉంది. దాని ముసుగులో ఇతర ప్రాంతాల నుంచి అక్రమంగా రవాణా చేస్తున్నారు.  
 
 అనధికారిక క్వారీ ఇసుకకే డిమాండ్
 సర్కారు మహిళా సంఘాల ద్వారా ఇసుక అమ్మకం చేపట్టినా వాటి కంటే అనధికార క్వారీల ఇసుకకే డిమాండ్ ఉంది. మహిళా సంఘాల ద్వారా ఇసుకతవ్వకంతోపాటు ఇంటికి సరఫరా చేసేందుకు కిలోమీటర్‌కు రూ.30చొప్పున, క్యూబిక్‌మీటరు రూ650 లెక్కన అమ్మకాలు జరుగుతున్నాయి. మీసేవ, బిల్లుల సమస్య లాంటివి లేకుండా అనధికారిక క్వారీ నుంచి రిస్క్ లేకుండా ఇంటికి ఇసుకను  చేర్చుతుండడమే కారణం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement